సైకిల్ గొప్పతనం.
సైకిల్ గొప్పతనం.


సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. తనకు ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్ వాళ్ళ నాన్న సురేష్ కి ఇచ్చాడు. అసలు విషయం ఏంటంటే ఆ సైకిల్ మాట్లాడగలదు, ఆ సంగతి సురేష్ కు తెలియదు. సురేష్ కూరగాయల వ్యాపారం చేసేవాడు. ప్రతి రోజు సైకిల్ మీద కూరగాయలు పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్మే వాడు. ఆ వచ్చే డబ్బులు ఇంటి సరుకులు, ఖర్చులకు, సరిపోయేవి. కాని పాపం ఆ సైకిల్ ఎంతో బరువును మోస్తుంది. అలా ఒకరోజు సురేష్ వెళ్తుండగా ఒక మోటార్ బైక్ ను చూశాడు.
అరే!
ఈ మోటారు బైకు భలేఉందే దీని మీద నేను కూరగాయలు అమ్మితే నాకు అలుపు రాదు, ఇంకా చాలా దూరం ప్రయాణించవచ్చు,పక్క ఊర్లో కూడా నేను కూరగాయలు అమ్మొచ్చు, అని అనుకుంటాడు. ఈ మాటలన్ని సైకిల్ వింటుంది. సురేష్ మరసటి రోజు వెంటనే మోటార్ బైక్ ను ఇంటికి తెస్తాడు. సైకిల్ని మాత్రం ఒక మూలన పడేస్తాడు. సైకిల్ కి ఎంతో బాధేసింది. సురే
ష్ కూరగాయలన్నీ మోటార్ బైక్ మీద పెట్టుకొని అమ్మడం మొదలు పెట్టాడు. అలా అన్ని ఊళ్లు తిరిగి కూరగాయలన్నీ అమ్మేస్తాడు. కానీ సురేష్ కి ఏమి లాభం రాలేదు. అప్పుడు ఆలోచించాడు "సగం డబ్బు పెట్రోల్ కే అయిపోయింది. అయ్యో! నేను ఈ విషయం ఆలోచించనే లేదు పెట్రోల్ ధరలు అంబరాన్ని తాకాయి మరి నాకు లాభం ఎలా వస్తుంది"అని మళ్ళీ మోటార్ బైక్ ను తిరిగి ఇచ్చేశాడు. సురేష్ సైకిల్ ని మళ్ళీ తీస్తాడు. సైకిల్ "నేను రాను పో !నన్ను వదిలేసి ఆ బైక్ ను పట్టుకున్నావు కదా" అని అంటుంది. సురేష్ కి ఆశ్చర్యమేస్తుంది."ఏంటి? నువ్వు మాట్లాడతావా! ఇంతవరకు నాకు తెలియనే తెలియదు. ఇంకోసారి నిన్ను వదిలి పెట్టనులే, నువ్వైతే రూపాయి ఖర్చు లేకుండా నాకు లాభాన్ని తెస్తావు, నాకు మంచి గుణపాఠం నేర్పావు నన్ను క్షమించు!" అన్నాడు. సరేలే "నిన్ను క్షమించానులే, పదా మళ్లీ కూరగాయలు అమ్ముకుందాం" అని సైకిల్ అంటుంది.