బోసి నవ్వులు
బోసి నవ్వులు
బోసి నవ్వుల బుజ్జాయిని
తల్లిదండ్రుల అపురూపాన్ని
రేపటి ఆశల వారధిని
కలల సౌధానికి బాటసారిని
రాబోయే తరానికి వారసత్వాన్ని
మానవజాతి ఆణిముత్యాన్ని
అమాయకపు ఆరిందాల
అల్లరి పిడుగుని
స్వచ్చమైన గలగలా
పారే గోదారి ఉరవడుల సవ్వడిని
కాలుష్యం అంటని నిర్మలమైన
మలయ మారుతాన్ని
కల్మషం ఎరుగని కదంబ పుష్పాన్ని
గగనాన మెరిసిన మేలిమి తారకని
చిలుక పలుకుల
చిట్టిపొట్టి మిఠాయిని
జలతారు వెన్నెలను
జాలువారించే జాబిల్లిని
కొలనులో విరిసిన
లేలేత అందాల
కలువ పువ్వుని
నందనవనంలో విరబూసిన
నాగ మల్లికని
మనోహరమైన రంగురంగుల సీతాకోకచిలుకని
ప్రేమను పంచుకునే
చిలకా గోరింకల ప్రతిరూపాన్ని ..!
