SATYA PAVAN GANDHAM

Children Stories Inspirational Children

3.6  

SATYA PAVAN GANDHAM

Children Stories Inspirational Children

ఓ... అ"నాధ"

ఓ... అ"నాధ"

7 mins
386



అదొక విలాసవంతమైన భవనం. విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో చాలా అందంగా అలకరించబడింది. చుట్టూ వందల మంది జనం. అందులో అందరూ దాదాపు ప్రముఖులే. ఎన్నాళ్ళకో ఈ ఈవెంట్ ద్వారా కలిసినట్టున్నారు. ఒకరికొకరు చాలా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు.

ఇంతకీ ఆ ఈవెంట్ అంతా ఒక బర్త్ డే పార్టీ కి సంబంధించినది.

తన పేరు "సత్య". తనది ఒక ఉన్నత కుటుంబం. పేరు ప్రఖ్యాతలలోనూ, ఆస్తి పాస్తులలోనూ "సత్య" తల్లిదండ్రులకి కొదవ లేదు. వాళ్ళు చేసుకున్నది ప్రేమ పెళ్లి కావడంతో అటు, ఇటు తరుపున బంధువులు వదిలేసినా తమ కాళ్లపై తాము స్వతంత్రముగా నిలబడి, చాలా కష్ట పడి కొన్ని వేళ కోట్ల సంపదకు అధిపతులయ్యారు వాళ్లిద్దరూ...

కాల క్రమేణా వాళ్ల కుటుంబీకులు వాళ్ళతో ఆకరికి కలిసినా చివరకి అందరూ కాలం చేశారు.

ఎల్లప్పుడూ చుట్టూ పదుల సంఖ్యలో ఇంట్లో పనివాళ్ళు... 

వందల సంఖ్యలో కంపెనీలు, ఆ కంపెనీలలో పనిచేసే కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగులు, వాటి ద్వారా ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల కోట్లలో వారికి వచ్చే ఆదాయం.

ఇది జీవితంలో అన్నీ ఎత్తుపల్లాలను చవి చూసి, ఓ తారా స్థాయికి చేరుకున్న ఆ దంపతులిద్దరి ప్రస్తుత కథ.

నిజానికి "సత్య" పుట్టిన తర్వాతే వాళ్ళకి కలిసొచ్చింది.

ఆరోజుతో సత్య వయసు సరిగ్గా పదేళ్లు నిండడంతో...

ఆ తన పదవ పుట్టిన రోజు వేడుకలను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు ఆ తల్లిదండ్రులిద్దరూ.

అంతటి ఆస్తి పాస్తి ఉన్నవాళ్లు, ఒక్కగానొక్క కొడుకు బర్త్ డే ఎంత వైభవంగా ప్లాన్ చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవరం లేదనుకుంటా...

ఎక్కడెక్కడి నుండో అతిథులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిధులుగా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు పొందిన రాజకీయ నాయకులకి, సినిమా రంగం వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన పారిశ్రామిక రంగం వాళ్లకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇంకా ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళకి తమ బిడ్డ పుట్టిన రోజు వేడుకకి ఆహ్వానం అందించి వారిందరి నడుమ చాలా గ్రాండ్ గా ఆ పార్టీ నీ చేయడానికి పూనుకున్నారు సత్య తల్లిదండ్రులు..

ఇక అక్కడికి విచ్చేసిన అతిధుల వినోదం కోసం హాస్యభరిత, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు భోజనాలను ఏర్పాటు చేశారు వాళ్ళు... 

వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దేశ నలుమూలల నుండి రుచికరమైన వంటకాలు, వాటిని ప్రిపేర్ చేయడానికి దేశంలోనే పేరు పొందిన చీఫ్ చెఫ్స్ ని ఏర్పాటు చేశారు.

అక్కడికి విచ్చేసిన ఆ ముఖ్య అతిథులంతా తన పుట్టిన రోజు సందర్భంగా తనకి తమ ఆశీర్వాదాలు మరియు శుభాభినందనలు అందిస్తుంటే "సత్య" కి ఎక్కడ లేని ఆనందం, దానిని మించి తన మనసంతా ఒకింత సంతోషంతో ఒళ్లంతా పులకరిస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ అడుగు తీసి బయట పెట్టింది లేదు మరి తను. ఆ ఇల్లు, తన స్కూల్ మరియు తన స్నేహితులు తప్ప బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలు కూడా లేవు.

సరిగ్గా అప్పుడే అంత మంది సమక్షంలోనే సత్య తల్లిదండ్రులు ఒక అనౌన్స్మెంట్ చేశారు.

అదేంటంటే,

అప్పటివరకూ తాము సంపాదించి కూడబెట్టిన ఆ ఆస్తంతా.. తమ తదనానంతరం దేశంలోనున్న అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు మాత్రమే అదంతా చెందేట్టు, అందులో ఒక చిల్లి గవ్వలో కూడా తమ కొడుక్కి హక్కు ఇవ్వబోవడం లేదంటూ తేల్చిచెప్పేస్తూ తాము ఒక వీలునామా రాసినట్టు ఆ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు.

సత్య తల్లిదండ్రులు తీసుకున్న ఆ నిర్ణయంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంతా వాళ్ల నిర్ణయాన్ని ఒక అనాలోచిత నిర్ణయంగా, వాళ్ళని ఒక పిచ్చి వాళ్లుగా భావించారు.

ఇక వాళ్ళు ఆ షాక్ నుండీ తేరుకునే లోపు సత్య తల్లిదండ్రులిద్దరూ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ...

వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వివరించసాగారు.

"నిజానికి తమలా తమ కొడుకు కూడా కష్టపడి కింద నుండి పైకి రావాలనే ఉద్దేశ్యం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం లేదని,

ఒకప్పుడు తమ దగ్గర ఏమీ లేనప్పట్టికి, ఇప్పుడు అన్నీ ఉన్నప్పటికీ వాళ్ల చుట్టూ జరిగిన పరిణామాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటూ ...

తమ చుట్టూ చేరి నిరంతరం ఊసరవెల్లిలా రంగులు మార్చే సన్నిహితులు , శ్రేయభిలాషులలోనీ గుణాలను పరిపక్వతతో తాము గుర్తించినట్టే తమ కొడుకు కూడా అలాంటి వారిని గుర్తించి పరిణితి చెందాలని, దానికి తగ్గట్టుగా తమ కొడుకుని తీర్చిదిద్దాలని ఓ ఆకాంక్ష. అది కొంచెం కఠోరమైనదే కానీ, తన బిడ్డ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదు.

అదే కాక, కొన్ని లక్షల అనాధ పిల్లలకు, వృద్ధులకు తమ ఈ నిర్ణయం ద్వారా కాస్తైనా సహాయం అందుతుందని,

వాళ్ళకి కొంచెమైనా ఉపయోగకారంగా ఉంటుందని,

తమలా మరింత మంది సంపన్నులు కూడా ఇలానే ఆలోచించి ముందుకు వస్తె ఈ సమాజంలో పేదరికం అనే మహమ్మారిని పూర్తిగా సంహరించవచ్చని, ఇలాంటి గుణాన్ని తమ బిడ్డ కూడా తమ దగ్గర నుండి అలవరచుకుంటాడని" వాళ్లకి ఒక ఆశ.

ఇక వాళ్ల ఆ అనౌన్స్మెంట్ అయిపోగానే,

తమ ఇంట్లో పనిచేసే పని వారికి సత్య చేతుల మీదుగా పట్టు బట్టలు పంచిపెట్టడం, తమ కంపనీలో ఉద్యోగులకు ఆ సందర్భంగా బోనస్ లు ప్రకటించడం లాంటివి చేశారు వారు.

చివరికి సత్య తో తన పేరెంట్స్ వాళ్ళందరి సమక్షంలో కేక్ ని కట్ చేయించడం. అనంతరం అక్కడున్న సత్య స్నేహితులు, సన్నిహితులు అంతా కలిసి తనని బహుమతులతో తమ విషెస్ తో ముంచెత్తుతుంటే, వారి ఆ ఆనందాల హరివిల్లుల మధ్య చాలా చక్కగా, మరింత ఆర్భాటంగా సాగిపోతుంది ఆ కార్యక్రమం. ఇంతమంది మందిలో ఇంతకు మునిపెన్నడూ ఇలాంటి వాటికి నోచుకోని తనకి అదంతా ఒక కలలా అనిపిస్తుంది.

                      *************

తనకి అలా అదంతా ఓ కల అనిపించింది లేదో, సరిగ్గా అప్పుడే తనకి మెళుకువ వచ్చి

(తను ఉంటున్న ఆ అనాధ ఆశ్రమంలోనీ వార్డెన్ అప్పటికే తనని తట్టి తట్టి నిద్ర లేపడం వల్లన..)

ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు సత్య. అంతకుముందు తన కళ్ళ ముందు కదలాడిన సన్నివేశాలు అన్ని ఒక్కసారిగా మాయమయ్యాయి. ఆ ఇరుకు గదిలో చుట్టూ ఎటు చూసినా చీకటి వాతావరణమే!

అంటే, "ఇప్పటి వరకూ జరిగినదంతా తనకొచ్చిన ఓ కల!"

అని మీరు అనుకుంటున్నది నిజమే!

కానీ, ఆ కల

ఒకప్పటి నిజం,

ఇప్పటి గతం,

ఎప్పటికీ తనకొక జ్ఞాపకం.

ఎలాగంటారా?

వచ్చిన ఆ కలంతా చివరి సంవత్సరం తనకి జరిగిన ఓ గతమే. ఆ ఈవెంట్ వాళ్ల పేరెంట్స్ కండక్ట్ చేయడం, అందులో వాళ్ళు ఆ వీలు నామా ప్రకటన చేయడం, అంతా నిజమే!.

కానీ, ఆ తర్వాత ఒక ఆరు నెలలకు తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక కార్ ఆక్సిడెంట్ లో అనుకోకుండా చనిపోవడం, ఆ ఆస్తి అంతా వాళ్ళు వీలునామా రాసినట్టుగా దేశంలో ఉన్న అనాధశ్రమాలకి, వృద్ధాశ్రమాలకు చెందడంతో...

సత్య రోడ్డున పడ్డాడు. తనని చెరదీసేవాల్లు కరువయ్యారు. నా అన్నవాల్లు లేక తానొక అనాధగా మిగిలిపోయాడు.

తన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరమయ్యే సరికి, వాళ్ల ద్వారా సహాయం పొందిన వాళ్ళు మొహం చాటేశారు.

తనకి ఆ ఆస్తి కూడా లేకపోయేసరికి, సత్య నీ చెరదీయల్సింది వాళ్ళే, వాళ్లకేం పట్టనట్టు తనని అనాధగా వదిలేసారు.

చివరికి ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళు తనని ఒక అనాధశ్రమంలో చేర్పిస్తే అక్కడే స్థిరపడ్డాడు.

సత్య తల్లిదండ్రులు చేసిన సాయానికి కనీస కృతజ్ఞతగా...

ఆ పిల్లాడి పై కనీసం ఓ చిన్న కృతజ్ఞత కూడా చూపించలేక పోయారు తన తల్లిదండ్రులుచే సాయం పొందిన వాళ్ళు.

చివరికి తానొక అనాధ గా మిగిలిపోయి అనాధశ్రమానికి పరిమితమయ్యాడు.

ఇప్పుడు తన జీవితం ఒక్కప్పటికి పూర్తిగా వ్యతిరేకం.

ఒకప్పుడు కళ్ళు తెరిస్తే తను చుట్టూ అన్ని సదుపాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు తన చుట్టూ కనీస సదుపాయాలు కూడా లేవు.

దానికి తోడు లాలించే అమ్మ ప్రేమ కరువైంది. దైర్యం చెప్పే నాన్న మాటలు దూరమయ్యాయి. అంతకముందు వరకూ చుట్టాలు, సన్నిహితులు చూపించిన ఆ కపటి ప్రేమలు, వాత్సల్యాలు ఇప్పుడు ఏ కోశానా కనిపించడం లేదు.

ఒకప్పుడు తన తల్లి లాలనతో ఒడిలో కమ్మగా నిద్రపోయిన తను, ఇప్పుడు ఇరుకు గదిలో తన తల్లి పాడిన ఆ జోల పాటను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతిరోజూ నిద్రపోతున్నాడు.

ఒకప్పుడు తనకేది కావాలో అడక్కుండానే అందిచే తండ్రి లేకపోవడంతో, ఇప్పుడు తనకేది కావాలన్నా ఎవరిని గట్టిగా అడగలేని పరిస్థితి.

పెద్ద పెద్ద ప్రైవేటు స్కూల్స్ లో చదివిన తను, ఇప్పుడు కనీస వసతులు కూడా లేని ఒక ప్రభుత్వ పాఠశాలకి పరిమితమయ్యాడు.

మూడు పూటలా షడ్రుచులతో కడుపు నింపుకున్న తను, ఇప్పుడు చాలి చాలని చప్పిడి భోజనంతో సరిపెట్టుకుంటున్నాడు.

బ్రాండెడ్ బట్టలు కట్టిన తను, ఇప్పుడు చిరిగిన బట్టలతో సర్దుకుంటున్నాడు.

ఒకప్పుడు ఏ చేతులతో అయితే తను అందరికీ పట్టు బట్టలు పంచిపెట్టాడో, ఇప్పుడు అదే చేతులతో ఆ ఆశ్రమానికి వచ్చే వాళ్ల దగ్గర తను కట్టుకోవడానికి ఒక మంచి గుడ్డ కోసం చేతులు చాస్తూ ప్రాధేయపడుతున్నాడు.

ఎప్పుడూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన తను, ఇప్పుడు తన దరికి ఎవరూ రాక, అందరూ దూరం అవడంతో ఒంటరయ్యాడు.

ఒకప్పుడు అందరి కౌగిళ్లలో అల్లారుముద్దుగా పెరిగిన తను,

ఇప్పుడు ఈ సమాజం తనని ఒక అంటరాని వాడిగా చూస్తూ వేరు చేయడంతో ఏకాకిగా మిగిలాడు.

హమ్...

కాలం అనేది ఎంత మార్పు తీసుకొచ్చింది తన జీవితంలో...

ఆ చిన్న వయసులోనే కాలం అనేది తనకి జీవితం యొక్క విలువను తెలియజేసింది.

ఆ చిన్న వయసులోనే చాలా పాఠాలను, ఒడిదుడుకులను నేర్పించింది.

నిజమే ఈ కాలమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు.

ఓడలని బండ్లు చేస్తుంది, బండ్లను ఓడలు చేస్తుంది.

తన ఆ జీవిత ప్రయాణం ఒక్కసారిగా ఏసీ బోగి నుండి జనరల్ బోగి కి మారేసరికి అప్పటివరకూ తనతో కలిసి ప్రయాణం చేసిన వారందరూ తనని ఒంటరిని చేసి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ క్షణం జీవితమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని తనకి అర్థమైంది.

చివరికి సత్య తల్లిదండ్రులు ఊహించిందే జరిగింది. అప్పుడే ఆ రోజు తన బర్తడే ఫంక్షన్ లో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు వచ్చి నిరాశ నిస్పృహతో కృంగిపోతున్న తన మెదడును తట్టి లేపుతున్నాయి.

అప్పుడప్పుడే పరిస్థితుల ఈత నేర్చుకుంటున్న తనకి, జీవితమనే మహాసముద్రాన్ని ఈదడం ఒక పెను సవాలుగా మారింది. తన జీవితమనేది ఇప్పుడే మొదలైనట్టు తనకి అర్థమైంది. అలసిపోయి వెనకడుగు వేయకుండా తన తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాడు.

కాలం గడుస్తుంది. సత్య కొద్దీ కొద్దిగా తను ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులకి, తన రోజువారీ దిన చర్యకు అలవాటు పడుతున్నాడు.

ఇక అక్కడినుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు ఎదురైన కష్టాలు అన్నింటినీ తట్టుకుంటూ తన పై పడుతున్న విమర్శకుల రాళ్ళని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ వాటిని పేర్చుకుంటూ తన ప్రతి విజయానికి ఒక పునాదిగా మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు.

ఇక తను తన టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి ఒక మెరిట్ స్టూడెంట్ గా అవతరించాడు. ఇంటర్ లో గొప్ప విద్యార్ధిగా పేరు పొందాడు. తద్వారా తనకొచ్చిన స్కాలర్ షిప్ తో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తను....

ఒక మంచి ఐటీ కంపనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా క్యాంపస్ ఇంటర్వ్యులో జాబ్ సంపాదించాడు.

కొన్నాళ్ళకి తను జాబ్ చేస్తూ సంపాదించిన సంపాదనతో పాటు, తనకున్న విషయ పరిజ్ఞానం కూడా తోడై...

అతి తక్కువ కాలంలోనే, అతి చిన్న వయసులోనే ఒక ఐటీ కంపనీనే స్థాపించాడు. తనలాంటి ఎంతో మంది అనాథ పిల్లలకు, పేద వారికి కూడా అందులో ఉపాధి కల్పించాడు.

అనతి కాలంలోనే దేశంలో తను ఒక బిలినియర్ గా ఉద్భవించాడు. తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి తన తల్లిదండ్రుల మార్గంలోనే సేవా కార్యక్రమాలకు దారపోసాడు. తనలాంటి ఆలోచనల కలవారిని కలుపుకుంటూ తానొక్కడిగా ముందుండి నడిపిస్తూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు.

పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం, ఐనవాల్లని కోల్పోయి తనలా అనాధలుగా మారిన పిల్లలకు ఆధునిక సదుపాయాలతో ఆశ్రమాలు ఏర్పాటు చేయడం. వృద్ధులకు వృద్ధాశ్రమాలు స్థాపించడం, అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి ఎన్నో, మరెన్నో మంచి-మంచి సేవా కార్యక్రమాలను తను స్థాపించిన ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారానే

చేపట్టాడు.

"సత్య ..."

సమాజంలో ఇప్పుడు తానొక వ్యక్తి కాదు, అంతకుమించిన ఓ మహా శక్తి.

ఒకప్పటి ఆ "అనాధే" ఇప్పడు ఎంతోమంది తన లాంటి వారి పాలిట "నాధుడయ్యడు".

తన తల్లితండ్రులు సంపాదించిన ఆస్తిపై ఏ మాత్రం ఆధారపడకుండా...

ఇప్పుడు తను, తనకి తాను సమాజంలో ఒక శక్తిగా ఎదిగాడు.

తన కొడుకు తన స్వశక్తితో మాత్రమే ఎదగాలి అనుకున్న తన తల్లిదండ్రుల చిరకాల ఆశయాన్ని సాకారం చేశాడు.

తన ఈ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రేమ, పెళ్లి అనే బంధాలను, తన కోరికలను త్యాగం చేసిన అతను, తన తల్లిదండ్రులులానే తన ఆస్తిని కూడా దేశంలో ఉన్న అనాధశ్రమాలకు, వృద్దాశ్రమాలకు ధారపోసాడు.

పట్టువదలని విక్రమార్కుడు సత్య.

వెనకడుగు వేయని అభిమన్యుడు సత్య.

ఈ జీవితమనే పద్మహ్యూహాన్ని చేదించాడు.

ఇదే అనేక వ్యధలతో నిండిన ఆ అ"నాధ" సత్య యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ.

రచయితగా నా విశ్లేషణ:

ఒక్కోసారి అప్పుడప్పుడు నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలతో మమేకమైన నాకు...

వాళ్ల ఒకప్పటి జీవితానికి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న జీవితానికి మధ్య వాళ్ళకి వాళ్లుగా చెప్పిన తేడాలు తెలిసి నా మనసుకు కలిగిన బాధతో, నేను సృష్టించిన ఈ కథ కల్పిత కథే అయినప్పటికీ...

ఎందుకో...

వాళ్ళలోనే కాదు, జీవితంలో అనేక ఇబ్బందులకు గురవుతూ, చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళన చెందుతూ, ఆత్మహత్యలు చేసుకునేంత ప్రేరేపణకు గురవుతున్న వారందరిలో ఈ కథ ద్వారా అందరిలో ఒక స్ఫూర్తిని నింపాలని నా ఈ చిన్న ప్రయత్నం, ఆకాంక్ష.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మనకి సానుకూలంగా, ఇంకొన్ని సార్లు మనకి ప్రతికూలంగా ఉంటుంది. కానీ, ఎప్పుడూ ఏది శాశ్వతం కాదు, అంతా తాత్కాలికమే అని చెప్పాలనే నా ఉద్దేశ్యం.

గీతలో కృష్ణుడు చెప్పినట్టు

"ఎంత ఆనందం వచ్చినా, ఎంత దుఖం వచ్చినా అది ఈ క్షణం వరకే!" అన్నట్టు

కాలానికి ఏదీ, ఎప్పుడూ, ఎవరూ అతీతులు కారు అన్నదే ఈ కథ యొక్క సారాంశం.

బంగారు పల్లెంతో పుట్టిన తనని ఏ కాలం అయితే కాటు వేసి కష్టాల ఊబిలోకి నెట్టేసిందో, ఇప్పుడు అదే కాలం తనకి మళ్ళీ పూర్వ వైభవాన్ని అందజేసింది.

అందరి జీవితాలు అంతే. కొన్ని సార్లు పడతాం మరికొన్ని సార్లు లేస్తామ్. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ కాలంతో పాటు కదులుతూనే మన ప్రయత్నాలు మనం చేయడం.

అప్పుడు అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది.

కాదు కాదు ఆ కాలంలో ఫలితాన్ని ఆశించకుండా, ఫలితమేదైనా నిరంతరం నిరుత్సాహ పడకుండా మనం చేస్తున్న ప్రయత్నాలే సమాధానం చెప్తాయి.

అందుకే మన పెద్దలు కూడా అంటారు కష్టే ఫలి అని.

నిరంతరం కష్ట పడదాం...

ఈ జీవితాన్ని ఆశ్వాదిద్ధాం.

మహా అయితే పోయేది ఏముంది...

ఫలితం సానుకూలమైతే సంతోషాలు దరికి చేరుతాయి.

అదే ఫలితం ప్రతికూలమైతే అనుభవాలు మిగులుతాయి.

నాలో నేను స్ఫూర్తిని నింపుకోవడానికి ఒక సామాజిక స్పృహతో రాసిన ఈ కథ మీకు కూడా ఒక సానుకూల దృక్పథంతోనే చేరుతుందని ఆశిస్తున్నాను.

ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.

రచన : సత్య పవన్✍️✍️



Rate this content
Log in