కలియుగ కర్ణుడు
కలియుగ కర్ణుడు
మొన్న ఆ మధ్య ఒకసారి, మా పిల్లలు నా దగ్గరకు వచ్చి,
"అమ్మా, ఇంతకు ముందు మాకు మహాభారతం చెప్తూ, అందులో కర్ణుడి గురించి చెప్పావు కదా !!
అడిగిన వారికి లేదు అనకుండా, ఆయన సహాయం చేస్తారు అని చెప్పావు.
ఆయన గురించి ఇంకొన్ని కథలు చెప్పవూ !!"
అనడిగారు ఆసక్తిగా.
సరే అంటూ, కర్ణుడి యొక్క దాన గుణం గురించి మరి కొన్ని కథలు చెప్పాను.
అవి విన్న తరువాత మా బాబు,
"అమ్మా, కర్ణుడి గురించి వింటూ ఉంటే, ఆయన దాన గుణం గురించి తెలుసుకుంటూ ఉంటే,
ఒక్కసారి ఆయనను చూడాలి అనిపిస్తుంది."
అన్నాడు.
ఆ మాటలకు మా పాప,
"అది ఎలా కుదురుతుంది తమ్ముడూ !!
కర్ణుడు ద్వాపరయుగం నాటి వ్యక్తి.
ఇప్పుడు మనం, కలియుగంలో ఉన్నాము
కదా !!
కనుక కర్ణుడిని చూడటం కుదరదు నాన్నా !!"
అన్నది.
వారి మాటలు వింటుంటే, వెంటనే మాకు ఒక ఆలోచన వచ్చింది.
నేను మా బాబు వంక తిరిగి,
"నువ్వు కర్ణుడిని చూడాలి అనుకుంటున్నావా,
లేక కర్ణుడి లాంటి గొప్ప మనసున్న వ్యక్తిని చూడాలి అనుకుంటున్నావా?"
అనడిగాను.
నా ప్రశ్నకు మా బాబు కాస్త ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో నేను హాల్ లోకి వచ్చి టీవీ పెట్టి,
సోనూ సూద్ గారిని చూపిస్తూ,
"ఇదిగో కర్ణుడు ఇలానే ఉండేవారు."
అని చెప్పాను.
ఆ మాటలకు మా బాబు,
"అమ్మో !! ఈ అంకుల్ అంటే నాకు చాలా భయం అమ్మా,
ఆయన పెద్ద విలన్ కదా !!
అయినా, నేను కర్ణుడిని చూపించమంటే నువ్వు సోనూ అంకుల్ ను ఎందుకు చూపిస్తున్నావు ??"
అని అడిగాడు ఆశ్చర్యంగా.
ఆ మాటలకు నేను నవ్వుతూ,
"సోనూ అంకుల్ సినిమాలలోనే విలన్ నాన్నా !!
నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తి.
కర్ణుడు ఎలా అందరికీ సహాయం చేసేవారో, అలాగే సోనూ అంకుల్ కూడా, ఎవరన్నా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిస్తే చాలు,
వెంటనే వారికి ఆ సహాయాన్ని అందిస్తారు.
అక్క చెప్పినట్టు నువ్వు చూపించమని అడిగిన కర్ణుడు ద్వాపర యుగం నాటి వారు కదా !!
ఆ కర్ణుడిని నీకు ఎలా చూపించాలో తెలియక, కర్ణుడి లాంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తిని చూపించాను."
అన్నాను.
ఆ మాటలకు మా పాప,
"అయితే ఈయన కలియుగ కర్ణుడా అమ్మా !!"
అనడిగింది.
కలియుగ కర్ణుడు, ఆ మాట వినడానికి ఎంత బావుందో కదా !!
"అవును అమ్మలూ, నువ్వన్నట్టు ఆయన కలియుగ కర్ణుడే అమ్మా !!"
అంటూ, సోనూ సూద్ గారు చేసిన, చేస్తున్న గొప్ప పనుల గురించి అర్థమయ్యేలా చెప్పాను.
అవి అన్నీ విన్న తరువాత, పిల్లలు ఇద్దరూ,
"అమ్మా, ఇవాల్టి నుంచి మేము సోనూ అంకుల్ ఫ్యాన్స్."
అన్నారు సంతోషంగా.
వెంటనే మేము పిల్లలను దగ్గరకు తీసుకుంటూ,
"సోనూ అంకుల్ ను అభిమానించడం మాత్రమే కాదు, ఆయనలా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి.
ఆయనలా, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి.
చేస్తారు కదా !!"
అని అన్నాము.
"తప్పకుండా చేస్తాము అమ్మా !!"
అన్నారు పిల్లలు ఇద్దరూ నవ్వుతూ.
నిజమే కదా !! సోనూ సూద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
అయినా, ఆయనను అభిమానించే వ్యక్తులుగా, ఆయన గురించి ఒక్క మాట మాత్రం చెప్పగలము.
సహాయం అనే పదానికి సరయిన, సరి కొత్త నిర్వచనం చెప్పి,
ఎందరికో ఆదర్శంగా నిలిచి, అందరిలో చక్కటి స్ఫూర్తి నింపిన, మన సోనూ సూద్ గారు
ఇలాగే మరెన్నో మంచి పనులు చేస్తూ, అందరికీ స్ఫూర్తిని అందివ్వాలని ఆకాంక్షిస్తున్నాము.
ఇంత మంచి మనసున్న ఆ వ్యక్తికి, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాము.
