Dinakar Reddy

Children Stories Comedy Children

4  

Dinakar Reddy

Children Stories Comedy Children

అమ్మా నాన్నా తప్పిపోయారు

అమ్మా నాన్నా తప్పిపోయారు

1 min
332


అసలు మిమ్మల్ననాలి. నేనిప్పుడు తీపికారాలు కావాలని అడిగానా. చిన్నారిని మీరు పట్టుకున్నారు అని నేను మసాలా వస్తువులు కొందామని ఆ పక్కకెళ్ళాను. నా చిన్నారి ఈ తిరునాళ్లలో ఎక్కడ తప్పిపోయిందో అని లక్ష్మి చీరతో కళ్ళు ఒత్తుకుంది. 


స్వామీ. కదిరి పున్నానికి నీ గుడికొస్తిమే కాటమరాయుడా. మా కండ్లల్ల నీళ్ళు తెప్పిస్తివి అని శ్రీనివాసు అనుకున్నాడు. 


ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరునాళ్ళకు వచ్చిన జనంలో తిరుగుతూ చిన్నారి చిన్నారి అని తమ నాలుగేళ్ల కూతురిని వెతుకుతున్నారు.


ఇంతలో పోలీసు శిబిరం మైకు లోంచి అనౌన్స్మెంట్ వినిపించింది. ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న లక్ష్మి ఇంకా తెలుపు షర్టు నీలం రంగు ప్యాంటు వేసుకున్న శ్రీనివాస్ అనబడే వ్యక్తులు తప్పిపోయినట్లు వాళ్ళ అమ్మాయి చెబుతోంది. దయ చేసి వారెక్కడ ఉన్నా శిబిరం వద్దకు రాగలరు అని.


చిన్నారి తల్లిదండ్రులకు ఒకే సమయంలో ఆనందం ఆశ్చర్యం కలిగాయి. ఇద్దరూ పరిగెడుతూ మైకు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక ఆడ పోలీసు కానిస్టేబుల్ పక్కన కూర్చుని తీపి కారాలు తింటూ ఉంది చిన్నారి. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగింది కానిస్టేబుల్.


అమ్మో. నేను శాస్త్రవేత్త అవుతానని చెప్పేస్తే ఇంకేమన్నా ఉందా. అది కనిపెట్టు. ఇది కనిపెట్టు అంటారు. అందుకే ఏమీ చెప్పకూడదు అని చిన్నారి నవ్వుతూ ఉంది.


లక్ష్మి చటుక్కున చిన్నారిని హత్తుకుంది.


శ్రీనివాసు పోలీసు వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. జనంలో తప్పిపోయిన మీ పాపను మా వాళ్ళు తీసుకొచ్చారని నేను తప్పిపోలేదు. మా అమ్మా నాన్నా తప్పిపోయారు అని చెప్పి మమ్మల్ని భలే నవ్వించింది మీ పాప. మేము కూడా ఆ పాప చెప్పినట్టే మైకులో చెప్పాము అని చెప్పాడు మగ పోలీసు కానిస్టేబుల్. చిన్నారి తెలివికి అందరూ నవ్వుకున్నారు.


చిన్నారి వాళ్ళ అమ్మా నాన్న తో వెళుతూ పోలీసు వాళ్ళకి టాటా చెప్పింది. ముగ్గురూ గుడి వైపు తిరిగి మొక్కుకుని ఇంటికి బయలు దేరారు.


Rate this content
Log in