14.పరాయి పిల్ల
14.పరాయి పిల్ల
అప్పగింతలు సీను వచ్చేసరికి...కనీళ్లు ఆగడం లేదు. పెళ్లికూతురు తల్లిదండ్రులతో సహా...పెళ్ళికొచ్చిన బంధువులందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి....!
అప్పటివరకూ ఎంతో సందడిగానూ కళకళలాడుతూ ఉన్న పెళ్లి మండపంలో.... నిశ్శబ్దత ఆవరించింది.
భూమికను ఆకాష్ కి అప్పచెప్తూ..."ఎంతో గారాభంగా పెంచుకున్న మాఇంటి మహాలక్ష్మిని మీ చేతుల్లో పెట్టాము. ఇకపై కష్టమైనా...సుఖమైనా అన్నీ మీరే ప్రాణంగా చూసుకోవాలి అల్లుడు గారూ" ...కూతురిపై ప్రేమతో.... విడవలేక విడవలేక అత్తారింటికి పంపిస్తుంటే...తల్లినీ తండ్రినీ పట్టుకుని భోరున ఏడ్చేసింది భూమిక.
" మీరు ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ అమ్మాయిని మరింతగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము మావయ్యా. మీరు అత్తయ్యగారికి ధైర్యం చెప్పండి" అల్లుడుగా వారికి హామీ ఇస్తూ చెప్పాడు ఆకాష్.
పచ్చని పందిట్లో...అలా కళ్లనీళ్లు పెట్టుకోకూడదని పెద్దలు వారించడంతో...బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకుని...కూతుర్ని సాగనంపారు...
*** *** ***
"చూసారా...మనమ్మాయిలో పెళ్ళావ్వగానే ఎంతమార్పు వచ్చిందో...? నాకు ఒంట్లో బాగుండటం లేదు...నాలుగు రోజులు వచ్చి సాయంగా వచ్చి వుండమంటే...ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ గడిపేస్తుందే గానీ... వస్తున్నానని మాత్రం చెప్పడంలేదు"....బాధపడుతూ భర్తతో చెప్పింది అనసూయ.
" బాధపడకే...నీకు తోడు నేనున్నాను కదా. పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయిన పిల్లను మన అవసరాలకు రమ్మనడం తప్పే. అయినా...నీ తృప్తి కోసం ఇంకోసారి అడిగిచూస్తాను"... భార్
యకు అనునయంగా చెప్పి కూతురుకి ఫోన్ చేసాడు భానుమూర్తి.
"ఏంటమ్మా భూమికా...అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు
నీవొక నాలుగురోజులు ఉండి వెళ్లొచ్చు కదమ్మా"...కూతుర్ని అభ్యర్థించాడు.
"అయ్యో నాన్నగారూ... నాకు మాత్రం అమ్మను చూడాలనీ...సేవ చేయాలనీ ఉండదా ఏంటి...? కాకపోతే...ఇక్కడ అత్తయ్యా..మావయ్యా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వారికి టైం ప్రకారం అన్నీ చూసుకోవాలి. మీ అల్లుడు గారు ఆఫీస్ కి వెళ్లాలన్నా... పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా పొద్దున్నే వంట చేసి బాక్సులు సర్దాలి. నేనక్కడికి రావాలంటే.. వీళ్ళందరినీ చూడ్డానికి నేను ఎవరికైనా అప్పగించి రావాలి. నేను అటు రావడానికి మా ఆడపడుచుని వచ్చి ఉండమని చెప్పాను. తను కూడా అదిగో ఇదిగో అంటుంది. తనకు వుండే ఇబ్బందులు తనకూ ఉంటాయి కదా. మా ఆడపడుచు మా ఇంటికి వచ్చి వుండగలిగినప్పుడే...వీళ్ళందరినీ ఆవిడకు అప్పగింతలు చేసి రావాలి మరి. ఈలోపులో...పెద్దక్కనో...చిన్నక్కనో అడిగి చూడండి" అంటూ తన ఇబ్బందులు చెప్పి చిన్న సలహా ఇచ్చింది .
భానుమూర్తి భార్య అనసూయకు జాలిగా చూసాడు. "స్పీకర్లో వచ్చిన మనమ్మాయి మాటలు విన్నావు కదా...మనింటి పిల్లను మరో ఇంటికి అప్పజెప్పినప్పుడు... మనింటికొచ్చి సేవ చేయమని అడగకూడదు. ఏ పండగకో, పేరంటానికో పిలిచినా అర్థం ఉంది. ఎప్పుడైతే అల్లుడికి అప్పగింతలు చేశామో...అప్పుడే మనపిల్ల పరాయి పిల్ల అయిపోయినట్టు భావించాలి. ఇకపై మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదే. మన పాట్లేవో మనమే పడదాం"...అంటూ భార్య అనసూయను పిల్లల్ని తప్పుపట్టొద్దని విడమర్చిచెప్పాడు....!!*
*** *** ***