STORYMIRROR

murali sudha

Others

4  

murali sudha

Others

అగోచరి

అగోచరి

1 min
336

ఇలా ఎవ్వరూ చేయలేరంట నిజమేనా....!?

మరి నువ్వెందుకు చేశావో....!?

పది నెలలకు ఓ పదిరోజులు తక్కువగా నన్ను మోశావే నీ కడుపులో

మరి పది నిమిషాలూ ఆలోచించకుండా 

అలా ఎలా వదిలేశావు


అవును మరి

తల్లీ తండ్రీ లేని బాధ నీకు తెలీదు కదా

నువ్వు అపురూపంగా పుట్టి పెరిగినదానివి కదా

అనాథ అన్న ముద్ర వెనక ఉన్న కన్నీటి కలశాలు 

నువ్వు మోయలేదు కదా


అంతేలే..

అంతే అయ్యుంటుంది...

లేకుంటే అలా ఒంటరిగా వదిలేసేదానివి కాదు

నన్నిలా అవస్థల కారాగారవాసం చేయించి వుండేదానివి కూడా కాదు


సరే వదిలేస్తే వదిలేశావ్

నా చేతి మీదో కాలి మీదో

నా కులగోత్రాలను రాయలేక పోయావా!?

నా ఉనికి మూలాలను పచ్చబొట్టుగా పొడవలేక పోయావా!?


ఎంతో లోకువతో కని వుంటావేమో నన్ను

కాస్తా కనికరాన్ని చూపించి ఉండాల్సింది

ఈ సాయమన్నా చేసి విడిచి పెట్టాల్సింది.....!?


ఇప్పుడు చూడు

కుప్ప తొట్టె నీ స్థానాన్ని పుచ్చుకుంది

సరే కానీ ఏం చేద్దాం!?

పురిటి వాసన వీడని నాకు 

మాలిన్య దుర్గంధాలు స్నానమాడించాయి

పోతే పోనీలే ఎవరో ఒకరు ఏదో ఒకలా!?

రూకల రుణం ఉండిపోయిందో ఏమో

చావు కూడా నన్ను వెలివేసి వెళ్లింది

అవును మరి ఎన్ని పాపాలను మోసి పుట్టానో నేను!?

నన్ను బతికించిన ఈ పంచ భూతాలు

ప్రకృతి దయాదాక్షిణ్యాలు

మనిషినన్న మచ్చను వేసేశాయి

ఇంకేం చేస్తాయి!? వాటి పని అవి కానిచ్చేశాయి


ఇప్పుడు ఒకటే ప్రశ్న నా నరనరాల్లో

ఎవ్వరి మనిషిని నేను!?

ఎవ్వరికీ అక్కరలేని 'ఏ'కాకిని

ఎక్కడి మనిషిని నేను!?

ఊరూపేరూ లేని అనామక జీవిని

ఏముంది నాదంటూ!?

రక్త మాంసాలున్న విలువలేని తనం

రూపం గుణం సభ్యత సంస్కారం

ఇవి కాక జాతులే లోకాన్ని ఏలుతున్నప్పుడు

చదువూ బతుకు విలువ విజ్ఞానం 

వీటితో పనిలేక వంశవృక్షాలు తరాల శాఖలు 

ఇవే జీవితాన్ని నిర్దేసిస్తున్నప్పుడు

ఎలా బతకమంటావు నన్ను

ఎలా ఎదురీదమంటావు బతుకును


ఇన్నీ నీకు తెలీక కాబోలు

నన్ను వదిలించుకున్నావు

నువ్వు మాత్రం సుఖాన్ని కావలించుకున్నావు


Rate this content
Log in