STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

4  

ARJUNAIAH NARRA

Children Stories Inspirational Children

'అ'అంబెడ్కర్'ఆ'ఆయుధం

'అ'అంబెడ్కర్'ఆ'ఆయుధం

1 min
418


'అ'అంటే అంబెడ్కర్

'ఆ' అంటే ఆయుధం


గుడిలోకి రానియ్యక

బడిలో కూర్చోనియ్యక

బావిలో నీరు త్రాగనియ్యక

దారిలో నడవనియ్యక

అంటరానితనమొక అంటూ రోగమంటు

మైల మైలంటూ, వెళ్ళు వెళ్ళంటూ 

వెలివేయబడ్డ అంత్యజుడు అంబెడ్కర్


పుట్టెడు కష్టాన్ని పురిటినొప్పివలె భరించి

బండెడు దుఃఖాన్ని గుండెల నిండా దిగమింగి

కన్నబిడ్డల చావును కంటిరెప్పన దాచుకొని

అష్టదిక్కులనుండి అన్యాయాలను వీక్షించి

చతుర్ముఖి వలె చాతుర్వేదాలను సంగ్రహించి

మనో త్రినేత్రంతో యోచించి పంచముల ప్రగతికి 

పట్టం కట్టిన ప్రభువు అంబెడ్కర్

 

సకల శాస్త్రములు చదివి

పుక్కిటి పురాణములను

పుక్కిలించి ఉమ్మివేసి

స్వర్గ, నరక, త్రిశంకు మరియు

పరలోకములకు తిలోదకాలు పలికి 

భారత ఖండంబును స్వర్గముగా 

తీర్చిదిద్దిన మహ ఋత్విజుడు అంబెడ్కర్ 


కుల,మత, జాతి, లింగ, వర్ణ ,వర్గ 

విబేధములు విడనాడమన్నాడు 

సత్యం, ధర్మం, న్యాయంగా ఉండాలని బోధించాడు

ప్రవచనాలు నోటి పలుకుల వద్దే ఉంటాయని

పాలకులు పాటించాల్సిన సమానత్వ నియమ నిబంధనను రాజ్యాంగమందు పొందుపరిచిన ప్రబంధకారుడు అంబెడ్కర్ 


తరాల తత్వముల తలరాతను మార్చి

బానిసల చీకటి బతుకుల్లో వేగుచుక్కగా మెరిసి

వారసత్వపు వారధిని కూల్చివేసి

ప్రజాస్వామ్యపు సారధిగా నిలిచిన

మహాఋషి అంబెడ్కర్


అనాధాలకు, అభాగ్యులకు

అఖండంబునందు అండగా నిలిచి

మనుస్మృతిని కాదని, మంచిరాతను రాసి

మన తలరాతను మార్చిన

స్పృర్తి ప్రదాత అంబెడ్కర్


సప్త ఖండాలందు, సప్త కొండలందు

సప్త సముద్రాలందు, సప్త లోకములందు 

ఆసియా ఖండపు జ్ఞానజ్యోతి అయిన

గౌతమ బుద్ధుని వెలుగురేఖలను 

ప్రపంచ నలుమూలల ప్రసరింప జేసిన 

మహా శిష్యుడు మన అంబేద్కర్....


అంబెడ్కర్ అంటే........

ఉహాలలో ఉదయించిన 

ఉత్తిత్తి  పాత్ర కాదు

కవుల కల్పిత కథలల్లో 

కన్నీరు కార్చిన విషాద వీరుల గాథ కాదు

జరగని యుద్ధంలో 

వెయ్యి శిరములను ఖండించిన

క్షత్రియ రాజుల చరిత్ర కానే కాదు


అంబెడ్కర్ అంటే...

వెయ్యిల సంవత్సరాల 

విష సంస్కృతిని మట్టి కరిపించిన వీరుడు

కుటిల చరిత్రను కాలరాసిన ధీరుడు

మూఢ విశ్వసాల మూలాలను

ముప్పుతిప్పలు పెట్టి తరిమివేసిన చరిత్రకారుడు.


అందుకే అంబేద్కర్ అంటే.....

కులవ్యవస్థకు గొడ్డలి పెట్టు

వర్ణ వ్యవస్థకు కొడవలి వేటు

వివక్షకు నిప్పు రవ్వ

అంబెడ్కర్ అంటే...

ఒక నినాదం,

ఒక ఉద్యమం, 

ఒక పోరాటం, 

ఒక విప్లవం 

అంబెడ్కర్ అంటే...

ఒక ఉనికి 

ఒక చైతన్యం,

ఒక జాగృతి, 

ఒక జ్ఞానజ్యోతి,

అంబెడ్కర్ అంటే.....

ఒక జీవించే హాక్కుకు ఆత్మ....

అందుకే...

'అ' అంటే అంబెడ్కర్

'ఆ' అంటే ఆయుధం


జై అంబెడ్కర్..జై జై అంబెడ్కర్



Rate this content
Log in