Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

SATYA PAVAN GANDHAM

Others


4  

SATYA PAVAN GANDHAM

Others


"అమ్మమ్మ వ్యధ "

"అమ్మమ్మ వ్యధ "

2 mins 344 2 mins 344

" ధైర్యవంతురాలు అమ్మమ్మ..."


తనని రెండో పెండ్లోనికి ఇచ్చి పెండ్లి చేసినా...

కడుపుతో ఉన్నప్పుడు కుక్క కాటుకు తన కాలు జబ్బు పడినా..

సొంత కూతురిలా చూసుకుంటున్న పెంచిన కూతురు కాలం చేసినా...

ఇరవై ఏళ్ల క్రితం కట్టుకున్నోడు శాశ్వతం గా దూరమైనా..

బాధ పడలేదు...

లేదు లేదు బాధపడినా బయట పడ లేదు.


పెద్ద కూతురుకి ముక్కుపచ్చలారకుండానే పెళ్లి చెయ్యాల్సోచ్చిన, 

అమాయకురాలైనా రెండో అమ్మాయిని అయ్య చేతిలో పెట్టాల్సి వచ్చినా...

చివరికి మిగిలిన చిన్న పిల్లకి పెళ్లి చేసి సుదూరంగా సాగనంపాల్సొచ్చినా,  

భయపడలేదు... 

లేదు లేదు భయపడినా బయట పడలేదు.


పని లేక తిరుగుతున్న పెద్దోడు గురించి కానీ, ఉమ్మట్లోంచి వేరుపడిన రెండోవొడు గురించి కానీ, చిర్రు బుర్రు లాడే చిన్నోడి గురించి కానీ బెంగ పడలేదు... 

లేదు లేదు బెంగ పడినా బయట పడలేదు.

అందుకే అమ్మమ్మ ధైర్యవంతురాలు


"పాడైపొయింది అమ్మమ్మ..."


కూతురిగా, సోదరిగా, ఆలిగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మ గా, ఆఖరికి తాతమ్మగా ఎన్ని తరాలకి సేవలందించిందో ఆ సహనశీలి...

ఏ రోజు టైం కి తినింది లేదు...టైం కి పడుకున్నది లేదు...

రోజూ కోడి కూయకముందే తన నిద్ర సమాప్తం

యెనిమిది పదుల వయసు పైబడుతున్నా ఎప్పుడూ ఎదోకటి పులుముకోవడం , తడుముకోవడం.

ఆ బోధ కాలుతోనే ఇప్పటివరకూ అవన్నీ నెట్టుకొచ్చింది మరి.

అందుకే పాపం అమ్మమ్మ పాడైపోయింది...


"మూగబోయింది అమ్మమ్మ..."


అయినవాళ్ళు.. కానివాళ్లు... ఇంట్లో వాళ్ళు... ఇరుగుపొరుగు వారితో... ఎన్ని అపవాదులు మూటకట్టుకుందో...

చిన్నోల్లతో పెద్దొల్లతో ఈ వయసులో కూడా ఎన్ని మాటలు పడుతుందో..

పది పదిహేనేళ్ళ క్రితం తన మాటకి పెద్దరికాన్ని అలంకరించినా..

ఇప్పడు అదే మాటలని చేదస్థం అని అక్షేపించినా...

మాటు మాట్లాడలేని నిస్సహాయురాలు అమ్మమ్మ

అందుకే అమ్మమ్మ మాటే కాదు మనసు కూడా మూగబోయింది.


"పిచ్చిదైపోయింది అమ్మమ్మ..."


దాదాపు ఏడెండ్ల క్రితమే కాలం చేసిన పెద్ద కూతురు బాధ నుండి ఇంకా తేరుకొనేలేదు,

అంతలోనే ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే ఆ పెధ్దోడు కూడా ఇప్పుడు ఇలా...

ప్రేగు తెంచుకు పుట్టినోల్లని కళ్లముందే ఆ క్యాన్సర్ మహమ్మారి కభళిస్తుంటే పాపం ఆ కన్న హృదయం విల విల లాడుతోంది, ఆ పిచ్చి తల్లి తల్లడిల్లుతోంది

అందుకే పాపం అమ్మమ్మ పిచ్చిధైపోయింది.


"ఆశ పడుతుంది అమ్మమ్మ..."

ఒకప్పుడు తన ముంగిట అల్లర్లు చేస్తూ... కబుర్లు చెప్పే మనుమలని చూసే మురిసిపోయిన అమ్మమ్మ

ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్లయి ఎక్కడెక్కడో స్థిరపడ్డాక కనీసం ఫోనైన చేసి క్షణమైనా మాట్లాడకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది.

(చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నా అందులో నేనొకడిని)

అందుకే అమ్మమ్మ ఆశ పడుతుంది.అమ్మమ్మా.....


ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ మూలన కూర్చొని

విలపిస్తున్న నీ రోదన ఎవరికెరుక,  

ఎగిసిపడుతున్న ఆ నిట్టూర్పు సెగలు మరెవరికీ పట్టకా...


నీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకుని అందులోనే ఆ శేష జీవితాన్ని కాస్త గడుపుతూ కాలం వెళ్లదీస్తున్న ఓ అజ్ఞాతవాసి!!


ఒకప్పుడు వెన్నెలలా వెలుగొందిన నీ జీవితం ఇప్పుడు చిమ్మ చీకటైనా, వారసులకు మార్గదర్శిగా దారిని చూపుతూ సాగే సహనం లాంటి నీ ప్రయాణం ఇతరులకు సాధ్యపడనిది, వివరించ తగనిది.


నీ అనుమతి లేకుండానే నీ గూర్చి లిఖించి ఈ ప్రపంచానికి తెలియ పరచాలనుకుంటున్నా..

నీ సహనాన్ని చాటి చెప్పాలనుకుంటున్నా...


మన్నిస్తావు కదూ... క్షమిస్తావు కదూ...Rate this content
Log in