సుశేనుడి నిర్ణయం
సుశేనుడి నిర్ణయం
సుశేనుడి నిర్ణయం
**********************
అవంతీపుర రాజు సుశేనుడు పరిపాలనా దక్షుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపర్చేవాడు. అయినప్పటికీ రాజ్యంలో ప్రజలు సంతోషంగా లేకపోవడంతో రాజు సుశేనుడు. రాజోద్యోగులందరితో ఒక సమావేశం ఏర్పాటుచేశాడు.
సమావేశానికి పండితులను, విషయ
నిపుణులను, అస్థాన విద్వాంసులను
ఆహ్వానించాడు. "రాజ్యంలో ఉండే ప్రస్తుత పరిస్థితి
మారాలంటే ఏమిచేయాలి, ఎలాంటి చర్యలు
తీసుకోవాలో సూచనలివ్వండి" అని అడిగాడు రాజు. ఎవరికి తోచిన సలహా వారిచ్చారు.
ఆస్థాన విద్వాంసుడు విద్యానిది నిలబడి "మహారాజా మనం నేరుగా ప్రజలవద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సరే నని మర్నాటి నుంచి ప్రతీ గ్రామానికి వెళ్ళి వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోసాగారు.
అలా ఒకరోజు రాజుగారితో కలసి ఒక గ్రామానికి వెళ్ళారు. రచ్చబండ దగ్గర కూర్చుని సమస్యలు అడిగి తెలుసుకునే క్రమంలో మంత్రికి దాహం వేసింది. దగ్గరలో ఉన్న ఒక ఇల్లాలు నీళ్ళు పట్టుకుని వచ్చి మంత్రికి అందివ్వబోయింది. మంత్రి ఆమె వైపు చూసి “వేరొక లోటా తో ఇవ్వమ్మా" అని అడిగాడు. ఆమె మరొక లోటాతో నీళ్ళు ఇచ్చింది. మంత్రి దాహం తీరింది.
లోటా ఎందుకు మార్చమన్నాడో రాజుకు అర్థం కాలేదు. సాయంత్రం మంత్రిని పిలిచి అడిగాడు.
"మహారాజా ఆమె నీటితో తెచ్చిన లోటా సరిగ్గా శుభ్రం చేయలేదు. అందుకే మరొక లోటాతో తీసుకురమ్మని చెప్పాను." అన్నాడు మంత్రి.
"అది నీకెలా తెలుసు?" అని అడిగాడు రాజు మంత్రి ఒక శుభ్రమైన లోటాని తీసుకుని అందులో మంచినీటిని పోశాడు. పోస్తున్నప్పుడు కొద్దిగా నీళు ఏ లోటా అంచుపై పడ్డాయి. ఆ నీటి బొట్లు నేరుగా కిందకి జారాయి.
"చూడండి మహారాజా ఇది శు భ్రమైన లోటా కాబట్టి నీళ్ళు క్రిందికి జారాయి. ఆమె తెచ్చిన లోటా నుంచి నీళ్ళు క్రిందికి జారలేదు కాబట్టి అది పరిశుభ్రమైనది కాదని పోల్చాను మహారాజా." అని చెప్పాడు మంత్రి.
మంత్రి నిశిత పరిశీలనకు మెచ్చుకున్నాడు రాజు. ప్రజల ఆలోచనల్లో మార్పురానంతవరకు ఏమిచేసినా ఉపయోగం లేదని భావించి ప్రతీ గ్రామంలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు.
పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం, మూఢనమ్మకాలు, మొదలగు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాడు. అందరూ చదువుకునేలా చర్యలు తీసుకున్నాడు.
కొన్నాళ్ళకు ప్రజలు చైతన్య వంతులయ్యారు. ప్రజల అలవాట్లలో, ఆహార విహారాల్లో ఆలోచనల్లో మార్పు మొదలైంది. రాజ్యంలో అందరూ ఆరోగ్యంగా, సుఖ,సంతోషాలతో ఆనందంగా జీవించసాగారు.
(సృజన క్రాంతి దినపత్రికలో 22-9-24న ప్రచురితమైంది)
