STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Children Stories

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Children Stories

స్నేహితుని సహాయం

స్నేహితుని సహాయం

3 mins
326


          స్నేహితుని సహాయం 

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   వెచ్చాల కోసం కిరాణా కొట్టుకెళ్ళి...ఏడుస్తూ కాళీసంచితో తిరిగి వచ్చాడు రాము.


   కొడుకు వెచ్చాలు తీసుకొస్తే త్వరగా వంట చేయొచ్చని గుమ్మంలోనే నుంచుని ఎదురుచూస్తున్న సీతమ్మ కొడుకును చూసి...ఏమయిందో తెలీక క్షణకాలం బిత్తరపోయింది.


  " ఏరా...ఎందుకేడుస్తున్నావ్...? వెచ్చాలు తీసుకురాలేదేం..? డబ్బులెక్కడైనా పడేసావా...?" ఆవిధంగానే జరిగుంటుందని ఊహిస్తూ కొడుకును గట్టిగా కేకలేస్తూ... అడిగింది.


  ఏడుస్తూనే...లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు రాము.


  "మరైతే వెచ్చాలేవి..."? మరింత గట్టిగా నిలదీసింది సీతమ్మ.


   "మరేమో...కొట్టువాడికి ముందే డబ్బులిచ్చేసి వెచ్చాలు కట్టించుకున్నాకా మిగిలిన చిల్లర ఇవ్వమని అడిగాను. అతనికి నేనసలు డబ్బులే ఇవ్వలేదని చెప్పి నానా తిట్లూ తిడుతూ...వెచ్చాలన్నీ వెనక్కి తీసేసుకున్నాడు". బెక్కుతూ భయం భయంగా చెప్పాడు రాము


   కొడుకు సమాధానం విని సీతామ్మకు పిచ్చెక్కినట్టయ్యింది. త్రాగుబోతయిన భర్త బాధ్యతను మరచి ఇంటినసలు పట్టించుకోకపోవడంతో ఇంట్లో బియ్యం గింజల దగ్గర నుంచి అన్నీ నిండుకునేసరికి ...తానే నాలుగిళ్ళలో పాచిపనులు చేయగా వచ్చిన జీతం డబ్బుల్ని కొడుకు చేతికిచ్చి వెచ్చాల కోసం కొట్టుకు పంపింది.


   ఆనెలంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కొట్టువాడు అన్యాయంగా దోచుకున్నాడని తెలిసి...అతన్నేమీ చేయలేని కొపంతో కొడుకైన రామూ ఒంటిమీదనే నాలుగు బాదులు బాదింది. 

   

  "ఇంకెప్పుడూ సరకులు చేతికి రానిదే ముందుగా డబ్బులివ్వద్దు" అంటూ గట్టిగా హెచ్చరించింది.


  తల్లి చేత కూడా దెబ్బలు తినేసరికి పాపం రామూకి దుఃఖం ఆగలేదు.


  ఏడుస్తూ...తన స్నేహితుడు సోమూ దగ్గరకెళ్లి విచారంగా కూర్చున్నాడు.


  సోము ధనవంతుల బిడ్డ. అయినా ఆఅబ్బాయిలో కొంచెం కూడా అహంకారమన్నదే ఉండదు.చాలా తెలివైన వాడు కూడా. పేదవాళ్లంటే చిన్నచూపండకూడదని వాళ్ళతోనే ఎక్కువ ప్రేమగా ఉండి స్నేహం చేయడానికి ఇష్టపడేవాడు. అందుకే పేదవాడైన రామూకూ, సోమూకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాదు రామూని కష్టాల్లో ఆదుకునే ఆప్తమిత్రుడు సోము.


   రాము దిగులుగా ఉండటం చూసి..."ఎందుకు రామూ అలా దిగులుగా ఉన్నావు" స్నేహితుని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు. 


   సోమూ కురిపించిన ఆ ఆప్యాయతకు రామూ కరిగిపోయాడు. కొట్టు దగ్గర తనకు జరిగిన అన్యాయం గురించీ...అమ్మ కొట్టిన దెబ్బల గురించీ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు.


  సోము అదంతా విని...రామూని ఓదార్చి....కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. "ముల్లుని ముల్లుతోనే తీయాలన్నది సామెత. అందుకే మళ్లీ వాడేవారినీ మోసం చేయకుండా కొట్టువాడికి బుద్ది వచ్చేలా రామూ చెవిలో చిన్నగా తాను పన్నిన పన్నాగం కాస్తా చెప్పాడు.


  రామూ మొఖం విప్పారింది. సోమూ చెప్పినదానికి సరే అన్నట్టు సంతోషంగా చేయి కలిపాడు.


   ఆ మరుసటి రోజు...

   రాము స్నేహితుడు సోము ముందుగా అదే కిరాణా కొట్టుకెళ్లి వందరూపాయలు ఖరీదు చేసే వెచ్చాలు కట్టించుకున్నాడు. ఇచ్చినవన్నీ సంచిలో సర్దుకుని...వందరూపాయల నోటు కొట్టువాడికిచ్చి వచ్చేసాడు.


   ఆ వెంటనే....

   రాము కూడా వెళ్లి వంద రూపాయలకయ్యే వెచ్చాలను కట్టించుకుని సంచిలో సర్దుకుని వచ్చేస్తుంటే...కొట్టువాడు అడ్డుకున్నాడు. "డబ్బులివ్వకుండా వెళ్లిపోతున్నావేంట్రా" అని జుట్టు పట్టుకున్నాడు.


  " నేను డబ్బులిచ్చేసి వెళ్తుంటే నువ్వు ఇవ్వలేదంటావేమిటి..."? వీస్తుపోతూ అడిగాడు రాము.


  "నువ్వు ఇవ్వలేదు. నాటకాలాడుతున్నావా ఏంటి"? కొట్టువాడు గట్టిగా కేకలేశాడు.


  నేనిచ్చేశానని రామూ...ఇవ్వలేదని కొట్టువాడు. ఇద్దరిమధ్యా వాదోపవాదాలు అవుతుంటే చుట్టూ ఒక్కొక్కరుగా జనం పోగయ్యారు. వారంతా ఎవరి మాట నమ్మాలో తెలీక చూస్తుండిపోయారు.


  "కావాలంటే నేనిచ్చిన వందనోటుమీద ఇలా 'రాము' అని నా సంతకం చేసి ఉంటుంది. ప్రతిసారీ వందనోటు మార్చినప్పుడల్లా అలానే రాస్తూ వుంటాను. ఎప్పటికైనా అది మళ్లీ నాచేతికి వస్తుందేమో చూద్దామని" అంటూ ఓ కాగితం మీద తన సంతకం చేసిచ్చాడు రాము.


  రాము చెప్పింది అబద్ధమనే ధైర్యంతో కొట్టువాడు డబ్బులపెట్టెను అందరిముందూ బోర్లించాడు. అందులోని వందనోట్లన్నీ పరిశీలిస్తే నిజంగానే ఓ వందనోటుమీద రాము చేసిన సంతకం కనిపించించి. ఆసంతకం రామూ రాసిచ్చిన అక్షరాలనే పోలి ఉండటంతో కొట్టువాడు తెల్లమొఖం వేసాడు.


  "నీలాంటి వ్యాపారులు తూనికరాళ్లు దగ్గరచేసే మోసాలు చాలు గానీ...చిన్నపిల్లల్ని చేసి ఇలాంటి మోసాలు కూడా చెయొద్దని" చుట్టూ చేరిన జనం కొట్టువాడికి చివాట్లేసి... ఎవరిదోవన వారెళ్లిపోయారు. 


   తీర్పు తనవైపే అవ్వడంతో కొట్టువాడిని జయించినట్టుగా చూస్తూ ఆ వెచ్చాలసంచిని తిరిగి కొట్టువాడికే ఇచ్చేసాడు రాము.


   రాము మంచితనం కొట్టువాడి కళ్ళు తెరిపించాయి. ఆముందురోజు రామూకీ తాను చేసిన అన్యాయానికి క్షమించమన్నట్టు తన తప్పు ఒప్పుకుని...రాము దగ్గర అన్యాయంగా తాను కొట్టేసిన డబ్బును తిరిగి ఇచ్చేసాడు కొట్టువాడు.


  పోయిందనుకున్న డబ్బు తిరిగి తన చేతికి రావడంతో రాము ఆనందంతో అక్కడ నుంచి కదిలాడు. 


  దూరం నుంచి ఇదంతా చూస్తున్న సోము తను పన్నిన పన్నాగం ఫలించినందుకు పరుగు పరుగున వచ్చి రామూని చుట్టేసాడు.


  "చాలా థాంక్స్ రా...! నీ తెలివితేటల వల్ల మంచి ఉపాయం చెప్పి...నాకు సహాయం చేశావు. కొట్టువాడికి నువ్విచ్చిన వందనోటు మీద ముందుగానే నాతో సంతకం పెట్టించడంతో...ఆకొట్టువాడికి బాగా బుద్ది చెప్పగలిగాం. అంతేకాదు...నిన్న నాదగ్గర అన్యాయంగా నొక్కేసిన నా డబ్బును కూడా తిరిగి ఇచ్చేసాడు". సోమును మెచ్చుకుంటూ చెప్పాడు రాము.


  రాము ఆనందాన్ని చూసి సోముకి కూడా ఆనందంగానే ఉంది. అందుకే కొట్టువాడిదగ్గర తాను కొన్న వెచ్చాలున్న సంచిని రామూ చేతికిస్తూ ....ఆడబ్బుతో పాటూ ఇవి కూడా మీ అమ్మగారికివ్వు. నీమీద కోపం పోయి ముద్దుపెట్టుకుంటుంది" రాము ఇంటి పరిస్థితికి చలించిపోతూ అన్నాడు సోము.


  మరి మీఇంటి నుంచి వంద రూపాయలు తెచ్చావు కదా. ఆ డబ్బులగురించి మీఇంట్లో అడగరా..."? భయపడుతూ అడిగాడు రాము. 


  రాము మొఖంలోని భయాన్ని చూసి పెద్దగా నవ్వాడు సోము.


  "ఆడబ్బు మాతల్లిదండ్రులిచ్చినవి కావు. నేను డిబ్బీలో దాచుకున్న డబ్బుల్లోంచి తెచ్చినవి". అంటూ స్నేహంలోని తీయటి మాటలు వినిపించాడు సోము.


  సోముతో అతీయటి స్నేహం జన్మజన్మలకూ మాసిపోకూడదని కృతజ్ఞతగా అనుకుంటూ...ఆనందంగా బరువైన వెచ్చాలసంచితో ఇంటివైపు కదిలాడు రాము...!!*


          ***     ***     ***


   


Rate this content
Log in