పవిత్ర స్నేహం
పవిత్ర స్నేహం


రజని ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే మోహన్ వచ్చాడు. అతన్ని రజని ఆహ్వానించి తనకు, అతనికి కాఫీ కలుపుతూండగా తల్లి, పెద్దమ్మ పక్కింటి నుండి వచ్చారు. మోహన్ తో మాట్లాడుతూ అక్కడే హాల్లో కూర్చుంది పెద్దమ్మ.
తల్లి వంట గదిలోకి వచ్చి మరో రెండు కాఫీలు కలపమని "మోహన్ ఎప్పుడు వచ్చాడు?" అంది.
"ఇప్పుడే. నేను వచ్చాను. నా వెనకాతలే వస్తే కూర్చోమని కాఫీ కలపడానికి వచ్చాను. ఇంతకీ ఎందుకలా అడిగావ్?" అడిగింది రజని.
"ఏం లేదు." అంటూ కాఫీ కప్పులు పట్టుకుని హాల్లోకి వెళ్ళిందావిడ.
అందరికీ కాఫీలు ఇచ్చాక "ఏమే రజనీ, మోహన్ నీకు వరసకు బావే కదా, మీ ఇద్దరూ పెళ్లి చేసుకో కూడదూ." అంది పెద్దమ్మ.
రజనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అటు మోహన్ కూడా ఇబ్బందిగా చూసి "రజనీగారు మీరు అడిగిన బుక్స్ షాప్ లో వచ్చాయి. అది చెప్పడానికే వచ్చాను. నేను వెళ్తానండీ." అంటూ వెళ్ళి పోయాడు.
"ఏంటి పెద్దమ్మా , అలాగేనా అడగడం. ఎవరి ఇష్టాఇష్టాలతో పనిలేదా. అమ్మాయి, అబ్బాయి కనిపించగానే పెళ్ళి మాటేనా మీకు గుర్తుకొచ్చేది?" కోపంగా, గట్టిగా అడిగింది రజని.
"ఇప్పుడు నేనంత కాని మాటేమన్నాను? పక్కింటావిడ కూడా ఆదే మాటంది. తరచుగా వస్తూంటాడటగా ఇంటికి? మీ ఇద్దరి మధ్య. ఏమీ లేందే, వాడెందుకు వస్తాడంటావ్? ఏమే ఏం మాట్లాడవేంటి?" అందావిడ రజని తల్లిని చూస్తూ అంతకన్నా గట్టిగా.
"ఆ అబ్బాయి మీకే చుట్టం. పుస్తకాల షాపులో పని చేస్తున్నాడు. నేను స్కూల్ లైబ్రర
ీలో పని చేస్తున్నాను. అవసరమైన పుస్తకాలు ఆ షాప్ లోనే కొంటాం. ఈ ఊళ్ళో ఒక్కడే ఉన్నాడన్న ఉద్దేశ్యంతో ఇంటికి వస్తే
ఎప్పుడైనా భోజనం పెడతాం. ఆదీ తప్పే. ఆడ, మగ ఇద్దరు కనపడితే, స్నేహంగా మాట్లాడితే ఇంక వాళ్ళ మధ్య ఏదో ఉందని అనుకోవడమేనా ?" మరింత కోపంగా అంది రజని.
"ఈ కాలం స్నేహాలను ఎవరు నమ్మారు?" విసురుగా అందావిడ.
"అక్కా, ఊరుకో. నేను ముందే చెప్పాను, దాన్నేమీ అడగద్దని. పక్కింటి కామాక్షి అన్నాదని, నువ్వు కూడా
మొదలు పెట్టావ్. ఇంక ఊరుకో." అంది రజని తల్లి.
"నాకేం పోయింది? ఊరుకుంటాను. తర్వాత ఏమన్నా అయితే నువ్వే బాధ పడుదువుగాని. ఇలాంటి వాళ్ళే ఏదో రోజు లేచి పోతారు." అంటూ విసవిసా వెళ్లి పోయిందావిడ.
"ఏంటమ్మా ఇది? నిజంగా అలాంటి ఉద్దేశ్యం ఉంటే, ఎవరేం చేయగలరు? ఉద్యోగం చేసే ఆడపిల్లలం, మగవాళ్ళతో మాట్లాడవలసి వస్తే మాట్లాడుతాం. అలా మాట్లాడగానే ఇలాగేనా నలుగురిలో అడగడం?
ఇలా అయితే ఉద్యోగాలు చేసినట్లే." కళ్ళనిండా నీటితో అడిగింది రజని.
"కొందరంతేనమ్మా. ఆడ, మగ ల మధ్య స్నేహం అంటే, అది అపవిత్ర మైనదనే భావిస్తారు. ఈ పెద్దమ్మకి చాదస్తం ఎక్కువ. పాతకాలం మనిషి కదూ. నువ్వు పట్టించుకోకమ్మా." అందావిడ ఓదార్పుగా రజనిని దగ్గరకు తీసుకొని. రజని అలాగే నన్నట్లుగా తలాడించి కళ్ళు తుడుచుకుంది.
.....అయిపోయింది.....