Venkata Rama Seshu Nandagiri

Others

4.0  

Venkata Rama Seshu Nandagiri

Others

గాజుబొమ్మ

గాజుబొమ్మ

2 mins
352


నా దగ్గర ఒక గాజు చేపబొమ్మ ఉంది. అది మా నాన్నగారు 1966 లో నాకోసం కొన్నారు. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ బొమ్మంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని వస్తువులు ఉన్నా, పోయినా అది మాత్రం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.


నాదగ్గర చాలా బొమ్మలుండేవి. మా అమ్మకు నేను ఒక్క దానినే. మేం వైజాగ్ లో ఉండేవాళ్ళం. అక్కడ కనకమహాలక్ష్మి సంబరాలలో ప్రతిసారి బొమ్మలు కొనేది. వంట సామాన్లు సెట్టు లాగా కొనేది. తిరుపతి, సింహాచలం ఏ ఊరెళ్ళినా నాకోసం బొమ్మలు తప్పని సరిగా కొనేది. వాటితో ఆడేదానిని. ఎవరైనా ఆడుతూ ఆడుతూ పట్టుకుని వెళ్ళి పోయినా నేను పెద్దగా పట్టించుకొనే దానిని కాదు. అందుకే నావి ఎన్నో బొమ్మలు పోయేవి. కొన్ని మా అక్కచెల్లెళ్ళు నచ్చినవి తీసేసుకొనేవారు.


ఎవరు ఏది పట్టుకెళ్ళినా పట్టిఃచుకోని నేను ఈ బొమ్మ మాత్రం ఎవరికీ ఆడుకోవడానికి కూడా ఇచ్చేదానిని కాదు. ఎవరైనా అడిగితే గాజుబొమ్మ తీస్తే నాన్నగారు దెబ్బలాడుతారు అని సాకు చెప్పెదానిని. నేనొక్క దానిని ఉన్నప్పుడు మాత్రమే ఆ బొమ్మతో జాగ్రత్తగా ఆడుకొనే దానిని.


లేతాకుపచ్చ, పసుపు నీలం రంగుల కలయికతో ఆ గాజు బొమ్మ ఎంతో ముద్దుగా ఉంటుంది. నాన్నగారు

ఆర్మీ లో పని చేసేవారు. ఆయనతో పాటు చండీగఢ్, పూనా, లక్నో, ఢిల్లీ ప్రదేశాల్లో ఉన్నాము. అయితే ఏ ఊరెళ్ళినా ఆ బొమ్మ నాతో పాటు రావల్సిందే. అంత అపురూపమైనది నాకు ఆ బొమ్మ.


అప్పట్లో ఆ చేప నోట్లో పావలా బిళ్ళలు, ఐదు పైసల బిళ్ళలు పట్టేవి. మా నాన్నగారు రోజూ నాకు ఇచ్చే చిల్లర చేప కడుపులో వేసే దానిని. అదే నా కిడ్డీ బేంక్.


చేప పొట్ట నాణేలతో నిండిపోగానే ఖాళీ చేసి నాన్నగారు నాకోసం ఏదో ఒకటి కొని పెట్టేవారు. అందుకే దానిని నా బేంక్ లాగా అపురూపంగా చూసుకొనే దానిని.


నేను పెద్దయ్యాక అది అలంకార వస్తువైంది. దాని స్థానం షో కేస్ లోకి మారింది. అయినా అదంటే నాకెంతో ఇష్టం. మా కాలేజీ ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వేవారు. ఏమిటీ ఈ బొమ్మంటే ప్రాణమా అంటూ.

అయినా నేనేం చిన్నబుచ్చుకొనే దానిని కాదు. ఎంతో మంది చిన్నతనంలో ఆడుకునే బొమ్మలను అపురూపంగా దాచుకుంటారు. నేను నా చిన్ననాటి కిడ్డీ బేంక్ ని అపురూపంగా చూసుకుంటాను.


మా నాన్నగారు వెళ్ళి పోయి నలభై రెండు సంవత్సరాలైంది. ఆ బొమ్మ వయసు యాభై ఐదు.సంవత్సరాలు. ఇప్పటికీ అది నాతోనే ఉంది.

మా పిల్లలు కూడా 'అమ్మ బొమ్మ - అమ్మో బొమ్మ' అని వెక్కిరిస్తారు. అయినా ఫర్వాలేదు.


ఏ వస్తువు మీద లేని మమకారం, ఈ బొమ్మపై ఎందుకు పెరిగిందో నాకు తెలియదు. ఇంతకన్నా ఖరీదైన వస్తువులు వచ్చాయి, పోయాయి. అయినా

నేను దేనికీ బాధ పడలేదు. ఎవరు మా వస్తువులు తీసుకున్నా నాకేమనిపించలేదు. కానీ దీనిని ఎవరు అడిగినా ఇవ్వలేదు. కారణం తెలియదు.


అదీ నా అపురూపమైన గాజుబొమ్మ కథ.



Rate this content
Log in