STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

3  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

ఎగిరే పిట్టకు మసాలా నూరడం

ఎగిరే పిట్టకు మసాలా నూరడం

1 min
14

ఎగిరే పిట్టకు మసాలా నూరడం 

******************************

చాలా కాలం క్రితం చంద్రగిరి లో చిట్టిబాబు అతడి భార్య చిన్నమ్మలు నివసించేవారు. చిట్టిబాబు వ్యవసాయానికి కావల్సిన నాగలి, కాడి, మేడి, బండి, కొడవళ్ళు, గునపాలు, బొరిగెలు, నాగళ్ళు చేసేవాడు. కొడవళ్ళకు కక్కు కొట్టేవాడు. చిన్నమ్మలు తెలివైనది భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది.


తొలకరి రానే వచ్చింది. వ్యవసాయదారులు పనిముట్లు కోసం వస్తారని భావించిన చిట్టిబాబు భార్యను పిలిచి "నేను పట్నం వెళ్లి పనిముట్లు చేయడానికి అవసమైన ఇనుము కొనుక్కుని వస్తాను." అన్నాడు. 


"మన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ము ఖర్చు పెట్టేస్తే ఎలా? పనిముట్లు చెయ్యమని నీ దగ్గరికి ఎవ్వరూ రాలేదు. రాబడి లేకుండా ఉన్నది ఖర్చు చేస్తానంటున్నావు. 'ఎగిరే పిట్టకు మసాలా నూరకు ” అంది భార్య. 


“అంటే నీ ఉద్దేశ్యం?” అన్నాడు చిట్టిబాబు.


"పూర్వం చిత్రకూట పర్వతం ప్రాంతంలో జంగయ్య అనే బోయవాడు నివసించే వాడు. అతడు ప్రతీరోజూ పిట్టలను వేటాడి జీవనం సాగించేవాడు. ఒకరోజు అడవికి పోతూ “నేను పిట్టలను వేటాడి తెస్తా నువ్వు మసాలా నూరి ఉంచు.” అని భార్యకు చెప్పి అడవికి వెళ్ళాడు. 


నిత్యం భర్త చేసే పని వేటాడటమే కాబట్టి ఉన్న కొద్దిపాటి మసాలా దినుసులను నూరి వంటకు సిద్ధం చేసి ఉంచింది భార్య. 


సాయంత్రం చీకటి పడే సమయానికి వట్టి చేతులతో వచ్చాడు జంగయ్య. భర్తని చూసి “కూర చెయ్యడానికి పిట్టలేదు, కూరగాయలూ లేవు. సిద్ధం చేసి ఉంచిన మసాలా రేపటికి పాడైపోతుంది. ఎగిరే పిట్ట దొరుకుతుందో దొరకదో తెలియదు దానికోసం మసాలా నూరి ఉంచమన్నావు. ఈరోజుకి కూర లేదు, రేపటి కూరలోకి మసాలా లేదు." అని బాధపడింది బోయవాడి భార్య. ఇదీ కథ.ఇప్పుడు నీ వాలకం కూడా అలాగే ఉంది.” అంది చిట్టిబాబు భార్య.


భార్య మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన చిట్టిబాబు పట్టణం వెళ్ళడం మానుకున్నాడు.


ఏదో సాధిస్తామని, ఎంతో సంపాదిస్తామని ఊహిస్తూ, ఊహల్లో తేలుతూ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడే వారి విషయం లో వాడే సామెత ఇది. “మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోవడం” అని కూడా అంటారు.


(ప్రజాశక్తి చిన్నారి లో 1-8-2024 న ప్రచురితం అయ్యింది)


Rate this content
Log in