STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

3  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

బుంగమూతి

బుంగమూతి

2 mins
17

బుంగ మూతి 

******************

“ఏంటో అబ్బాయి గారు అలా బుంగ మూతి పెట్టుకుని కూర్చున్నారు ఏమిటి సంగతి.” అని అడిగింది పెద్దమ్మ రుద్రాంశ్ వైపు చూస్తూ. అయినా ఉలుకూ లేదు పలుకూ లేదు.


“మనిద్దరం జట్టు నీకు మినపసున్ని ఇస్తాను. ఏం జరిగిందో చెప్పు.” అంది పెద్దమ్మ. 


పెద్దమ్మ చేతిలో మినప సున్నుండలు చూడగానే రుద్రాంశ్ కి నోరూరింది. పెద్దమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పెద్దమ్మ రుద్రాంశ్ ని దగ్గరగా తీసుకుని తల నిమురుతూ మినప సున్ని చేతిలో పెట్టింది. తింటూ మాట్లాడ బోయాడు. 


“తింటూ మాట్లాడకూడదు పలమారుతుంది. అందులోనూ మినపసున్ని గొంతుకకి అంటుకుపోతుంది నెమ్మదిగా తిని నీళ్ళు తాగిన తర్వాత చెప్పు.” అంది పెద్దమ్మ. 


“సరే” నని తలూపి తినడం పూర్తి అయ్యాక “ ముఖానికి రాసుకునే పౌడరు తీసుకెళ్ళి పెరట్లో ఉన్న కుక్క పిల్లకి రాసి ముస్తాబు చేశాను. అది చూసి అమ్మ నన్ను అల్లరి వెధవ అని తిట్టింది. అందుకే నాకు కోపం వచ్చి నీ దగ్గరికి వచ్చేసా” అన్నాడు గొప్పగా.


“పాడు పనులు చేస్తే తిట్టదా! మరి.” అంది పెద్దమ్మ మనసులో నవ్వుకుంటూ. 


“ పాపం బుజ్జి కుక్కపిల్లకి ఎవరూ పౌడర్ రాయలేదు. అందుకే నేను రాశాను.” అన్నాడు రుద్రాంశ్.


“వాటికి నీరు, ఆహారం పెట్టాలి కానీ పౌడరు రాయడం, తిలకం పెట్టడం చెయ్యకూడదు. అంది పెద్దమ్మ.


రుద్రా, రుద్రా అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది సౌమ్య “ రుద్రాంశ్ ని చూడగానే చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు వీడి కోసం ఊరంతా తిరిగాను”అంది.


“నీ కొడుకు బుంగమూతి పెట్టుకుని అలిగి కూర్చుంటే మినపసున్ని ఇచ్చి అలక తీర్చాను.” అంది పెద్దమ్మ.


“బుంగ మూతి అంటే ఏంటో చెప్పవా పెద్దమ్మా.” అని అడిగింది సౌమ్య.


ఇంట్లోకి వెళ్లి ఒక బూరను తెచ్చి నోట్లో పెట్టి పెద్దగా ఊది మూతిని దారంతో గట్టిగా కట్టింది. 


“దీనిని బుంగ అని కూడా అంటారు. బుంగ గుండ్రంగా పెద్దదిగా ఉంది. మరి మూతి చిన్నగా ముడుచుకుని ఉంది. దీనినే బుంగ మూతి అంటారు. 


చిన్నపిల్లలు బుగ్గలు కింద చేతులు పెట్టుకుని అలిగి మూతి ముడుచుకుని కూర్చుంటే బుంగమూతి పిల్లలు అని అంటాము. అని వివరించింది పెద్దమ్మ.” 


"అయితే ఈ బుంగమూతి బుల్లోడిని తీసుకు వెళతాను" అని రుద్రాంశ్ ని ఇంటికి తీసుకువెళ్ళింది సౌమ్య.


(ప్రజాశక్తి చిన్నారిలో 15-9-24, న ప్రచురితమైంది)


Rate this content
Log in