శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Children Stories

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Children Stories

13.కనుమరుగు

13.కనుమరుగు

2 mins
431



   బాల్యపు మధురజ్ఞాపకాలకు తీపెక్కువేమో...?ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా...మొన్న మొన్నే జరిగినట్టు మనసునెంతగా మురిపిస్తాయో..!

    

   "తాతయ్యా... నీ ఒంటిమీద ఎందుకీ మచ్చలున్నాయి...? అంటూ...సందేహం వెలిబుచ్చాడు".  ఆకాష్ ఒంటిపై ఆనవాలుగా మిగిలిపోయిన గాయాలు తాలూకూ మచ్చలు చూపిస్తూ అడిగాడు తన మనుమడు.

    

    మనుమడి మాటలకు వంటగదిలో వంటచేస్తున్న భూమిక పకపకా నవ్వింది. "ఎందుకేమిట్రా...తాతయ్య చిన్నప్పుడు ఆటలాడుతూ తగిలించుకున్న దెబ్బలేరా అవి".

   

  " నానమ్మ మాటలు విని అవునా తాతయ్యా" అని అడిగాడు చిన్నా. 


  "అవును గానీ చిన్నా...మీ నానమ్మ చెప్పినట్టు ఇవి దెబ్బలు కావు...నా బాల్యపు తీపి జ్ఞాపకాలు"...అన్నాడు మనుమడితో ఆకాష్.


   తాతయ్య ఏమన్నారో ఆ చిన్ని బుర్రకు అర్థం కాలేదు. 


   "అదేరా....ఇప్పుడు మీరు ఏసీ రూముల్లోనూ...ఫ్యాన్ల కిందా కూర్చుని కరెంటు ఖర్చు చేస్తూ ఆడుకునే ఈ టెక్నాలజీ ఆటలు మాకుండేవి కాదు". 


   "మరి"...? మనుమడు నోరెళ్లబెట్టిఅడిగేసరికి...బాల్యాన్ని విప్పాలని కుతూహలం పెరిగిపోయింది ఆకాష్ కి. 


   "అప్పట్లో మేమెన్ని ఆటలు ఆడుకునేవాళ్లమో...! కర్రా బిళ్లా, నేలా బాండా, దొంగాట, ఏడుపెంకులాట, కోతి కొమ్మచ్చి, గోళీ లాట,బొంగరాలాట, కబడ్డీ ఇంకా ఇలాంటివెన్నోఉన్నాయి. ఆ ఆటలెవరూ ఇప్పుడు ఆడడం లేదు గానీ..ఆ ఆటల్లో మంచి వ్యాయామం ఉండేది. అలాగే ఆ ఆటల్లో దెబ్బలు కూడా తగిలించుకునేవాళ్ళం. వాటిని పెద్దగా లెక్క చేసేవాళ్ళమే కాదు. కాఫీ పొడో...పసుపు పొడో అద్దేసి..మళ్లీ ఆటల్లో పడిపోయేవాళ్ళం. ఆ ఆటల తాలూకూ గుర్తులే ఈ మచ్చలు. ఏ మచ్చ యే ఆట వల్ల వచ్చిందో గుర్తుకొస్తే... అప్పటి స్నేహితులు, ఆటలు కళ్ళముందు మెదులుతాయి". అంటూ వివరించేసరికి ఎంతో శ్రద్ధగా విన్నాడు చిన్నా. 


    "ఫిట్నెస్ లేని మీరు ఆడే ఈ వీడియో గేములు ఈరోజు ఉన్నవి రేపటికి మారిపోతూంటాయి. కళ్ళకు , చేతులకు , బుర్రకి కూడా అలసటే. మీరు ఆడే ఈ ఆటలు ముందు ముందు కూడా గుర్తుండవు. బాల్యపు జ్ఞాపకాలు పెద్దయ్యాక తల్చుకునేలా ఉండాలి. అందుకే...మేమాడుకున్న ఆటలు మాకు ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉంటాయి"...అంటూ అప్పటి ఆటల విశిష్టత చెప్పాడు ఆకాష్. 


   చిన్నా ఎంతో ఇష్టంగా విన్నాడు. "సరే తాతయ్యా...నేను మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. మేమూ పెద్దయ్యాక గుర్తుండిపోయే ఆటలు ఆడించు"...అన్నాడు.


   వాడి ఉత్సాహానికి ముచ్చటేసింది. "తప్పకుండా ఆడిస్తానురా" అన్నాడు వాడిని ముద్దాడి. వారిద్దరి మాటలూ వింటున్న భూమిక...విరగపడి నవ్వింది భర్త మనుమడి

 కిచ్చిన మాటకు.


   "సర్లెండి. మనమున్నది పల్లెటూరో...టౌనో కాదు. మహా నగరంలో ఉన్నాము. ఈ అపార్టుమెంట్లో బాల్కనీయే ఓ పెద్ద ప్రపంచం మనకి. ఇంకెక్కడ ఆడిస్తారు గనుక...? ఎక్కడ చూసినా..సిమ్మెంటు భవనాలే గానీ...పిల్లలకంటూ ఆడుకోడానికి ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపిస్తున్నాయి...? అవిలేకపోవడం వల్లే...ఇలాంటి వీడియో గేములూ...పబ్జీలు ఆడుకోవడమే ఇప్పటిపిల్లల గతి". అంటూ...నిజాన్ని నిక్కచ్చిగా తేల్చిపడేసింది భూమిక.


    నిజమే సుమీ... కనీసం స్కూళ్లలో కూడా ఆట స్థలాలు కరువయ్యాయి. అన్నీ కార్పొరేట్ స్కూళ్లే ఎక్కువుగా పుట్టుకురావడంతో.  

    

   ఆనాటి బాల్యపు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ఆటల్ని ఇకపై పిల్లలకు కథలుగానే వినిపించాల్సి వస్తుందేమో ....??? ఆకాష్ మనసులో ఏదో నిరాశ చోటుచేసుకుంది మనుమడు కోరిక ఎలా తీర్చాలా అని...!!*


 

      ***              ***             ***


    


    


   







 


Rate this content
Log in