బాల్యం మరలా రాదు
బాల్యం మరలా రాదు
గతముతో సతమతం లేదు,
భవిష్యత్తు భయం లేదు,
వర్తమానం పొద్దస్తమానం
ఆటపాటలతో గడిపే
వినోద విహారులు,
అలసట ఎరుగని ప్రవాహులు,
బాదర బందీ లేని బాలలు.
వాళ్ల రంది కోసమేమో ముందు
నోరూరించే చిరుతిండ్ల బజారులు,
జేబులో పైసల్లేకపాయే,
పైకేమో డాబులకు పోయే,
ఉంటాడో దోస్త్ గాడు కొనిచ్చి
కాస్త కొరికిచ్చి పంచుతాడు.
తనివి తీర్చిన స్నేహం నక్షత్రమంత,
తన్మయం చెందెను ప్రాణం ఆకాశమంత.
అంతస్థులు చూసుకోని
మస్త్ గాళ్లు బోలాగా బాతఖానీలు
కొడుతూ జాస్తీగా తిరుగుతారు.
చప్పరింతలోనే ఉంది ఇచ్చగింత,
అదే పైకి కనబడే ముదము ముఖమంతా.
మరువలేము ఆ బాల్యం మరలరాదు,
మరల వచ్చే తరము చూడబోదు.
అవి కల్మషం లేని సంతోషాలు,
సంజీవని సహవాసాలు,స్మృతించుకుంటే
పునర్జీవ ఔషధాలు
