సమీక్ష
సమీక్ష


కిరాణా షాపులో వ్యాపారి రామదాసు ఎండకు చిరాకు పడుతూ కూర్చున్నాడు. ఆ రోజు షాపులో ఉన్న ఒక్క కుర్రాడిని భోజనానికి పంపి తను కూర్చున్నాడు. వాడు వచ్చే వరకు తాను ఉండాల్సిందే.
ఇంతలో ఒక కుర్ర వాడు వచ్చి ఫోన్ చేసుకుంటానని అడిగాడు. తన షాపులో కాయిన్ బాక్స్ ఫోన్ ఉండడంతో వాడికి చిల్లర ఇచ్చాడు.
వాడు ఎవరికో ఫోన్ చేసి "సార్, మీ షాప్లో ఖాళీ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను." అన్నాడు
""లేదయ్యా, నా షాపు లో కుర్రాడు ఉన్నాడు. నాకవసరం లేదు." అని అవతలి వ్యక్తి చెప్పాడు.
"సార్, అతనికిచ్చే జీతంలో సగం ఇచ్చినా చేస్తాను, కాదనకండి సార్." ఈసారి ప్రాధేయ పడ్డాడు.
" వాడు నమ్మకంగా చేస్తున్నాడయ్యా, మాకక్కరలేదు. అయినా ఇదేం పద్దతి, ఫోన్ చేసి ఉద్యోగం అడగడం" అ
ంటూ విసుక్కొని ఫోన్ పెట్టేసాడు అవతలి వ్యక్తి.
కుర్రాడు ఆనందంగా వెళ్ళి పోతుంటే రామదాసు పిలిచి "నేను నీకు ఉద్యోగం ఇస్తాను, చెయ్యి" అన్నాడు.
"అక్కర్లేదు సార్, నాకు ఉద్యోగం ఉంది. నేను ఆయన దగ్గర
ఈమధ్యే చేరాను. ఆయనకి నాపని నచ్చిందో, లెదో తెలుసు కోవాలని అలా మాట్లాడాను."అని నమస్కరించి వెళ్ళి పోయాడు.
తన పనితనం ఎలా ఉందో తెలుసుకొని, అవసరమైతే మెరుగు పెట్టుకోవాలన్న ఆ కుర్రాడి తపనకి ముచ్చట కలిగింది రామదాసుకి.
తన పనిని తానే సమీక్షించుకోవడం అనేది చాలా గొప్ప యోచన. అలాంటి వారు జీవితంలో తప్పక పైకి వస్తారు.
నీతి : ఈ విధంగా పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరి విషయంలో వారు తమని తాము తోచిన రీతిలో సమీక్షించుకుంటే చక్కగా రాణిస్తారు