కర్మ యోగం
కర్మ యోగం
కర్మ అంటే పని. ఈ లోకంలో ఒక కర్మ స్థానం. కష్టపడితే పనికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. మంచి పనికి మంచి బహుమతి, చెడు పనికి చెంపదెబ్బ తప్పవు. అంతా దైవాధీనం అనుకుని శ్రమించకుండా కూర్చుంటే నోటికి ముద్ద, కంటికి నిద్ర, ఒంటికి ఆరోగ్యం దక్కవు. మన జీవితాలు, ఆలోచనలు, ఆకాంక్షలు వెలుగులు ఆదుకోవు. సుఖపడాలంటే ముందు అందుకు తగిన వనరులు సిద్ధం చేసుకోవాలి. రైతు భూమి దున్ని, విత్తనం చల్లి, నీరు పోసి, పంట పండిస్తాడు. అలాగే మనమూ గమ్యం వైపు ఆచితూచి అడుగేయాలి. జీవిత పరమార్థం సాధించాలి. సత్య ధర్మాన్ని పాటించాలి.
ఏ పని తలపెట్టినా మనసు పెట్టి ముందుకు సాగాలి. ముందే లాభనష్టాల గురించి ఆలోచిస్తే చేయాల్సిన పని చేయజారుతుంది. పని మీద శ్రద్ధ లేకపోతే బుద్ధి మందగిస్తుంది. పనితో అనుసంధానం కావడమే కర్మ యోగం. నిష్కామంగా పనిచేయడమే కర్మ ఫలం. ఉపాధి నుంచి సమాధికి చేయాలంటే సాధన చేయాలి. ఆ తర్వాతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
కాయిక, వాచిక, మానసిక... అని కర్మలు మూడు రకాలు. వాటి ద్వారా ధర్మమార్గంలో పయనించాలి. ఒళ్ళు మరిచిన, నోరు జారిన, మనసు మారినా ప్రమాదాలు తప్పవు. కామ్యకర్మలు (ప్రతి ఫలాపేక్షతో చేసే పనులు) భౌతిక అవసరాలకు పరిమితమైనవి. వాటిని సాదించడానికైనా తగిన వనరులు అవసరం. మహాభారతంలో కర్మ గురించి చక్కని కథ ఉంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఒకరికి మారుగా మరొకరు కానీ, ఏదో ఒక నష్టపరిహారం కానీ చెల్లవు. కర్మానుభవానికి అనేక కోణాలుంటాయి. కారణాలు ఉంటాయని చాటుతుంది ఆ కథ.
తన మిత్రుడు పాముకాటుతో చనిపోయాడన్న దుఃఖంతో పగ తీర్చుకోడానికి ఒక వేటగాడు ఆ పామును చంపబోయాడు. అతడి మిత్రుడు చావుకు బాధ్యత తనది కాదని, తాని నిమిత్త మాత్రురాలినేనని, విధి రాత ఎవరికైనా తప్పదని చెబుతుంది పాము. కారణం లేనిది కార్యం జరగదని, కర్మవాసనలు వెంటాడుతూ సంయోగ వియోగాలు ఏర్పడుతుంటాయని నచ్చజెబుతుంది. వేటగాడికి జ్ఞానోదయామై పామును వదిలేస్తాడు. కర్మ వికటిస్తే కర్రే పామై కాటు వేస్తుందన్న సామెత మనమెరిగిందే.
కర్మ సహజ ప్రక్రియ. తెలిసి చేసినా, తెలియక చేసినా దానికి తగ్గ ఫలితం అనుభవించాలి. అది ప్రకృతి నియమం... దైవ నిర్ణయం! కర్మ జీవులు జీవితచక్రంలో గిరగిర తిరుగుతుంటారు. జ్ఞానులు, యోగులు అందుకు అతీతులు. వారు నిస్వార్ధ బుద్దితో చేసే కర్మలు లోకహితమై జన కల్యాణానికి దోహదం చేస్తాయి. అలంటి కర్మ చరణను 'అకర్మ' అంటారు. కుటిల మనసుతో పరులకు హానికరమైన పనులు (నిషిద్ధ కర్మ) చేసేవారూ లోకంలో ఉంటారు. అది 'వికర్మ'. దానికి తగిన శిక్ష వారు ఎప్పటికైనా అనుభవించక తప్పదు.
