STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

4  

Harika Addala

Children Stories Inspirational Children

ఎవరెక్కువ తినాలి

ఎవరెక్కువ తినాలి

2 mins
0

అనగనగా ఒక ఊరిలో మాధవ్, గోవింద్, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు. నడిచి నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికి అయిపోయాయి. 

"రేపు మధ్యాహ్నానికి గానీ ఆ ఊరు చేరుకోము కదా, అప్పటి వరకు ఏం తినాలి" అని ఆలోచించసాగారు.

అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తియ్యటి వాసన వేస్తున్న పనసపండు వేలాడుతూ కనిపించింది. గబగబ వెళ్లి ముగ్గురూ కలిసి పండును కోశారు. 

"పనసపండును నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి" అని మాధవ్ అన్నాడు.

"ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు" అని గోవింద్ అన్నాడు.

ఇద్దరూ వాదించుకోవటం మొదలుపెట్టారు. మాటామాటా పెరిగి తన్నుకునేంత వరకు వచ్చింది. అప్పుడు రఘు వారిద్దరినీ ఆపి, "చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి పెడతాం. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడు." అని సర్ది చెప్పాడు. మర్నాడు ఉదయం మాధవ్, గోవింద్ లు త్వరగా నిద్ర లేచారు. 

"దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడు." అని మాధవ్ చెప్పాడు. 

"లేదు లేదు... దేవుడు నాకలలో కన్పించి, నన్నే పెద్దవాటా తీసుకోమని చెప్పాడు" అని గోవింద్ చెప్పాడు. ఇలా వీళ్లిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు.

మాధవ్, గోవింద్ లు కలిసి రఘుని తట్టి నిద్ర లేపారు. "ఎందుకు ఇంతసేపు పడుకున్నావు?" అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు. 

అప్పుడు రఘు "నేను దేవుడి మాటను కాదనలేకపోయాను, అందుకే ఇంతసేపు నిద్రపోయాను. రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయమని చెప్పాడు. కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవటం వలన త్వరగా మెలుకువ రాలేదు" అన్నాడు. 

"ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వొక్కడివే మొత్తం తినేస్తావా, మాకోసం చెరో నాలుగు పనస తోనలైనా ఉంచకపోయావా?" అని రఘుని తిట్టారు.

ఎక్కువ కావాలని ఆశ పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు. ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.

అప్పుడు రఘు "బాధపడకండి. పనసపండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను" అన్నాడు.

చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండును తీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవ్, గోవింద్ సంతోషించారు. ముగ్గురూ కలిసి పనసపండును సమానంగా పంచుకుని తిన్నారు. హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు.


Rate this content
Log in