దుప్పి తెలివి
దుప్పి తెలివి
అనగనగా ఓ అడివి. అందులో ఓ దుప్పి. ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ... చాలా దూరం వెళ్లింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటకు వద్దాం... అనుకునేంతలో గుహవైపు వస్తున్న పెద్దపులి కనపడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది.
గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనపడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలిగిపోలేదు. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు.
వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో... 'ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు.. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెబుతున్నా... దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికే తొంబై తొమ్మిది పులుల గుండెలు తిన్న. ఇదొక్కటి తింటే వంద అవుతాయి' అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది.
పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింగి. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది.
'ఎందుకు పరిగెడుతున్నావు?' అని పులిని అడిగింది.
అది విన్న విషయం చెప్పింది. 'పదా... వెళ్లి చూద్దాం!' అని అంది తోడేలు.
పులి భయం... భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈ సారి తోడేలు, పెద్దపులి కనిపించాయి. మరో సారి గొంతు మార్చి 'పెద్దపులి వచ్చేలా లేదు కానీ... ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్లి చూసొస్తా... మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈ రోజు మనం పులి, తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే' అని గంభీరంగా అంది దుప్పి.
అంతే... తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పెరిగెత్తిబోయింది. ఈ కంగారులో అది పెద్దపులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులికూడా ఉలిక్కిపడి... కిందపడింది. వెంటనే పైకిలేచి ఈ సారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది.
'బతుకు జీవుడా!' అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడూ ఆ గుహ వైపు వెళ్లే సాహసం చేయలేదు.
