STORYMIRROR

Harika Addala

Children Stories Inspirational Children

4  

Harika Addala

Children Stories Inspirational Children

కోతి పాట్లు

కోతి పాట్లు

2 mins
0

అనగనగా ఒక అడివిలో ఒక తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహరం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడివికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడివికి తెచ్చుకుని తింటూ ఉండేది. 

తోడేలు చేసే పనుల్ని అడివిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది.

ఒకరోజు కోతి "నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుకుంది" అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు "ఈ రోజు రాత్రికే నిన్ను తెలుసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు" అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయం అవుతుండటం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్ధం అయింది. వెంటనే తోడేలుపై కర్రతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, "మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా! నన్నెందుకు కొడుతున్నారు? వదిలేయండి" అని అడిగింది.

"తోడేలుకి సహాయంగా వచ్చావు. నిన్ను మాత్రం ఎలా విడిచి పెడతాం!" అంటూ కొట్టసాగారు.

ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకొని 'బతుకు జీవుడా' అనుకుంటూ అడివికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకుని లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది.

నీతి: చెడు చేయకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు.


Rate this content
Log in