చిట్టెలుక సాహసం
చిట్టెలుక సాహసం
చిన్నారి చిట్టెలుకకి సాహసాలు చెయ్యడమంటే భలే ఇష్టం. ఎప్పుడూ ఏవో తలకు మించిన సాహసాలు, అల్లరి పనులు చేయడం, పీకల మీదకి తెచ్చుకోవడం...! తల్లి అనేక విధాలుగా చెప్పి చూసింది. సాహసాల జోలికి పోకుండా బుద్ధి కలిగి ఉండమని హెచ్చరించింది. తల్లి చెప్పినంతసేపు ఊ కొట్టి తలాడించేది చిన్నారి చిట్టెలుక. కాసేపయాక మళ్ళీ మాములే. తన తోవ తనదే. తన ధోరణి తనదే. తల్లి ఎలుక చెప్పి చెప్పి విసిగిపోయింది. చిట్టెలుక చేసే సాహస కృత్యాలు చిన్నవేమి కావు. వొళ్లు గగుర్పోడిచే పనులు. ఎత్తుల మీదనుండి దుమికేది. మంటల్లో నుండి గెంతేది. కౄర జంతువులకు కోపం తెచ్చేలా వాటి జోలికి వెళ్లి అల్లరి పెట్టేది. ఏనుగుని వెక్కించేది. సింహం జూలు పట్టుకుని లాగేది. నక్కల తోకలు కొరికేది.
అన్నిటికన్నా ముఖ్యంగా తమకు సహజ శత్రువులైన పిల్లులను రెచ్చగొట్టి తన వెంట పరుగులు పెట్టించేది. వీటికి దొరకకుండా పరుగు పెడుతూ ఏ కలుగులోనో దూరిపోతూ ఉండేది. ప్రాణం పణంగా పెట్టి ఆడే ఈ క్రీడ అంటే దానికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే అదంటే అక్కడి పిల్లులన్నింటికీ మంటే. ఎలాగయినా ఈ చిట్టెలుకని భరతం పట్టాలని అవి గట్టిగా తీర్మానించుకున్నాయి.
ఇలా ఉండగా ఒకరోజు ఒక గండు పిల్లి తరుముతూండగా ఈ చిట్టెలుక పరుగులు తీసింది. చాలా దూరం పరిగెత్తేక ఒక కొండా కనిపించింది. కొండ మీద ఒక పెద్ద గుహ కనిపిస్తే దానిలోకి దూరింది. ఆ గుహ ఎంత పెద్దదంతే దానికి అంతూపొంతూ కనిపించలేదు. గండుపిల్లి కూడా ఆ గుహలో దూరి ఈ చిట్టెలుక కోసం చాలాసేపు వెతికి అది కనిపించకపోవడంతో వెనుతిరిగింది.
చిట్టెలుక ఆ గుహలో చాల దూరమే తిరిగింది కానీ, ఆ గుహలోంచి బయటపడేందుకు దారి దొరకలేదు. పైగా చాలాసేపటి నుండి పరిగెట్టడం వల్లనేమో దాహం కూడా వేయసాగింది. గొంతు తడుపుకోడానికి కాసిన్ని మంచినీళ్లెక్కడ కనిపిస్తాయని వెతకసాగింది. ఆ గుహలో కూర్చుని ప్రశాంతంగా జపం చేసుకుంటున్న ముని కనిపించాడు దానికి.
అయన ముందున్న కమండలం కూడా కనిపించింది. ఇకనేం, ప్రాణం లేచొచ్చినట్టయింది చిట్టెలుకకి. ఎలా అయినా ఆ కమండలంలోని నీళ్లతో దాహం తీర్చుకోవాలని దాని ఆలోచన. మెల్లిగా వెళ్లి ఆ కమండలం పైకెక్కి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయసాగింది. ఈ అలికిడికి కాస్తా జపం చేసుకుంటున్న ముని మెల్లిగా కళ్ళు తెరిచాడు.
తన తపోభంగానికి కారణమెవరని చూసిన మునికి కమండలం పైనున్న చిట్టెలుక కనిపించింది. మునికి ఆగ్రహం కలగకపోగా ఆ చిట్టెలుక కదలికలూ, నీళ్ల కోసం అది చేసే ప్రయత్నమూ ముచ్చటగొలిపింది. ఇది బహు చిలిపిదనీ, సాహసాల ఎలుకనీ, ఆయన దివ్యదృష్టికి తెలిసిపోయింది. వెంటనే ఆ ముని కమండలంలోని నీరు దానిపై చల్లి ఏవో మంత్రాలు చదివాడు.
అమాంతం ఆ చిట్టెలుక కాస్తా అందమైన రాకుమారుడిగా మారిపోయి, ముని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు ముని ఇలా చెప్పాడు.
"ఓయీ, నాకు నీ సాహసాల సంగతంతా తెలుసు. సామజిక ప్రయోజనాల్లేని సాహసాలకు సార్ధకత ఉండదు. ఈ దేశపు రాజుకు పుత్రసంతానం లేదు. సాహసవీరుడికి తమ ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసి రహ్యపాలననూ అప్పజెప్పాలని రాజుగారి ఆలోచన. నేవెళ్లి రాజుగారికి కనిపించి, సహజమైన నీ ధైర్యసాహసాలనూ, మా అనుగ్రహంతో పొందిన బుద్ధిబలాన్నీ ప్రదర్శించు. రాజుగారి మెప్పునీ, రాజకుమారినీ నీ సొంతం చేసుకో" అంటూ ఆశీర్వదించి పంపాడు.
ఉత్సాహంగా బయల్దేరిన ఆ యువకుడు, ముని చెప్పినట్టే చేసి, ఆనతికాలంలోనే గొప్ప రాజయ్యాడు.
