STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

కాకి ఎంగిలి(పలుకుబడి కథ)

కాకి ఎంగిలి(పలుకుబడి కథ)

2 mins
47

కాకి ఎంగిలి

**************

కాకులపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న నిఖిత, లిఖిత స్నేహితులు. నిఖిత ఒకరోజు పాఠశాలకు జామకాయను తీసుకువెళ్ళింది. విరామసమయంలో ఆ జామకాయ చుట్టూ కాగితాన్ని చుట్టి గట్టిగా కొరికి రెండుముక్కలు చేసింది. ఒక ముక్క తినమని లిఖితకు ఇచ్చింది. 


“నేను ఎంగిలి తినను.” అంది లిఖిత. 


“పరవాలేదులే ఇది కాకి ఎంగిలే తిను.” అంది నిఖిత. 


“ కాకి ఎంగిలి అంటే?” అని సందేహం వెలిబుచ్చింది లిఖిత. 


“ఏమో నాకూ తెలియదు. మన తరగతి పిల్లలు అనుకుంటూ ఉంటే విన్నాను. సత్యం మాష్టారును అడిగి తెలుసుకుందాం పద.” అంది నిఖిత. 


ఇద్దరూ కలిసి సత్యం మాష్టారు దగ్గరికి వెళ్లి “కాకి ఎంగిలి అంటే ఏమిటి మాష్టారు?” అని అడిగారు.


 “మంచి ప్రశ్న వేశారు పిల్లలూ “ఎంగిలి” అంటే ‘తినగా వదిలిన పదార్థం.’ అలాంటి పదార్థం తినడం వల్ల సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి చేరి వ్యాధులు సంక్రమిస్తాయి. ‘కుక్క ముట్టిన కుండ మైల కుండ’ అంటారు. ఎందుకంటే అది అశుద్ధం తింటుంది అందువల్ల దాని నోటి చుట్టూ అనేక రోగ కారక క్రిములు ఉంటాయి. ఆహారాన్ని తినేటప్పుడు నాలుకతో నాకుతూ తినడం వల్ల ఆ ఆహారం అంతటికీ సూక్ష్మ క్రిములు వ్యాపిస్తాయి. కుక్క ముట్టుకున్న ఆహారం మనం తింటే రోగాల బారిన పడతాం. అదేవిధంగా ‘చిలక్కొట్టు’ అంటాం అంటే చిలుక తిని వదిలేసిన పండు అని అర్థం. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఆ పండును శుభ్రంగా కడుక్కుని తినవచ్చు. ఇక కాకి విషయానికి వస్తే కాకి ఒక్కొక్క మెతుకును ముక్కుతో తీసుకుని తింటుంది. అందువల్ల ఆహారం మొత్తం పాడవదు. కాకి ముట్టుకున్న కొద్దిపాటి ఆహారాన్ని పక్కకు తీసేసి, మిగిలినది మనం తినవచ్చని పెద్దలు చెప్పిన మాట. అలా అప్పటి నుంచి కాకి ఎంగిలి అనే పలుకుబడి వాడుకలోకి వచ్చింది. సాధారణంగా బడిలో ఉండే పిల్లలు వారు తెచ్చుకున్న తినుబండారాలకు కాగితం, లేదా గుడ్డను చుట్టి

కొరకడాన్ని కాకి ఎంగిలి అంటారు. అంటే ఆ పదార్థం ఎంగిలి కాలేదు, తినవచ్చు అనే సందర్భంలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. ఇదర్రా పిల్లలూ కాకి ఎంగిలి అంటే” అన్నారు మాష్టారు.

లిఖిత సందేహం తీరింది. నిఖిత ఇచ్చిన జామకాయ ముక్కను తీసుకుని ఎంతో ఇష్టంగా తిన్నది.


(ప్రజాశక్తి చిన్నారి లో 18-5-2024 న ప్రచురితమైంది)


Rate this content
Log in