STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

గర్వ భంగం

గర్వ భంగం

2 mins
27

గర్వభంగం 

**********

వీధిలో గోల గోలగా ఆడుతున్నారు పిల్లలంతా. "ఆడింది చాలు, లోపలికి రండి పిల్లలూ...ఋషి పక్షులు తిరిగే వేళ అయ్యింది." పిలిచింది పెద్దమ్మ. దొంగాట ఆడటానికి అంకెలు లెక్కపెట్టబోతున్న రుద్ర ఆగిపోయి, "ఋషిపక్షులా? అంటే ఏమిటి పెద్దమ్మా?" అని అడిగాడు.


"మీరంతా ఇలా వచ్చి కూర్చోండి ముందు. ఇదిగో ఈ గోలెం లో నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని, వచ్చి ఈ పప్పు, బెల్లం తినండి. ఆడి ఆడి అలసిపోయారు కదూ!" అంది పెద్దమ్మ. పప్పు బెల్లాలని చూసేసరికి పిల్లలకు నోరూరింది. గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నారు. అందరికి దోసిట్లో పప్పు బెల్లాలు పెట్టింది పెద్దమ్మ. గబగబా తినేసి, చొక్కా అంచుతో మూతి తుడుచుకుంటూ, "ఇప్పుడు చెప్పు పెద్దమ్మా... ఋషిపక్షులు అంటే ఏంటి?" మళ్ళీ అడిగాడు రుద్ర.


"అదిగో అటు చూడండి... ఒక్కొక్కటి ఎగిరి వస్తున్నాయిగా... అవే ఋషిపక్షులు." అంది పెద్దమ్మ.


"అబ్బే! అవి గబ్బిలాలు పెద్దమ్మా... మా పెరట్లో చింతచెట్టు నిండా అవే. ఒకటే కంపు. పగలంతా తలకిందులుగా ఉంటాయి. ఒకటే గోల కూడాను." అంటూ చేతులు వేలాడేసి, అభినయించి మరీ చూపించింది సిరి. 


"అవునే సిరి. గబ్బిలాలనే ఋషిపక్షులు అని కూడా అంటారు." అంది పెద్దమ్మ.


"ఎందుకు పెద్దమ్మా? అవి తలకిందులుగా ఉంటాయి?" అడిగాడు రుద్ర.


"చెప్తాను. పూర్వం చంద్రగిరి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో అనేక పక్షులు, జంతువులు ఉండేవి. అవన్నీ కలసిమెలసి ఆనందంగా జీవించేవి. వాటిలో గబ్బిలాలు కూడా ఉండేవి. అవి పక్షుల్లా ఎగిరేవి. జంతువుల్లా పిల్లల్ని కని, పాలిచ్చి పెంచేవి. పక్షులు, జంతువుల లక్షణాలు రెండూ ఉండడంతో వాటికి చాలా గర్వంగా ఉండేది. కొన్నాళ్ళ తరువాత గబ్బిలాలు అన్నిటికీ తల తిరగడం ప్రారంభమయ్యింది. అలా కొన్నాళ్లకు ఎదురుగా ఉండేవన్నీ కూడా తలక్రిందులుగా కనిపించేవి. చూపు కూడా మందగించినట్లుండేది.  


ఆ బాధ పడలేక ఒకరోజు నాటు వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి వాటి సమస్యను చెప్పుకున్నాయి గబ్బిలాలు. ఎలుగుబంటి చెప్పిన పసరు మందులన్నీ వాడాయి. అయినా ఫలితం లేక పోయింది. ఏమి చెయ్యాలో తోచక లబో దిబో మంటూ దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ ఒక సాధు పుంగవుడు జపం చేస్తూ కనిపించాడు. అతడి దగ్గరికి వెళ్ళి "ఓ మహానుభావా! మా సమస్యను పరిష్కరించు" అని ప్రాధేయ పడ్డాయి. దివ్య దృష్టితో వాటి సమస్యను తెలుసుకున్న సాధుపుంగవుడు “హిమాలయాల్లో తలకిందులుగా తపస్సు చేసుకుంటున్న నాగా సాధువును కలవండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది” అని చెప్పాడు.


 సాధువుకి ధన్యవాదాలు తెలియచేసి గబ్బిలాలన్నీ హిమాలయాల వైపు ప్రయాణం చేశాయి. అలా కొంతకాలానికి హిమాలయాల్లో తిరిగి తిరిగి తలకిందులుగా తపస్సు చేసుకుంటున్న నాగా సాధువు ఆచూకీ తెలుసుకున్నాయి. అతని దగ్గరికి వెళ్ళి వాటి సమస్యను చెప్పుకున్నాయి. "ఎలాగైనా పరిష్కారం చూపండి" అని ప్రాధేయ పడ్డాయి. వాటి బాధను అర్థం చేసుకున్న నాగా సాధువు "మీరు కూడా నాలాగే తలక్రిందులుగా ఉండడం అలవాటు చేసుకోండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాదు సాయంత్రం పూట మాత్రమే ఆహారానికి వెళ్ళండి. ” అని చెప్పాడు. 


అతను చెప్పినట్లుగా గబ్బిలాలన్నీ చెట్టు కొమ్మలకు తలకిందులుగా వేళాడటం మొదలుపెట్టాయి. దీంతో ఎదురుగా ఉన్న వన్నీ కూడా సరిగ్గా కనిపించడమే కాక తల తిరగడం కూడా పోయింది. రాను రాను తలకిందులుగా వేళాడటం వాటికి అలవాటైపోయింది. ఋషులు తలకిందులుగా తపస్సు చేసినట్లు ఇవికూడా ఉంటాయని, వీటిని ఋషి పక్షులు అని పిలవడం మొదలుపెట్టారు. ఇదర్రా పిల్లలూ గబ్బిలం కథ." అని ముగించింది పెద్దమ్మ. 


మళ్ళీ పళ్లెం నిండుగా చేగోడీలు తెచ్చి, పిల్లలందరికీ పంచింది. చేగోడీలు చేత్తో పట్టుకొని, "ఋషిపక్షులు... గబ్బిలాలు... ఋషిపక్షులు... గబ్బిలాలు.." అరుచుకుంటూ, ఎగురుకుంటూ పిల్లలంతా వాళ్లిళ్లకు వెళ్లిపోయారు.


(సహరి మాసపత్రిక ఏప్రిల్ 2024 సంచికలో ప్రచురితమైంది.)


Rate this content
Log in