Rama Seshu Nandagiri

Children Stories

4  

Rama Seshu Nandagiri

Children Stories

చింటూ మంచితనం

చింటూ మంచితనం

2 mins
54


చింటూ స్కూల్ బస్ దిగి ఇటూఅటూ చూసాడు. ఒక పెద్దాయన, రోడ్డు దాటలేక అవస్థ పడుతున్నట్టున్నారు. చింటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు.

"తాతగారు, మీరు రోడ్డు దాటాలా. రండి నేను దాటిస్తా." అన్నాడు .

"ఎందుకులే బాబు, నీకు శ్రమ. చిన్నవాడివి. మెల్లగా చూసుకొని నేను దాటుతాలే నాయనా." అన్నారు వాత్సల్యం గా.

"ఫర్వాలేదు తాతగారూ, నాకు అలవాటే. నా పేరు చింటూ. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. రోజూ నేను స్కూల్ కి వెళతాను కదా. రోడ్డు దాటి వెళ్తాను. రండి." అంటూ ఆప్యాయంగా చేతి మీద చెయ్యి వేశాడు చింటూ.

ఆయన తదేకంగా చింటూనే చూస్తున్నారు.

ఆయనకు తన పిల్లలు గుర్తు వచ్చారు. వాళ్ళూ ఇలాగే. తమ తాతగారి చెయ్యి పట్టుకుని వదిలేవారు కాదు. ఇప్పుడు పిల్లలు, మనవలు అందరూ ఉన్నా, ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. తను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేడు. వాళ్లు తన దగ్గర ఉండలేరు. కళ్ళు చెమరించాయి ఆయనకు.

"రండి తాతగారూ, రండి వెళ్దాం.' చింటూ ఆయన చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు.

"పద బాబూ." అంటూ ఆయన చింటూని అనుసరించారు. ఇద్దరూ రోడ్డు దాటారు.

"బాబూ, నేను ఈ సందులో నా స్నేహితుడి దగ్గరకు వెళ్ళాలి. నువ్వెళ్ళు నాయనా. నాకు గొప్ప సహాయం

చేశావు. నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు." అన్నారు ఆశీర్వదిస్తున్నట్లు చేయెత్తి.

"నేను ఇదే వీధి లో ఉంటాను. మీరెవరింటికి వెళ్ళాలి తాతగారూ." మళ్ళీ అడిగాడు చింటూ.

"ఇక్కడ పరంధామయ్య గారని కొత్తగా వచ్చారు బాబూ. వారింటికి వెళ్ళాలి." అన్నారాయన.

"రండి, నేను తీసుకువెళ్తా. అంటూ నాలుగిళ్ళు దాటాక ఒక ఇంటి ముందు ఆగి "ఇదే ఇల్లు." అని

లోపలికి పరుగు తీశాడు, "తాతయ్యా ఎవరో వచ్చారు" అంటూ.

పెద్దాయన ఆశ్చర్యంగా చూస్తూ గుమ్మం దగ్గర నిలబడి పోయారు. ఇంతలో లోపలినుండి వచ్చిన చింటూ తాతగారు " రాఘవా! నువ్వా, రా, రా." అంటూ ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకువెళ్ళారు.

"చింటూ మీ మననవడా పరం!" అడిగారు రాఘవ రావుగారు.

"అవును. వాడెక్కడ కలిశాడు నీకు?" అడిగారాయన నవ్వుతూ.

"మంచివాడురా. వాడే పాపం నన్ను రోడ్డు దాటించి ఇంటి దాకా తీసుకువచ్చింది." అన్నారు రాఘవరావు గారు.

అప్పుడే లోపల్నించి వచ్చిన చింటూ తల్లి రాధ "నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా." కుశలం అడుగుతూ మంచినీరు అందించింది.

"బాగున్నానమ్మా. నీ కొడుకు చాలా మంచివాడు. నేనెవరో తెలియక పోయినా, నన్ను ఇంటిదాకా చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు." అన్నారు ఆనందంగా.

ఆ మాటకి రాధ "మామయ్యా, ఈ రోజు దీపూ స్కూల్ కి వెళ్ళ లేదట. వాడికి రోడ్డు దాటడానికి భయమేసి, 'ఈ తాతగారు రోడ్డు దాటతారేమో' అని అడిగి ఆయన చెయ్యి పట్టుకుని దాటేశాడట." నవ్వుతూ.

"ఆరి భడవా, ఏదీ వాణ్ణి పిలు తల్లీ." అన్నారు పరంధామయ్య గారు నవ్వుతూ.

"అబ్బో , తెలివైన వాడేరా, మనవడు." అన్నారు రాఘవ రావు గారు కూడా నవ్వుతూ.

"వాడు సిగ్గు పడుతున్నాడు. కొంచెం సేపయ్యాక వాడే వస్తాడు. కాఫీ తెస్తాను మామయ్యా." అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధ.

స్నేహితులు ఇద్దరూ నవ్వుకొని ఒకరితో ఒకరు కబుర్లలో పడ్డారు.



Rate this content
Log in