STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

బెల్లం కొట్టిన రాయి

బెల్లం కొట్టిన రాయి

2 mins
19

బెల్లం కొట్టిన రాయి.

******************


"రుద్రా! ఎన్నిసార్లు చెప్పాలి? నీళ్ళు ఒంపొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతోంది. నువ్వు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉన్నావు. ఇక నా వల్ల కాదు. పెద్దమ్మకి చెప్తాను ఉండు నీ సంగతి" అని రుద్ర రెక్కపట్టుకు ఈడ్చుకు వెళ్ళి పెద్దమ్మ ముందు కూర్చోబెట్టింది సౌమ్య.


"చూడు పెద్దమ్మా వీడి అల్లరి... ఎలా నీళ్లు ఒంపుకున్నాడో!" అని వాడిని పెద్దమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది సౌమ్య.


"అయ్యో అయ్యో... బట్టలన్నీ తడిసిపోయాయి. పిల్లాడు నానిపోయాడు, జలుబు చేస్తుంది" అంటూ బట్టలు విప్పి తన చీరకొంగుతో తుడిచి తువ్వాలు చుట్టి కూర్చోబెట్టి, చేతిలో చేగోడి పెట్టింది పెద్దమ్మ.


చెగోడీ చూడగానే రుద్రకి నోరూరింది.


"ఇప్పుడు చెప్పు.. మీ అమ్మ నిన్ను ఎందుకు తిట్టి నా దగ్గర కూర్చోపెట్టిందో!" అని అడిగింది పెద్దమ్మ.


"బుజ్జి బుజ్జి మొక్కలకి ఆకలేసిందని నీళ్ళు పోసాను అందుకే అమ్మ తిట్టింది.” అన్నాడు చేగోడీ తింటూ.


"ఎన్ని నీళ్లు పోశావు?" 


"ఆఁ... ఒకటి, రెండు, మూడు, నాలుగు..." వేళ్లు లెక్కపెట్టుకుంటూ చెప్పాడు రుద్ర.


"నాలుగు గ్లాసుల నీళ్లు మొక్కలకు పోశావా? అందుకే తిట్టిందా?"


"అవును" అన్నాడు అమాయకంగా.


"నువ్వు బోలెడంత బుద్ధి కదా ఇంకా ఏమేం చేసావో చెప్పు. నేనెవరికీ చెప్పనులే!" అంది పెద్దమ్మ రుద్ర బుగ్గ నిమురుతూ.


"నువ్వు... నువ్వు..."


"ఊఁ .. నేను..."


నువ్వు పాలను వేడి చేశాక ఒక గ్లాసులో నుంచి మరొక గ్లాసులోకి పై నుంచి కిందకి పోసి చల్లారబెడతావు కదా, నేనూ అలాగే గోలెం నీటిని ఒక గ్లాసు లోకి తీసుకుని వేరొక గ్లాసులోకి పోసి చల్లార బెట్టాను.”


“ఇంకా ఏమేమి చేశావు బంగారం?” అని ముద్దుగా అడిగింది పెద్దమ్మ.


“మట్టిలో నీళ్ళు పోసి పచ్చడి చేశాను. గోలెం లోకి దిగి హాయిగా స్నానం చేసాను. ఎన్ని సార్లు పిలిచినా పలకలేదని నన్ను వెతుక్కుంటూ అమ్మ వచ్చింది. బెల్లం కొట్టిన రాయి అని తిట్టింది.” అని చేసిన పనులన్నీ వరుసగా చెప్పాడు రుద్ర.  


వాడి మాటలకు, అల్లరికి మనసులోనే నవ్వుకుంది పెద్దమ్మ.


“బెల్లం కొట్టిన రాయి అంటే ఏంటి పెద్దమ్మా!" అని ఆత్రుతగా అడిగాడు రుద్ర.


"రాయితో ఏ వస్తువును కొట్టినా, లేదా కింద పడినా శబ్దం వస్తుంది. కానీ బెల్లపు అచ్చును కొట్టినప్పుడు మాత్రం తక్కువ శబ్దం వస్తుంది. చాలాసార్లు బెల్లాన్ని ముక్కలు చేసిన తర్వాత ఆ రాయికి బెల్లం పేరుకుపోయి, ఆ రాయి కిందపడినా, వేరొక దానిని కొట్టినా శబ్దమే చేయదు. అంటే రాయి కాస్తా తన సహజమైన లక్షణాన్ని కోల్పోతుంది. అలాగే ఎన్నిసార్లు పిలిచినా ఉలుకు పలుకు లేకుండా స్పందించని వారిని బెల్లం కొట్టిన రాయి అని అంటారు." అని వివరించింది పెద్దమ్మ. 


"అయితే నేను బెల్లం లా తియ్యగా ఉంటానా! లేదా రాయిలా ఉంటానా పెద్దమ్మా?" అని అడిగాడు రుద్ర. 


"అల్లరోడా! తీపిమాట దేవుడెరుగు మీ అమ్మ చేత తాపులు తింటావు. బుద్ధిగా ఉండు." అని బుగ్గమీద ముద్దిచ్చింది పెద్దమ్మ.


"అయితే నేను బెల్లం ముక్కనే. రాయిని కాను" అన్నాడు రుద్ర.


"మీ అమ్మ చెప్పినట్లు నువ్వు బెల్లం కొట్టిన రాయివి కాదు. చిచ్చర పిడుగువి. ఇదిగో మరో చేగోడి తీసుకో..." అంటూ అందించింది పెద్దమ్మ.


(మాలిక అంతర్జాల పత్రిక ఏప్రిల్ 2024 సంచికలో ప్రచురితమైంది)


Rate this content
Log in