అవ్వా కావాలి బువ్వ కావాలి
అవ్వా కావాలి బువ్వ కావాలి
అవ్వా కావాలి బువ్వా కావాలి
*****************************
అనగా అనగా పుణ్యగిరి అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో శంకరం, రత్నం దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు హరి, కూతురి పేరు మానస. శివరాత్రి నాడు జరిగే జాతరకు పిల్లలు ఇద్దరినీ తీసుకు వెళ్ళింది రత్నం. దారి పొడవునా కనిపించే బూరలు, ఆట వస్తువులు, వెలిగి ఆరే బొమ్మలు కొనమని పేచీ పెట్టాడు హరి. మానస మాత్రం పేచీ పెట్టకుండా బుద్ధిగా దుకాణాల్లో అమ్మే వస్తువులన్నీ ఆసక్తిగా చూసింది. హరికి కారు బొమ్మ, మానసకి పాప బొమ్మ కొనిచ్చింది రత్నం. “నాకు రెండూ కావాలి” అని ఏడుపు మొదలుపెట్టాడు హరి. “ఒకటి నీకు ఒకటి చెల్లికి. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు” అని మందలించింది రత్నం.
“అమ్మా! అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఏంటో చెప్పవా?” అని అడిగింది మానస.
"పూర్వం పేదరాశి పెద్దమ్మ అనే పూటకూళ్లవ్వ ఉండేది. పెద్దమ్మ మనవడి పేరు రుద్రాంశ్. అవ్వని అంటిపెట్టుకుని ఉండేవాడు. వాడంటే పెద్దమ్మకి ప్రాణం.
ఒకరోజు మధ్యాహ్నం వంట పూర్తి చేసుకుని భోజనాలు వడ్డించడానికి సిద్ధపడుతోంది పెద్దమ్మ. అదే సమయం లో 'అవ్వా నాకు ఆకలి వేస్తోంది బువ్వ కావాలి' అని ఏడవ సాగాడు.
“ఏడవకురా నాయనా! ఒక్కక్షణం, ఉప్పు నెయ్యి అన్నం కలిపి తెస్తాను.” అని చెప్పి గబగబా కలిపి తెచ్చి “తిను” అంది పెద్దమ్మ.
“నాకు తినడం రాదు. నువ్వు తినిపించు.” అన్నాడు గోముగా.
“నీకు తినిపించే తీరిక లేదు. వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. ఆకలితో ఉన్నారు. నీ చేత్తో నువ్వు తింటేనే బలం. తింటూ ఉంటే అదే వస్తుంది.” అంది పెద్దమ్మ.
“అబ్బా… నాకు ఆకలేస్తోంది తినిపించవే!” అని రాగం తీసాడు రుద్రాంశ్.
“ఒరేయ్ అల్లరోడా అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. తొందరగా తింటే తాయిలం ఇస్తాను”. అంది పెద్దమ్మ.
“గబ గబ లొట్టలేసుకుంటూ తినేశాడు రుద్రాంశ్.”
“అప్పటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది.” అని చెప్పింది తల్లి.
“అంటే రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోమని దాని అర్థం అన్నమాట.” అంది మానస.
“సామెత నీకు అర్థమయ్యింది” అన్నాడు తండ్రి శంకరం.
“నాకూ అర్థమయ్యింది” అన్నాడు హరి ఏడుస్తూ.
(ప్రజాశక్తి చిన్నారి 13-3-2024 లో ప్రచురితమైంది)
