gowthami ch

Drama

4.5  

gowthami ch

Drama

అప్పగింతలు

అప్పగింతలు

3 mins
399


బీచ్ లో సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్న రేఖ పక్కనే ఉన్న తన ప్రియుడితో "శేఖర్ మనం మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేస్తే మంచిదేమో?"


"అదేంటి రేఖ! నువ్వేనా ఈ మాట అంటుంది?" ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.


"అవును శేఖర్, నేనే అడుగుతున్నాను. మనం ఎంత త్వరగా పెళ్ళి చేసుకుంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు."


"అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు రేఖ? మొన్నటి వరకు ఈ విషయం మన ఇళ్లల్లో ఇప్పుడే చెప్పొద్దు అన్న నువ్వేనా ఈరోజు ఇలా మాట్లాడుతుంది. ఇంతలోనే నీ నిర్ణయంలో అంత మార్పు ఎందుకు వచ్చింది రేఖ."


"అదేమీ లేదు శేఖర్ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు."


ఆ మాట విన్న శేఖర్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. "ఏంటి రేఖ నువ్వు మాట్లాడేది?"


"అవును శేఖర్ . ఎందుకు అంత ఆశ్చర్యం."


"ఆశ్చర్యం కాక మరేంటి రేఖ. నువ్వు పెళ్లి గురించి ఇప్పుడే ఏమి మాట్లాడొద్దు అన్నావని నేను ఇప్పటివరకు ఇంట్లో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి త్వరగా పెళ్లి చేసేసుకుందాం అంటే ఎలా. దానికి కొంచెం సమయం కావాలి."


"అంటే ఎంత సమయం శేఖర్?" అడిగింది రేఖ.


"ఎంత అంటే ఎలా చెప్తాము... ఇంట్లో చెప్పాలి, వాళ్ళు ఒప్పుకోవాలి..ఒకవేళ ఒప్పుకోకపోతే బ్రతిమిలాడాలి ఇదంతా చేయాలి కదా...అవేమీ కాకుండా ఇప్పుడే ఎంత టైం అంటే ఎలా చెప్పగలను."


"సరే అయితే నీకు ఒక 10 రోజులు టైం ఇస్తాను ఈలోపు మీ ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళ నిర్ణయం ఏంటో నాకు చెప్పు. అప్పటి వరకు నన్ను కలవకు." అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది.


10 రోజులు కాస్థ ఒక నెల అయింది కానీ శేఖర్ రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేఖ కి ఏమి చేయాలో అర్ధం కావడంలేదు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమంటారో అని ఎంతో ఖంగారు పడింది.


నెలలు నెలలు గడిచి పోతున్నాయి శేఖర్ నుండి ఎటువంటి కబురూ లేదు. ఇంక చేసేది ఏమి లేక జరిగినదంతా ఇంట్లో వాళ్ళకి వివరించింది రేఖ.


"ఎంత పని చేసావే పాపిష్టి దాన చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం. ఆ తెలివి ముందే ఉండాలి, ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని నమ్మి ఇంత వరకు తెచ్చుకున్నావ్. ఇప్పుడు ఏమి చేయాలి అని మమ్మల్ని అడుగుతున్నావా?" అంటూ కోపంతో రగిలిపోయింది రేఖ వాళ్ళ పిన్ని.


"ఇలా చూడు రేఖ జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు?" అంటూ రేఖని ఓదారుస్తూ అడిగాడు వాళ్ళ బాబాయ్.


"నాకు శేఖర్ కావాలి బాబాయ్." అంటూ బాబాయ్ కళ్ళలోకి చూస్తూ అడిగింది రేఖ.


"వాడు నిన్ను మోసం చేసాడు అని తెలిసి కూడా ఇంకా వాడే కావాలి అంటున్నావా? ఎందుకమ్మా వాడిమీద అంత నమ్మకం నీకు?"


"శేఖర్ నన్ను ఎప్పటికీ మోసం చేయడు బాబాయ్. అతను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నేను ఎవరినీ అంత సామాన్యంగా నమ్మను అని నీకు తెలుసుకదా బాబాయ్ అయినా కూడా శేఖర్ ని ప్రేమించాను అంటే అతని మీద నమ్మకం ఉండబట్టే కదా?"


"అలాగే అమ్మ నువ్వు అంతగా అతన్ని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్లే అతని ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడి వస్తాను." అంటూ బయల్దేరాడు రేఖ వాళ్ళ బాబాయ్.

************

"అమ్మా...రేఖా....! త్వరగా తయారవ్వు అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది" అంటూ అరుస్తుంది రేఖ వాళ్ళ పిన్ని.


"అలానే పిన్ని ఇంకొక్క 2 నిముషాలు అంతే" అంటూ సమాధానం ఇచ్చింది రేఖ తన గదిలో అలంకరించుకుంటూ.


రేఖని తీసుకొని వచ్చి అబ్బాయి ముందు కూర్చోబెట్టి రేఖ పక్కనే కూర్చున్నారు వాళ్ళ పిన్ని ,బాబాయ్.


ఎదురుగా అబ్బాయి , అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రులు కూర్చున్నారు.


పంతులు గారు ఏవో మంత్రాలు చదివి ఇరు కుటుంబాలనీ తాంబూలాలు మార్చుకోమన్నారు. పెళ్లి కి ఒక మంచి ముహూర్తం కుదిర్చి అమ్మాయిని , అబ్బయిని ఆశీర్వదించి అందరూ వెళ్లిపోయారు.


"ఏమ్మా రేఖ ఇప్పుడు నీకు సంతోషమేనా?"అడిగాడు రేఖ వాళ్ళ బాబాయ్.


"చాలా సంతోషంగా ఉంది బాబాయ్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను" అంటూ వాళ్ళ బాబాయ్ ని హత్తుకొని కన్నీరు పెట్టుకుంది.


రేఖ కళ్ళలో నీరు చూసి "ఎందుకమ్మా ఆ కన్నీరు?" అని ఆశ్చర్యంగా అడిగాడు వాళ్ళ బాబాయ్. "ఈ క్షణం లో అమ్మా , నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారో కదా బాబాయ్? అంటూ కళ్ళు తుడుచుకుంది.


"అయినా!! శేఖర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు బాబాయ్? అసలు ఆ రోజు నువ్వు వాళ్ళింటికి వెళ్లి ఏం మాట్లాడావు వాళ్ళతో?"


"నేనేమీ ఒప్పించలేదు రేఖ. ఊరికే వెళ్లి రేఖ నీకోసం ప్రాణం తీసుకోబోతుంటే ఆపి నీతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇలా వచ్చాను. నువ్వే ఆలోచించుకో ఇంకా ఆలస్యం చేస్తే రేఖ నీకు శాశ్వతంగా దక్కదు అని చెప్పాను అంతే.


"అది విన్న శేఖర్ నాతో పాటి రావడానికి సిద్ధమయ్యాడు. అది చూసి, వాళ్ళ తల్లి శేఖర్ ని ఆపడానికి ప్రయత్నించింది. అయినా అతను వినలేదు. ఇక బిడ్డని ఒదులుకోలేక తప్పక ఒప్పేసుకున్నారు. "పిల్లల సంతోషం కన్నా మించింది మనకు ఇంకేముంటుంది చెప్పండి. దయచేసి మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకోండి అని చెప్పి ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చి వచ్చేసాను. ఆ తరువాత ఏం జరిగిందో నీ పెళ్లి తరువాత శేఖర్ నే అడిగి తెలుసుకో."


"మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు బాబాయ్" అంది రేఖ వాళ్ళ బాబాయ్ కాళ్ళ మీద పడి నమస్కరిస్తూ.


"ఇందులో కృతజ్ఞత చెప్పాల్సిన పనేముంది చెప్పు. మీ నాన్న ఉంటే ఇలానే చేసేవాడు కదా. మా అన్నయ్య చనిపోతూ నిన్ను నా చేతికి అప్పగించాడు. నిన్ను సంతోషంగా ఉంచడం నా బాధ్యత" అంటూ రేఖని పైకి లేపి దగ్గరకి తీసుకున్నాడు.


అనుకున్న ముహూర్తానికి రేఖ మరియు శేఖర్ లకి వివాహం జరిపించి రేఖని అప్పగింతలు చేసి బరువెక్కిన హృదయంతో రేఖ కి వీడ్కోలు పలికారు.


Rate this content
Log in

Similar telugu story from Drama