అభ్యాసం కూసువిద్య
అభ్యాసం కూసువిద్య
అభ్యాసం కూసు విద్య
***************************
"పెద్దమ్మా! కథ చెప్పవూ?" అని గోముగా అడిగింది కాత్యాయని. రుద్ర ఎక్కడి నుంచో ఒక పిల్లి పిల్లను తెచ్చి “పెద్దమ్మా పులిపిల్లని తెచ్చాను చూడు.” అన్నాడు.
“భడవా! అది పులిపిల్ల కాదు పిల్లి పిల్ల. రెండూ ఒకే జాతికి చెందినవి.” అని చెప్పింది పెద్దమ్మ.
"పులులు అడవుల్లో, పిల్లులు మనదగ్గర ఎందుకు ఉంటాయి పెద్దమ్మా?" అని అడిగింది కాత్యాయని.
"పూర్వం చిరుత పులులు, పిల్లులు, అన్నీ కలిసిమెలసి జీవించేవి.
స్వతహాగా పిల్లులు తెలివైనవి, వేటాడటం, చెట్లు ఎక్కడం అన్నీ తెలుసు. పాపం పులులకు ఏమీ చేతకాక ఆహారం సంపాదించుకోలేక ఆకలితో పస్తులుండేవి. ఇది తెలిసి పిల్లులన్నీ ఎంతో బాధ పడ్డాయి. 'మిత్రులారా జంతువులను వేటాడటం ఎలాగో మీకు నేర్పుతాం" అని పులులకు చెప్పాయి.
"సరే" నని ఆరోజు నుంచి పులులన్నీ పిల్లుల దగ్గర వేటాడటం, ఈత కొట్టడం మొదలైన విద్యలన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టాయి. అనతి కాలంలోనే తమకు నచ్చిన జంతువులను వేటాడి తినేవి. పిల్లులతో కలిసి ఆడుతూ పాడుతూ గడిపేవి. ఇలా అనేక విద్యలు పిల్లుల నుంచి చిరుతపులులు నేర్చుకున్నాయి. ఒకరోజు ఆడుకుంటున్న సమయం లో రెండింటి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో పులులు కోపాన్ని తట్టుకోలేక పిల్లుల మీదకి దాడికి దిగాయి. భయపడిన పిల్లులన్నీ పరుగు పరుగున దగ్గర్లో ఉన్న చెట్టుమీదకి ఎక్కాయి. చిరుతపులులు చెట్టు ఎక్కలేక చూస్తూ నిలబడి ఉండి పోయాయి.
" చెట్టు ఎక్కడం నేర్చుకుని ఉంటే మీ తాట తీసే వాళ్ళం" అన్నాయి పులలు కోపంగా.
"అందుకే మేము మీకు ఈ విద్య నేర్ప లేదు" అన్నాయి పిల్లులు వేళాకోలంగా.
ఆరోజు నుంచి చిరుతపులుల్లో కసి పెరిగింది. ఎలాగైనా చెట్లు ఎక్కడం నేర్చుకోవాలి అనుకున్నాయి.
'తెలిసే వరకు బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య’
అనుకుని సాధన చేయడం మొదలు పెట్టాయి.
'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్నట్లు కొద్దిరోజులకు సునాయాసంగా చెట్లు ఎక్కడం నేర్చుకున్నాయి. దాంతో పిల్లులకు పై ప్రాణాలు పైనే పోయాయి. విద్యలన్నీ పూర్తిగా నేర్పలేదన్న కోపంతో చిరుత పులులు పిల్లులను వెంటాడటం మొదలుపెట్టాయి. పులుల ధాటికి భయపడి పిల్లులన్నీ 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ అడవిని వదిలి గ్రామాల్లోకి వచ్చాయి. మానవుడు మచ్చిక చేయడం తో ఎలుకల్ని తిని మనకి సాయం చేస్తూ ఇక్కడే స్థిరపడి పోయాయి పిల్లులు. మానవులు గోళ్ల కోసం, చర్మం కోసం పులులను వేటాడేవారు. వారికి భయపడి పులులు అడవుల్లో ఉండిపోయాయి. ఇదర్రా కథ. సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని పులులు నుంచి మనం నేర్చుకోవాలి ‘అభ్యాసం కూసు విద్య’ అంటే ఇదే” అని కథ ముగించింది పెద్దమ్మ.
(ప్రజాశక్తి చిన్నరిలో 5-5-2024 లో ప్రచురితమైంది)
