వేధిస్తే పిల్లైనా పులి అవుతుంద
వేధిస్తే పిల్లైనా పులి అవుతుంద
ఒక గుహలో ఒక సింహం ఉండేది. ఆ సింహానికి బద్దకం ఎక్కువ. సింహం తన రోజువారీ ఆహారం కోసం గుహదాటి వేటకు వెళ్లడం ఇష్ఠం లేక అడవిలో ఉన్న ఏదైనా జంతువుని పిలిచి తనకు ఆహారం తెచ్చి ఇమ్మని ఆదేశాలు ఇస్తుండేది. తాత ముత్తాతల ఆరోగ్య వారసత్వం వల్ల ఆ సింహం చాలా బలంగా దృడంగా ఉండేది. అందుకే దాని దగ్గర తోటి సింహాలు కూడా భయపడుతుండేవి. సింహాలు పులులు చిరుతలు ఎలుగుబంట్లు నక్కలు కుక్కలు పిల్లులు ఎలుకలు ఇలా అన్ని మాంసాహార జంతువులూ సింహానికి ఆహారాన్ని తెచ్చి ఇచ్చేవి, అయితే ఒక్కోసారి అనుకోకుండా సింహం అనుచరులు తెచ్చిన మాంసం కుప్పలు తెప్పలు అయిపోయి సింహం ఆ రోజుకి తినలేకపోయేది రెండో రోజుకు ఆ మాంసం పాడైపోయేది,అనవసరంగా విలువైన మాంసాన్ని చెత్తబుట్టలో పడేయడం జరిగేది.అందుకే ఒకరోజు మాంసాహార జంతువులన్నీ సమావేశమై రోజుకి ఒక జంతువు మాత్రమే తన వంతు వాటాగా సింహానికి ఆహారాన్ని పట్టుకొని వెళ్ళాలి. ఆ విధంగా అడవిలోని సాధుజంతువులను పొదుపుగా వాడుకోవాలి, మాంసం వృధా చేయరాదు అని నిర్ణయించుకున్నాయి. సింహానికి ఆ విషయం చెప్పగా "సరే" అని ఒప్పుకుంది. ఏ రోజు ఏ జంతువు సింహానికి ఆహారాన్ని వేటాడి తెచ్చి ఇవ్వాలో ప్రణాళికలు వేసుకున్నాయి.
ఆ మాంసాహార జంతువుల్లో బబ్రూ అనే అడవి పిల్లి ఉండేది బలం చురుకుతనం తెలివితేటలు, వేట నైపుణ్యం, యుద్ధ శక్తి యుక్తులు ఎక్కువగా ఉన్నా చూడటానికి అమాయకంగా కనిపించేది.బబ్రూని చూసేసరికి సింహానికి ఎక్కడ లేని ఉషారు వచ్చేది, బబ్రూని ఆట పట్టించడానికి బబ్రూ మంచి ఆహారం, కావల్సినంత ఆహారాన్ని తెచ్చినా దాన్ని సూటిపోటి మాటలతో హింసించేది.అంతేకాదు బబ్రూ మీద పంజా దెబ్బలు కూడా వేస్తుండేది. తోటి జంతువులు చూసినా సింహానికి భయపడి ఊరుకునేవి.అలా సింహం వద్దకు వెళ్లవలసి వచ్చిన రోజు పిల్లి బబ్రూ భీతిల్లిపోయేది.
సింహం చూపుతున్న నరకాన్ని భరించలేక ఒకరోజు బబ్రూ దిగులుతో ఆత్మహత్య చేసుకోడానికి ఒక నూతి వద్దకు వెళ్ళింది. నూతిలో లోతు ఎంతో చూడటానికి తొంగి చూసింది,అంతే నూతిలోని కప్పలు బబ్రూని పొగుడుతూ దండకాలు చదివాయి, నూతిలోకి ఆహ్వానం పలికాయి. నేను చవ
డానికే నూతిలో దూకుతున్నాను అని పిల్లి అని, అందుకు కారణంగా సింహం పెడుతున్న ఇబ్బందులు చెప్పింది. కప్పలు నవ్వుకుని "నాలుగు గోడల మధ్య బందిస్తే పిల్లైనా పెద్దపులి అవుతుంది" అని మా మిత్రులు కాకులు ఈ నూతి ఒడ్డుకు చేరి, పిల్లులు బలం పౌరుషం గురుంచి చెప్పుకుంటాయి, మిమ్మల్ని విసిగిస్తే సింహన్ని చీరేయండి అని కప్పలు గొప్పగా అరుస్తూ చెప్పాయి. పిల్లికి జ్ఞానోదయం అయ్యింది. ఆత్మహత్య ప్రయత్నం విరమించింది.
ఒకరోజు బబ్రూ తేడావస్తే సింహాతో తలపడటానికి సిద్ధమై గుహకు వెళ్ళింది. సింహం బబ్రూని యధావిధిగా హేళన చేస్తూ గుహ ద్వారం మూసేసి బబ్రూ తోక పట్టుకొని గిరగిరా తిప్పడానికి ప్రయత్నించింది.అంతే పిల్లికి కప్పలు మాటలు గుర్తుకొచ్చి రెచ్చి పోయింది. సింహాన్ని తన శక్తి మేరకు ఎగిరి గెంతుతూ రక్కేసింది. పిల్లి సృష్టించిన భయానక వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది సింహం, బెంబేలెత్తిపోయి గుహ ద్వారం తెరిచి సింహమే అడవిలోకి పారిపోడానికి ప్రయత్నం చేసింది,కానీ పిల్లి దాని ఆటలు సాగనివ్వలేదు. దాన్ని గుహ బయటకూడా ముప్పుతిప్పలు పెట్టి తన పంజా దెబ్బలు, భయంకరమైన అరుపులతో మూడు చెరువులు నీరు త్రాగించింది. ఈ గొడవ తెలిసి అడవిలోని సమస్త జీవులూ అక్కడకు చేరాయి. బబ్రూని శాంత పరిచి తనకు ప్రాణ భిక్ష పెట్టమని సింహం అడవి జీవులను వేడుకుంది. "అందుకే వేధిస్తే పిల్లైనా పెద్దపులి అవుతుందని పెద్దలు చెప్పారు, బబ్రూని నిత్యం వేధించే నీకు తగిన శాస్తి జరిగింది, అనుభవించు" అని అక్కడ నుండి అడవి జీవరాశి మొత్తం చల్లగా జారుకుంది. సింహం చేవ చచ్చి కుప్ప కూలిపోగా, పిల్లి శాంతించి " ఇకపై నువ్వు నీ ఆహారం నువ్వే కష్ట పడి తెచ్చుకో తోక జాడిస్తే... నీకు మరణమే శరణం" అని వెళ్ళిపోయింది. అప్పటి నుండి చివరికి చచ్చేవరకూ సింహం కిక్కురుమనకుండా ఉండేది. తన చేతకాని వేటలో ఆహారం దొరికితే తిని లేకుంటే పస్తులుండి పడుకునేది అంతేతప్ప ఎవరి జోలికి వెళ్ళేదికాదు. బబ్రూని అడవి మొత్తం మెచ్చుకుంది.