M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

తాతయ్య డైరీ

తాతయ్య డైరీ

2 mins
487



                


       ఒక ఊర్లో రాణి అనే అమ్మాయి ఉండేది. రాణి అల్లరి అంతాఇంతా కాదు. ఇంట్లో వుంటే ఇల్లు పీకి పందిరేసేది. వీధిలో ఉంటే పెంటమీద తగువులు ఇంట్లోకి తెచ్చేది. రాణి తాతయ్య ఊరికి మోతుబరి రైతు, అంతేకాదు ఊరు పంచాయితీ ప్రెసిడెంటుగా కూడా చాలా కాలం పనిచేశాడు, అందుకే ఊర్లో ఏ సమస్య వచ్చినా, తగువు వచ్చినా, వివాదాలు వున్నా అందరూ అతని దగ్గరికే వచ్చేవారు. రాణికి ఇంట్లో ముద్దు ఎక్కువ కావడం వల్ల తాతయ్య దగ్గరకూడా భయం లేకుండా ఉండేది. ఇంట్లో రాణీ కాసుల రంగమ్మ అని ముద్దుగా అంటే... వీధిలో వాళ్ళు విసిగిపోయి రౌడీ రాణీ అనే వారు.బడిలో మిత్రులైతే రాణీ అల్లరి వాణీ అని ఆటపట్టించేవారు.


        రాణీ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు, బడిలో తోటి పిల్లలతో నిత్యం గొడవలు తెస్తుండేది. ప్రెసిడెంటు గారి మనవరాలు కదాఅని ఊర్లో వారుకూడా రాణీ చేష్టలను పెద్దగా పట్టించుకొనేవారు కాదు, బడిలో కూడా ఉపాధ్యాయులు రాణి ఆగడాలను తాతయ్య దృష్టిలో పెట్టేవారు కాదు.


           ఒకరోజు రాణీ తరగతిలోని పిల్లలు డిజిటల్ క్లాస్ రూముకి వెళ్ళినప్పుడు, తనకి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి తరగతి గదిలోనే ఉండిపోయి తనతోటి ఆడపిల్లల నోట్ బుక్స్ తీసేసి చించివేసి, చెత్తబుట్టలో వేసేసి ఆ చెత్తని బడి చెత్తకుండీలో పడేసింది.డిజిటల్ క్లాస్ నుండి వచ్చిన పిల్లలు తమ నోట్ బుక్స్ పోయాయని గమనించి గగ్గోలు పెట్టారు, ఉపాధ్యాయులు రాణిని మందలిస్తే... ఆ నోట్ బుక్స్ పోవడానికి నాకూ సంబంధం లేదని బుకాయించింది ఆమె


                రాణీ తాతయ్యకు ఫోన్ చేసి రాణీ చేస్తున్న ఆగడాలను పూసగుచ్చినట్లు చెప్పింది పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు. రెండోరోజు రాణీ తాతయ్య స్కూల్ కి వచ్చి రాణీ తరగతి పిల్లల వద్దకు వెళ్లి రాణీ ప్రవర్తన గురుంచి అడిగాడు. ఉపాధ్యాయులు,పిల్లలు, కొంతమంది పేరెంట్స్ వచ్చి రాణీ అల్లరి శృతి మించిపోతుందని చెప్పారు. తాతయ్య అందరికీ సారీ చెప్పి, అక్కడ రాణీని ఏమీ అనకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి బడిలో రాణీ చేస్తున్న నిర్వాకాలు గురుంచి చెప్పి "దాన్ని మీరెవరూ ఏమీ అనకండి" అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.


               సాయింత్రం బడి నుండి భయం భయంగా ఇంటికి వచ్చింది రాణీ, ఇంట్లోవాళ్ళు తనని తీవ్రంగా మందలిస్తారు అనుకుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. అసలు తాతయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూడటానికి తాతయ్య గదిలోకి వెళ్ళింది రాణీ,తాతయ్య అతని డైరీలను చింపివేస్తున్నాడు. రాణీ పరిగెత్తుకొని వెళ్లి, "తాతయ్యా మీరు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టంగా రాసుకుంటున్న డైరీలను ఎందుకు చించి వేస్తున్నారు"అని ఆశ్చర్యంగా, ఆందోళనగా అడిగింది."నువ్వు బడి పిల్లలు ఎంతో ఇష్టంగా, కష్టపడి రాసుకున్న నోట్ బుక్స్ చింపేశావు,అవి వాళ్ళకి పరీక్షల ముందు చదుకోడానికి పనికి వస్తాయని నీకు తెలుసు అయినా నువ్వు వాటిని పాడు చేసి నీ స్నేహితులకే బాధ పెట్టావు. ఎందుకూ పనికిరాని నా డైరీలు చిరిగిపోతే ఎవరికి నష్టం ,అయినా నీకు పుస్తకాలు చింపిపారేయడం ఇష్టమే కదా నువ్వు కూడా నా డైరీలు చింపుకో"అని అన్నాడు తాతయ్య కాస్తా కోపంగా. రాణీ ఏడుస్తూ తాతయ్యకు సారీ చెప్పి,"ఇకపై ఎప్పుడూ అల్లరి పనులు చెయ్యను...మీరు ఎంతో ఇష్టంగా రాసుకుంటున్న మీ డైరీ మీద ఒట్టు"అని తాతయ్య చింపబోతున్న 2019 డైరీని బలవంతంగా లాగేసుకుంది, తాతయ్యకు సారీ చెప్పి చాలాసేపు ఏడ్చింది. తాతయ్య రాణీని ఓదార్చి "ఇకపై బుద్దిగా ఉండు, మంచి పనులకు జ్ఞాపకంగా డైరీ రాస్తుండు'అని 2020 నూతన సంవత్సర కొత్త డైరీని ఆమెకు కానుకగా ఇచ్చాడు. రాణీ ఆ డైరీని అపురూపంగా చూసి, తన బీరువాలో భద్రంగా పెట్టుకుంది. విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు, బడిలో వాళ్ళు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు.






Rate this content
Log in