పుల్లారు బుడ్డి
పుల్లారు బుడ్డి
పుల్లారు బుడ్డి
*****************
ఆలుగుబిల్లి గ్రామంలో రామయ్యమ్మ పెద్దఅప్పారావు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారి కొడుకు ఈశ్వర్రావు. ఈశ్వర్రావుకి పెళ్లి నిశ్చయమైంది. ఒక శుభముహూర్తాన పెళ్ళిరాట వేసి పెళ్ళికొడుకుని చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పొరుగింటి చినఅప్పారావు చిన్నకొడుకు రాముని పుల్లారుబుడ్డిగా కూర్చోబెట్టాలి అనుకున్నారు. ఆ విషయాన్ని చినఅప్పారావు దంపతులకు తెలియచేశారు. తన కొడుకు పుల్లారుబుడ్డి అవుతున్నందుకు ఎంతో ఆనందించారు చినఅప్పారావు దంపతులు. ఆ విషయం తెలిసిన రాము స్నేహితులు ‘పుల్లారుబుడ్డి, పుల్లారుబుడ్డి’ అని ఎగతాళి చెయ్యడం మొదలు పెట్టారు. అది విన్న చినఅప్పారావు రాము స్నేహితులనందరినీ పిలిచి “మీకు పుల్లారుబుడ్డి అంటే తెలుసా” అని అడిగాడు.
“మాకు తెలియదు” అన్నారు పిల్లలు.
“అయితే రేపు ఉదయం ఇక్కడి రండి మీకు తెలుస్తుంది” అన్నాడు.
“సరే” నని వెళ్ళిపోయారు.
పుల్లారుబుడ్డి అంటే ఏమిటో తెలుసుకోవాలని మర్నాడు ఉదయాన్నే రాముదగ్గరికి వచ్చారు స్నేహితులంతా.
పెద్దఅప్పారావు ఇల్లు బంధువులతో కళకళ లాడుతూ ఉంది. మంగళ వాయిద్యాల నడుమ
పెద్దఅప్పారావు దంపతులు, ముత్తైదువలు కలసి ముహూర్తపు రాట వేశారు.
చావడిలో తూర్పు ముఖంగా కుర్చీలు వేసి పెళ్లి కొడుకుని, రాముని కూర్చోబెట్టారు. ఒక వైపు పేరంటాళ్ళు పెళ్ళికొడుకు ఈశ్వర్రావుని మరొక వైపు రాముని ముస్తాబు చేసారు. ఇద్దరికీ కళ్యాణ తిలకం దిద్దారు. కాళ్ళకు పారాణి రాశారు. బుగ్గను చుక్క పెట్టారు. మెడలో కర్పూరపు దండలు వేశారు. పన్నీరు బుడ్డితో పన్నీరు చల్లారు, అత్తరు రాశారు. ఇల్లంతా అత్తరు సువాసనతో ఘుమ ఘుమ లాడింది. ఇద్దరికీ హారతి ఇచ్చారు. పెళ్లి కొడుకు, రాము పెద్దవారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఇదంతా రాము స్నేహితులు వింతగా చూస్తు కూర్చున్నారు.
“రాముని కూడా పెళ్ళికొడుకులా ముస్తాబు చేశారు ఎందుకో” అన్నాడు ఓ స్నేహితుడు.
చినఅప్పారావు రాము స్నేహితులందరినీ పిలిచి “పుల్లారుబుడ్డి అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమయ్యిందా?” అని అడిగాడు.
ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నారు.
“పెళ్లికొడుక్కి తోడుగా పెళ్లికాని అబ్బాయిని, పెళ్లికూతురికి తోడుగా పెళ్లికాని అమ్మాయిని కూర్చోబెడతారు. తోడుగా ఉండే వారు కాబట్టి తోడపెళ్ళికొడుకు, తోడపెళ్లికూతురు అనేవారు. రాను రాను ఆ పదాలు తోటపెళ్ళికొడుకు, తోటపెళ్ళికూతురుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో వీరినే పుల్లారుబుడ్డి అని పిలుస్తున్నారు.
పెళ్లి అయిన తరువాత అత్తారింటికి
పెళ్ళికూతురితో పాటు తోడుగా ఒక జంటని పంపిస్తారు. వీరిని కూడా పుల్లారు బుడ్డి అని, పుల్లింత అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. పుల్లారు బుడ్డి అని ఎందుకు అంటారో దాని అర్థమేమిటో నాకూ తెలియదు.”అన్నాడు చినఅప్పారావు.
“ఇప్పుడు అర్థమైంది.” అన్నారు రాము స్నేహితులు.
(ప్రజాశక్తి చిన్నారి లో 24-9-2024 న ప్రచురితమైంది.)
