నేరమైనా మంచిదే
నేరమైనా మంచిదే


శ్రీశైలం అడవుల్లో మహాబలి అనే సింహం ఉండేది. మహాబలి పేరుకు తగ్గట్టుగానే అడవిలో ఉన్న జంతువులు అన్నింటికన్నా బలమైనదిగా ఉండేది.చివరకు తనతోటి జాతి సింహాలు కూడా తన బలంముందు బలాదూర్ అన్నట్లుగా ఉండేది ఆసింహం. మహాబలి తన బలం బలగం చూసుకొని అడవిలో ఎన్నో అరాచకాలు సృష్టించేది, సాదు జంతువులను హింసించేది. ఆకలి లేకపోయినా వేటపేరుతో మారణహోమం సృష్టించేది. తాను తినగా మిగిలింది. తనకు నిత్యం పొగుడుతుండే నక్కలకు కుక్కలకు ఇష్టానుసారంగా తినమని విందు విసురుతుండేది.కాకులకు గ్రద్దలకు మాంసం రుచి చూపించి, అడవిలో ఏ జంతువు పసికూనలు కనిపించినా తినేయమని ఉచిత సలహా ఇస్తుండేది. ఆసింహం అనుచరగణం చేసే ఆగడాలు భరించలేక ఎన్నో జంతువులు అడవి విడిచి పారిపోయాయి.కొన్ని జంతువులు ఆత్మహత్య చేసుకున్నాయి, మరికొన్ని ఆ సింహం నీడకే చేరి దానికి కట్టుబానిసలుగా ఉండేవి. ఆ సింహం ఒక శివంగిని చూసుకొని పెళ్లిచేసుకుంది. ఆ శివంగి మనసు మంచిది." మనం క్రూరమృగాలమైనా నీతి నియమాలను వదల కూడదు " అని భర్త మహాబలికి మంచిని చెప్పేది అయినా మహాబలి కడకు భార్యమాటకూడా వినేదికాదు. ఆ శివంగికి సింహానికి ఒక పిల్ల పుట్టింది, దానికి మహారధి అని పేరు పెట్టారు, మహారధిని కూడా తినేయడానికి కాకులూ గ్రద్దలూ ప్రయత్నించేవి,అయినా శివంగి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునేది."అమ్మా మనం బలమైన సింహం జాతికి చెందిన వారం పైగా నాన్న మహాబలి అయినా నన్ను చంపడానికి కాకులూ గ్రద్దలూ ఎందుకమ్మా కుట్ర చేస్తున్నాయి" అని మహారధి తల్లిని అడిగితే, "కాకులకు గ్రద్దలకు ఆ దుర్మార్గపు అలవాటుని మీ నాన్నే నేర్పాడు, వాటి చెడు అలవాటు చివరకు మహాబలి కొడుకునీ వదలని దుస్థితికి వచ్చింది"అని చెబుతూ "నువ్వు నీ తండ్రిలా కాకుండా జాతి పౌరషానికి భంగం కలగకుండా మృగరాజువై వర్ధిల్లు కానీ నీతి నియమాలుతో అడవిని, అడవులోని జీవులను కాపాడుతూ మంచి పేరు సంపాదించుకో " అని మంచి విషయాలు చెప్పి కొడుకుని నీతిగా పెంచిపెద్దచేసింది, ఒక రోజు ఒక ముసలి ఆవు ప్రాణాలను మహాబలి తీయబోతుండగా, అడ్డుపడి తీవ్రంగా గాయపడి మహాబలి భార్య శివంగి మరణించింది, ఆసమయంలో ముసలి ఆవుకూడా చనిపోతూ "నీ ముసలి తనంలో కుక్క చావు చస్తావు" అని శపించింది. కొన్నాళ్లకు అడవికి మృగరాజుగా మహారధి అయ్యింది , తనకి వన సుందరం అనే అందమైన శివంగితో వివాహమయ్యింది వాటికి వీర మహావీర అనే రెండు కవల కూనలు ఉండేవి. తండ్రి కాబట్టి కాస్తా తిండిపడేసి ఒక గుహలో గృహ నిర్బంధం చేసింది మహారధి, తండ్రిని చంపడం మహా పాపమని.
మహాబలి అర్ధాకలితో నకనకలాడుతూ...గుహలో ఒంటరిగా దిక్కుమాలిన జీవనం గడిపేది. ఒకసారి చుట్టం చూపుగా మహాబలిని చూసిపోదామని కొన్ని నక్కలు కుక్కలు గాహకి వచ్చాయి. "మిత్రులారా నాకు మంచి జాతి జంతువుల మాంసం తినాలని ఉంది, ఏ జంతువూ దొరకకపోతే నా కొడుకు కోడలు మనవళ్లునైనా చంపి వాటి మాంసంతో నాకు విందు ఇవ్వండి" అని అత్యంత హేయమైన కోరిక కోరింది. కుక్కలకు నక్కలకు కోపం వచ్చింది, "కన్న బిడ్డలను కూడా కబళించబోయే నీలాంటి నీచజీవి ఈ భూమిపై ఉండకూడదు నీకు చింత చచ్చినా పులుపు చావలేదు" అంటూ మూకుమ్మడిగా దాడి చేసి మహాబలిని హింసించి హించించి చంపేసాయి. హత్యానేరం ఒప్పుకొని మృగరాజు మహారధి ముందు లొంగిపోయాయి, విషయం మృగరాజు మహారధికి తెలిసింది తండ్రి చావుకి చింతించి, పాపాత్ములకు చివరి గతి అంతే అనుకుంటూ... నక్కలు కుక్కలును క్షమించి "మీరు చేసింది నేరమైనా... మంచిదే" అని ఇక అడవిలోమంచికోసం అందరమూ ప్రయత్నం చేద్దాం, అని నూతన శకానికి నాంది పలికింది.
అజాద్ (కలం పేరు)