M.V. SWAMY

Children Stories

4.5  

M.V. SWAMY

Children Stories

కుక్క విశ్వాసం...

కుక్క విశ్వాసం...

2 mins
819


 


ఒక ఊరు పొలిమేరలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుమీద చాలా పక్షులు ఉండేవి. చెట్టు క్రింద ఒక కుంటి కుక్క ఉండేది.చెట్టు మీద పక్షులు ఆహారం తింటున్నప్పుడు క్రింద పడిపోయిన ఆహారాన్ని ఏరుకొని తిని బ్రతుకుటుండేది ఆ కుక్క. ఆ కుక్కని చాలా పక్షులు హేళన చేస్తుండేవి, కొన్ని పక్షులైతే దాన్ని ఆటపట్టించడానికి దాని నెత్తిమీద తన్నుతూ గోళ్ళతో రక్కుతుండేవి. కుక్క పక్షులు పెట్టిన హింసను భరిస్తూ అక్కడే ఉండేది, ఎందుకంటే తాను ఊర్లోకి నడిచి వెళ్ళలేదు, ఒక వేళ ఊర్లోకి వెళ్లినా తోటి కుక్కలతో పోటీ పడి ఆహారాన్ని సంపాదించుకోలేదు, అందుకే కష్టమైనా ఆ చెట్టు క్రిందే ఉండేది ఆ కుక్క. కుక్క రాత్రిళ్ళు అదే పనిగా అరవడం, ఎవరితోనో గొడవ పడటం,పక్షుల నిద్రను పాడు చేస్తుండటం పక్షులకు చిరాకు, కోపం, విసుగు తెప్పించేవి, అందుకే ఉదయం అవ్వగానే కుక్కను తమ ఇష్టానుసారంగా తన్ని గాయపర్చి, చెట్టు క్రింద నుండి దూరంగా తరిమేయడానికి ప్రయత్నం చేసేవి పక్షులు.పక్షులు పెట్టిన హింసను మౌనంగా రోదిస్తూ భరించేది కుక్క, పక్షులు కోపం తగ్గేవరకూ చెట్టుకి కొంత దూరం వరకూ వెళ్లిపోయి పక్షులు ఆహార వేటకు వెళ్ళిపోయాక మళ్లీ చెట్టు వద్దకే చేరేది కుక్క.


        ఒకరోజు పగటిపూటే పక్షి పిల్లలు భయంతో గగ్గోలు పెడుతుండగా ఆహార వేటకు వెళ్లిపోయిన పక్షులు ఆందోళనతో చెట్టు మీదకు చేరిపోయాయి. అప్పుడు చెట్టు క్రింద కొన్ని పాములకి కుక్కకి మధ్య జరుగుతున్న భీకర పోరాటం చూసి పక్షులు ఆశ్చర్యపోయాయి.పాములు చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కుక్క వాటిని చెట్టు ఎక్కనివ్వకుండా తీవ్రంగా అడ్డుకుంటుంది, పాములు కుక్కకు కాట్లు వేస్తున్నాయి, కుక్క శరీరమంతా గాయాలయ్యాయి, అయినా కుక్క పోరాటం ఆగలేదు. ఆశ్చర్యం నుండి తేరుకున్న పక్షులు మూకమ్మడిగా దాడికి దిగి పాముల్ని భయపెట్టి మర్రి చెట్టుకి దూరంగా వాటిని తరిమికొట్టాయి, అనుభవం ఉన్న పక్షులు ఆకు పసర్లు తెచ్చి కుక్క గాయాల మీద పసర్లు పూసాయి, కొన్ని పక్షులు పండ్లు, దుంపలు తెచ్చి కుక్కకి ఆహారంగా పెట్టాయి, కొన్ని పక్షులు నోటితో నీరు తెచ్చి కుక్క నోటిలో పోశాయి.పోరాట ఆయాసం నుండి కుక్క తేరుకున్నాక "పాముల కథ ఏమిటి? ఎందుకొచ్చాయి? వాటికీ నీకు గొడవ ఎందుకు?" అని ఆడిగాయి పక్షులు కుక్కని. అప్పుడు నోరువిప్పి నిజం చెప్పింది కుక్క, ప్రతిరోజూ రాత్రి పూట ఒక పాము చెట్టు ఎక్కి పక్షుల పిల్లల్ని, గుడ్లను తినడానికి ప్రయత్నం చేస్తుండేదని, దాన్ని అడ్డుకొని బెదిరించడానికే రాత్రిళ్ళు తాను నిద్ర మాని అరుస్తూ కోర్చోవలసి వస్తుందని, రాత్రుళ్ళు నిద్ర లేకపోవడంతో పగటిపూట నిద్ర పోతుండేదానినని, అయితే అది గమనించి ఆ పాము మరికొన్ని పాముల్ని తోడు తెచ్చుకొని పగటిపూటే చెట్టు ఎక్కి పక్షి పిల్లలని, గుడ్లను తినడానికి బరితెగించిందని, వాటి జాడ పసిగట్టి తాను పాములతో పోరాడవలసి వచ్చిందని చెప్పింది.ఇంతవరకూ కుక్క విశ్వసనీయతను తెలుసుకోలేక దాన్ని అవమానపరిచి పెద్ద తప్పు చేశామని పక్షులు మదనపడ్డాయి. అప్పటినుండి కుక్కను ప్రాణమిత్రుడుగా అభిమానిస్తూ దాని ఆహారానికి భద్రతకు లోటులేకుండా చూసుకుంటూ తమ కృతజ్ఞతను చూపుకున్నాయి పక్షులు.







Rate this content
Log in