Dinakar Reddy

Children Stories Comedy Children

4  

Dinakar Reddy

Children Stories Comedy Children

క్షుర కర్మ - ఒక ప్రహసనం

క్షుర కర్మ - ఒక ప్రహసనం

2 mins
531


ఏవండోయ్! ఇవాళ ఆదివారం. మన చింటూని సెలూన్ షాపుకి తీసుకెళ్లాలి అని మా ఆవిడ కేక వేసింది. ఆదివారం కదా ఇంకా కాసేపు నిద్రపోదాం అనుకున్న నేను కప్పుకున్న బెడ్ షీట్ తీసి పక్కన పడేసి పక్కనే పడుకున్న నా మూడేళ్ల పుత్ర రత్నాన్ని నిద్ర లేపాను. వాడు నిద్రలో ఉండగానే నేను తయారయి ఇక లాభం లేదని భుజంపై మా వాణ్ణి పడుకోబెట్టుకొని వీధి చివర్లో ఉన్న సెలూన్ షాపుకు వెళ్ళాను.

ఆదివారం సెలూన్ షాపులు సందడిగానే ఉంటాయి కదా.

ముందుగానే సెలూన్ అబ్బాయికి చెప్పి ఉంచాను కాబట్టి రాగానే మా వాణ్ణి సీట్లో కూర్చోబెట్టుకున్నాడు.

జుట్టు మీద నీళ్లు చల్లి తడి చేయగానే మా వాడు నిద్ర నుండి లేచి తననెవరో కిడ్నాప్ చేశారన్నట్టు ఏడుపు మొదలు పెట్టాడు.


కత్తెర వాడి తల చేరనీయడం లేదు. కత్తెర చూసిన ప్రతి సారీ దాన్ని పట్టుకుని ఆపేస్తున్ననాడు.

సెలూన్ అబ్బాయి నన్నే సీట్లో కూర్చోమని చెప్పడంతో నేను సీట్లో కూర్చుని చింటూని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాను. చింటూ గాడి చేతులు నా చేతుల్లో పట్టుకుని బుద్ధిగా అద్దంలో చూస్తూ కూర్చోమని చెప్పాను.


అసలు వాడికి పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు కూడా ఇదే తంతు. ఏదో వాళ్ళ మావయ్య అవస్థ పడి అయిందనిపించాడు.


కత్తెర చూడగానే మా వాడు ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. వాడి ఏడుపుకు పక్కన బుద్ధిగా కూర్చుని కటింగ్ చేయించుకుంటున్న ఇద్దరు పిల్లలు కూడా ఏడుపు మొదలు పెట్టారు.


సెలూన్ అబ్బాయి భయపడిపోయి చూడు బాబూ నాన్న చూడు ఎంత బుద్ధిగా చేయించుకుంటున్నారో అని మావాడి దృష్టి మళ్ళించడానికి నా జుట్టు పైన కత్తెర ఉంచి కాస్త కత్తిరించాడు.


మొదట కాస్త కోపం వచ్చినా సెలూన్ అబ్బాయి సమయ స్ఫూర్తికి మెచ్చుకుని మెదలకుండా ఉండిపోయాను.


అదేదో పాపులర్ స్టైల్ అని చెప్పి మా ఇద్దరికీ ఒకే రకంగా హెయిర్ కట్ చేసి పడేశాడు. నేను చేయించుకోవడం చూసి చింటూ గాడు మెదలకుండా కూర్చున్నాడు. 


సూపర్ హీరో హెయిర్ స్టైల్ బాగా నప్పింది అని సెలూన్ వాడు చింటూ గాడికి చక్కిలిగింతలు పెట్టాడు. నాకు నా హెయిర్ స్టైల్ చూసి అసలు నేనెందుకు సెలూన్ షాపుకు వచ్చాన్రా బాబూ అనిపించింది.


ఇంటికి చేరాక నన్ను చూసి మా ఆవిడ ఒకటే నవ్వు. అయినా ఇదేం కటింగ్ అండీ అని. 


మరుసటి రోజు ఆఫీసులో నాన్నలన్నాక పిల్లల కోసం ఆ మాత్రం స్టైల్ గా ఉండాలి అని ఏదో కవర్ చేశాను.



Rate this content
Log in