Meegada Veera bhadra swamy

Children Stories

3  

Meegada Veera bhadra swamy

Children Stories

కప్ప మహా గొప్ప

కప్ప మహా గొప్ప

3 mins
425 


ఒక చెరువులో మహాగొప్ప అనే ఒక కప్ప ఉండేది.ఆ కప్ప పేరుకే గొప్పకాదు గొప్పలు చెప్పుకోవడంలోనూ మహాగొప్పే.నాలుగు కప్పల్ని పోగేసుకొని తనగొప్పల డప్పుకొట్టుకుంటూ గంటలకొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండేది."ఈచెరువు తవ్వకముందే నేను ఊరువారికి సలహాఇచ్చి పంటపొలాలకు సాగునీరు,ఇంటిఅవసరాలకు త్రాగునీరు కావాలనుకుంటే విరివిగా చెరువులు తవ్వించాలి,వర్షాలు పడక కరువువస్తే కప్పలకు పెళ్లిళ్లు చెయ్యాలి,అప్పుడే వర్షాలుపడతాయి అని నేనే చెప్పాను అందుకే ఊరువారు చెరువులు తవ్వించారు,ప్రతిఏటా కప్పల పండగ చేస్తున్నారు"అని లేనిపోని అబద్దాలు చెబుతూ కార్టూన్ హావభావాలతో తన చుట్టూ ఉన్న కప్పలకు కామెడీ పండించి ఇచ్చేది."దీని గొప్పలు వినీవినీ మనకీ అలవాటైపోయింది,కాసేపు కాలక్షేపంకోసం,కామెడీకోసం రోజుకి ఒకసారైనా దీని చుట్టూ చేరకతప్పదు" అని అనుకుంటూ ఆ కప్ప గొప్పలకి డప్పుకొడుతూ నోటితోనవ్వి నొసలుచిట్లించేవి కొన్ని కప్పలు.


 "పచ్చి బాలింతలు పిల్లల బారసాలరోజు చెరువు రేవుకొచ్చి మండోదరీమాత పూజలు చేసి కప్పలకు ఆహారంపెట్టి దండంపెడితే పిల్లలకి,తల్లికి మంచి జరుగుతుందన్న ఆచారాన్ని ప్రజలకు నేనే నేర్పాను,నా వల్లే మన జాతికి ఆహారం, గౌరవం వస్తుంది"అని నవ్వు తెప్పించే గొప్పలు చెబుతుండేది."అసలు రావణుడి భార్య మండోదరిమాత వంశంమాది,మొదట మనుషులు లాగే వుండేవారం, కలియుగంలో మనుషులు మాయలు చూడలేక ఇలా కప్పల్లా మరిపోయాం"అని నమ్మశక్యం కాని ఫాంటషీ కథలు చెబుతుండేది."ఇష్ దీని గొప్పలు

భరించలేకపోతున్నాం ఈగొప్పల కప్ప వల్ల మన జాతికి ఎప్పటికైనా ముప్పు తప్పదని అనుకుంటున్నాము" అని తోటికప్పలు గుసగుసలాడుకునేవి.తెలివైన కప్పలు "చెరువు పుట్టకముందు నువ్వు పుట్టావా!మండోదరి మీ వంశం అనడానికి ఆధారాలేవి"అని అడిగితే,"లాజిక్ లాగకుండా నామేజిక్ చూడండి"అనేది మహాగొప్ప.

ఒకరోజు ఒక నీటిపాము ఆచెరువులోకి వచ్చింది. ఆ నీటిపాము ఒకకప్పపిల్లని నోటకరుచుకొని పట్టుకుపోతున్న సమయంలో మిగతాకప్పలు భయపడి కకావికలం అయిపోయాయి,కప్ప మహాగొప్ప మిగతా కప్పలు గమనించకుండా"మిత్రమా దయచేసి ఆకప్ప పిల్లను వదిలిపెట్టు ఈ మద్యనే దాని తలిదండ్రులు చనిపోయి బాధలోఉంది ,దాన్నిచంపి ఆకుటుంబానికి అన్యాయం చెయ్యకు "అని బ్రతిమిలాడింది.ఆ నీటి పాము ఆ కప్ప పిల్లను వదిలిపోతుండగా కప్ప దాని వెంట వెళ్లి చెరువు వడ్డుకు వెళ్లిన తరువాత ఆ పాముకి వీడ్కోలు పలికింది. చెరువులోని కప్పలు నోరెళ్లబెట్టి "ఏమి జరిగింది?" అని అడగగా ఆ నీటిపాముని తరిమితరిమి కొట్టి మన కప్ప పిల్లని కాపాడాను, ఇక దాని జీవితంలో ఆ నీటిపాము ఈ చెరువులోకిరాదు"అని గొప్పలు చెప్పింది కప్ప మహాగొప్ప.చాలా కప్పలు దాని మాటలు నమ్మలేదు, ఏదోమాయచేసి ఆ నీటిపాముని పంపిఉంటుంది అనుకుంటే,మరికొన్ని కప్పలు దాని గొప్పలకి ఆట పట్టించాలనుకొని ,"మహాబలీ! తమరు తలచుకుంటే ఈ చుట్టుపక్కలకి పాములు రావు మీరు ఘీంకరించి అరిస్తే పాములు గుండాగి చచ్చిపోతాయి" అని రెచ్చగొట్టాయి.

"అమ్మో చిన్న నీటిపాముని చూసేసరికే నాకు గుండెల్లో వణుకుపుడుతుంది అలాంటిది పాములను సవాలు చేసి అరిస్తే నేను ఏ నాగుపాముకో గుటకాయస్వాహా అయిపోతాను"అని లోలోపల అనుకుంటూ పైకి గంభీరంగా లేకపోతే చెరువు కప్పలముందు చులకనైపోతానని,"మీరు లెస్స పలికితిరి,తక్షణమే చెరువులోని కప్పలను ఒడ్డుకు రమ్మనండి చిరకాల మన శత్రువులకు నా హెచ్చిరికలను కళ్లారా చూడమనండి"అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికింది కప్ప మహాగొప్ప.


  కొన్ని కప్పలూ ఒడ్డుకు చేరాయి,కొన్ని కప్పలు ఎందుకైనా మంచిదని నీటిలోనే ఉండి తలలు పైకెత్తి కప్ప మహాగొప్ప విన్యాసాలు చూడటం మొదలుపెట్టాయి.కప్ప మహాగొప్ప చెరువుఒడ్డున ఉన్న ఒక మట్టిదిబ్బపై నిలబడి గట్టిగా అరుస్తూ"ప్రాణాలు మీద ఆశ ఉన్న పాములు పారిపోండి లేదంటే నా పంజా దెబ్బకి మీకు చావు తప్పదు"అని బిక్కు బిక్కు చూపులతో చక్కగా ఘీంకరించింది.కప్పలు బెకబెక లాడుతూ చెప్పట్లు కొట్టాయి, అంతే ఎక్కడలేని పాములూ అక్కడకే వచ్చి కప్పల మీద విరుచుకుపడ్డాయి,దొరికిన కప్పల్ని దొరికినట్టే నోటకరుచుకున్నాయి,కప్ప మహాగొప్ప ఒక్కవుదుటన చెరువులోకి దూకేసి చెరువు అడుక్కి పోయి ప్రాణ భయంతో దాక్కుంది, పాములనుండి తప్పించుకున్న కప్పలు చెరువులోకిపోయి నిశ్శబ్దం అయిపోయాయి.వారం పదిరోజులు పాములు చెరువు ఒడ్డునే సంచరించగా ఒక్కటంటే ఒక్క కప్ప కూడా కాసేపు ఆట విడుపుకైనా ఒడ్డుకి రాలేక నీటిలోనే ఏ క్షణాన ఏ ఉపద్రవం వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కు బ్రతుకులు బ్రతికాయి.కప్ప మహాగొప్ప తోటికప్పలకు ముఖం చూపించలేక చెరువు అడుక్కి అంటుకొని ఉండిపోయింది.కప్పల దుస్థితి చూసి చెరువులోని చేపలు ఇతర జలచరాలూ 'నీతిమణి' అనే తాబేలును బ్రతిమిలాడి ఆసమస్యను పరిష్కరించాలని కోరాయి.


తాబేలు మహామణి కప్ప మహాగొప్పని తన వీపుపై కూర్చోబెట్టుకొని,చెరువు ఒడ్ఫుకు చేరి పాముల సమావేశం ఏర్పాటు చేసి"మిత్రులారా మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించరాదు, ఆకలి సమయంలో తప్ప వేట చేయరాదు, మీరు కప్పలు కోసం కుప్పలు తెప్పలుగా

ఇక్కడకు వస్తే మిమ్మల్ని తినడానికి కాకులూ గ్రద్దలూ, రాబందులూ,డేగలూ ఇతర పక్షులు వస్తాయి,ఆ పక్షుల గుత్తగుంపులను వేటాడేందుకు నక్కలు, కుక్కలు, చిరుతలు, సింహాలు వంటివి రావచ్చు వాటిని తరమడానికి లేదా చంపడానికి మనుషులు వేటగాళ్లగా వస్తారు.ఎటొచ్చి అప్పుడు నష్ట పోయేది మూగజీవులే,లబ్ది పొందేది వేటగాళ్లే ఇక మీ ఇష్టం,ఇదిగో మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టిన కప్ప మహాగొప్ప మీకు క్షమాపణ చెబుతుంది,ఈ కప్ప తప్ప మిగతా కప్పల తప్పులేదు దయచేసి మీరు ఇక్కడ నుండి తప్పుకోండి"అని పాములకు కప్ప మహాగొప్ప చేత క్షమాపణ చెప్పించి,పాములకు వెళ్లిపోవలసిందిగా నచ్చజెప్పింది,ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించరాదన్న తాబేలు మహామణి మాటను గౌరవించి అక్కడ నుండి వెళ్లిపోయాయి.గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోవద్దని కప్ప మహాగొప్పకి మందలించి,ఆటపట్టించడానికైనా మహాగొప్పకి రెచ్చగొట్టకండని ఆకతాయి కప్పలకు హెచ్చిరించింది.మహాగొప్పతో సహా అన్ని కప్పలూ కిక్కుమనకుండా చెరువులోకి చేరి వాటి హద్దుల్లో అవివుండటం అలవర్చుకున్నాయి.

******************************************


                              


              
                       


Rate this content
Log in