కాళ్ళు నీవి కాకుంటే కాశీ దాక నడవమంటావు
కాళ్ళు నీవి కాకుంటే కాశీ దాక నడవమంటావు
కాళ్ళు నీవి కాకపోతే కాశీ దాకా నడవమంటావు
*******************************************
అగ్రహారం వీధిలో సత్తిబాబు అనే ఆసామి ఉండేవాడు. అతడు అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడు.
అదే వీధిలో అప్పడు, అప్పయ్యమ్మ దంపతులు నివసిస్తూ ఉండేవారు. అప్పడు అమాయకుడు, అప్పయ్యమ్మ గడసరి. అప్పడుకి సత్తిబాబు సలహాల మీద గురి.
సత్తిబాబు దగ్గరికి దూరపు బంధువు ఒకరు వచ్చి “మా ఊళ్ళో రాములవారి గుడి కడుతున్నారు, దానికి మీ వంతు విరాళం ఇస్తారని మీ దగ్గరకు వచ్చాను.” అని చెప్పాడు.
“సరే చూద్దాం. నిర్మాణం పూర్తి అయ్యేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి రెండు నెలల తర్వాత కనిపించండి.” అని చెప్తూ “మీ ఊరి గుడికి మీరెంత ఇస్తున్నారు?” అని ఎదురు ప్రశ్న వేశాడు సత్తిబాబు.
“నా శక్తి మేరకు ఒక రెండువేలు ఇవ్వాలని అనుకుంటున్నాను” అన్నాడు బంధువు.
“అయ్యా! దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు.
పుణ్యం పురుషార్థం వస్తాయి. నలుగురూ మీ పేరు చెప్పుకుంటారు, ఒక లక్షో రెండు లక్షలో ఇవ్వండి తప్పులేదు.” అని ఉచిత సలహా ఇచ్చాడు సత్తిబాబు.
“మారాజు తో చెప్తే మర్రెండు అన్నట్లు నువ్వు చేసే సాయం, దానం, ధర్మం ఏదీ ఉండదు. కాళ్ళు నీవి కాకపోతే కాశీ దాకా వెళ్ళమంటావు. నీ చేతి సొమ్ము కాదు కదా! ఎంతైనా ఇమ్మనమని చెప్తావు.” అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ బంధువు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన అప్పడు, అతని భార్య అప్పయ్యమ్మ “మేము కాశీ వెళ్ళాలనుకుంటున్నాము, ఎలా వెళ్ళమంటావు?” అని సత్తిబాబును సలహా అడిగారు.
“ఓస్! అంతేకదా మూట ముల్లె సర్దుకుని నడుచుకుంటూ వెళ్తే కాశీ వస్తుంది.” అని సలహా ఇచ్చాడు సత్తిబాబు.
అప్పటికి ‘సరేనని’ ఇంటికి చేరుకున్నారు ఆ దంపతులు.
“ఏమయ్యా! చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికి వివేకం ఉండాలి కదా! ఆయన కాళ్ళు కావు కాబట్టి కాశీ దాకా నడిచి వెళ్ళమంటాడు, ఎదుటి వాళ్ళని దానధర్మాలు చెయ్యమంటాడు. నేను నడిచి రాలేను.” అని తెగేసి చెప్పింది ఇల్లాలు.
మన సమాజం లో ఇలాంటి వ్యక్తులు చాలామంది తారసపడుతూ ఉంటారు. పెద్దవారి దగ్గర అధికారుల దగ్గర చెడ్డ అవకుండా ‘పళ్ళమధ్య నాలుక’ లా అత్యంత చాకచక్యంగా నడుచుకుంటారు.
వీరు ఇతరులకు సలహాలు ఇవ్వడమే కానీ ఏ పనీ చెయ్యరు. అలాంటి వ్యక్తులు ఇచ్చే సలహా విషయంలో “కాళ్ళు నీవి కాకపోతే కాశీ దాకా నడవ మంటావు” అనే సామెతను వాడుక లోకి వచ్చింది. అలాంటి వాళ్ళు ఇచ్చే సలహాలని మనం కాస్త వివేకం తో ఆలోచించి పాటించాలి. ఆచి తూచి వ్యవహరించాలి.
(షార్ వాణి అంతర్జాల మాసపత్రిక జూలై 2024 సంచికలో ప్రచురితం అయ్యింది)
