ఇంటి గుట్టు లంకకు చేటు
ఇంటి గుట్టు లంకకు చేటు


ఇంటిగుట్టు లంకకు చేటు ( నీతికథ)
ఒకరోజు చిలుకలన్నీ కలిసి శంపంగి తోటకు షికారు వెళ్లాయి. తోటలో ఉడతలు, తొండలు ఎక్కువుగా ఉన్నాయి. అందమైన సువాసనల శంపంగి తోటలో తొండలు ఉడతలు ఉండటం చిలుకలకి ఈర్ష్య కలిగింది. ఎలాగైనా... తొండల్ని ఉడతల్ని తోటనుండి బయటకు పంపి తోటను తమ అధీనంలోకి తీసుకోవాలని చిలుకలు అనుకున్నాయి.తోటలో ఉన్న ఒక బల్లిని పిలిచి, శంపంగి తోటలో మా లాంటి రామ చిలుకలో, సీతాకోకచిలుకలో,కనీసం గోరింకలో, తుమ్మెదలో, చివరకు పిచ్చుకలో,పావురాలో, గువ్వలో ఉండాలి గానీ...చెండాలంగా తొండలు వుండటమేంటి! ఇక ఉడతలూ అంతే కాయలు, పండ్లు కొరికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి అసహ్యంగా" అని హేళనగా మాట్లాడుకున్నాయి.బల్లికి రామచిలుకల జాతి అహంకారం అర్ధమయ్యింది కానీ... తోటలో ఉడతలు, తొండలు ఆధిపత్యం తగ్గించాలని ఎప్పటినించో అనుకుంటున్న వాటి బల్లుల లక్ష్యం నెరవేరబోతుంది, చిలుకలు సాయంతో ఉడతల్ని, తొండల్ని తోట బయటకు పంపించేసి, చిలుకల్ని మచ్చిక చేసుకొని తోటలో బల్లుల జాతి తిష్టవేసి బల్లుల జాతి ప్రాబల్యం పెంచుకోవాలని ఆలోచించింది బల్లి. వెంటనే "రామ చిలుకలారా! ఏమని చెప్పమంటారు మా బాధలు, తొండలు, ఉడతలు తోటను నాశనం చేస్తున్నాయి, మీరే ఉపాయంతో వాటిని బయటకు పంపేయండి" అని అంది చేతులు కట్టుకుంటూ..."తోటను అక్రమించుకోవాలనుకుంటే తోటలోని స్థానిక జీవుల మద్య తగువు పెట్టి, వాటిని విడదీసి, ఐక్యత లేకుండా చేసి, కుయుక్తితో విజయం సాధించాలి" ఆముకుంటూ... చిలుకలు బల్లిని మచ్చిక చేసుకొని, "అసలు వాటి గుట్టు చెప్పు అవి ఎలా పోతాయి తోటనుండి బయటకు" అని ఆడిగాయి," ఉడతలకి భయం, పిరికితనం ఎక్కువ, తొండలకు మూర్ఖత్వం, మొండితనం ఎక్కువ, తెలివి తక్కువ, ఇక మీ ఇష్టం వాటి బలహీనతలు చెప్పాను, మీ మేధావితనం ప్రయోగించి వాటి పని పట్టండి, మీరు నేరుగా యుద్ధం చేస్తే తొండలు మీ తాట తీసి మిమ్మల్ని తరిమేస్థాయి, వాటికి ఉడత సాయం కలిస్తే...వాటిని మీ తాత ముత్తాతలు కూడా జయించలేరు" అని ఇంటి గుట్టు అందించింది బల్లి రామ చిలుకలకి. "అయితే మేము చెప్పినట్లు నువ్వు పుకార్లు పెట్టు" అని చిలుకలు బల్లిని కోరాయి, బల్లి తన జాతిలో మిత్రులకు చిలుకలు సాయంతో మన ఆధిపత్యం పెరుగుతాది,, అని తన ప్లాన్ వివరించింది, "మొన్నామధ్య ముసలి మాష్టారు ఇంట్లో కథలు విన్నాను, ఇంగ్లీషు వాళ్ళు భారతీయుల మద్య ఐక్యత చెడగొట్టి,స్థానికుల్ని విడగొట్టి ఈ దేశాన్ని రెండువందల సంవత్సరాలు పాలించారట.అలాగే ఇక్కడ కూడా జరగబోతుంది, ఉడతల్ని, తొండల్ని, బయటకు పంపేసి చివరికి మనల్నీ కుమ్మేసి, శంపంగి తోటను అక్రమించుకుంటాయి, అందుకే మనలో మనకు విభేదాలు ఉంటే తరువాత తేల్చుకుందాం, ఇప్పుడు తొండల్ని, ఉడతల్ని మోసం చెయ్యవద్దు " అని కుర్ర బల్లులకి హితవు పలికింది. మంచి చెబితే వినసొంపుగా వుండదన్నట్లు, కొన్ని బల్లులు, చిలుకలు కుట్రలకే మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.మయామర్మం తెలియని ఉడతలు, తొండలు రామచిలుకను తోటకి ఆహ్వానించి, అతిధులుగా వుండమన్నాయి, మంచితనం నటించిన చిలుకలు ఒకరోజు రాత్రి పులులు, సింహాలు, కుక్కలు, నక్కలు, ఏనుగులు మాదిరీగా భయంకరంగా అరిచాయి, ఉడతలు భయంతో తోట విడిచి పారిపోయాయి, కొన్ని ఉడతలు, గుండెఆగి చనిపోయాయి.రెండోరోజు తొండలే భయంకర శబ్దాలు చేసి ఉడతలని భయపెట్టి తోటనుండి బయటకు పంపేశాయి అని కొన్ని బల్లులు పుకార్లు పుట్టించగా, నిజమే అని కొన్ని చిలుకలు ఉడతలు చెవుల్లోఅబద్దాన్ని నూరిపోశాయి, ఉడతలకి ,తొండలకి ఘర్షణ మొదలయ్యింది, కొన్ని రోజులు తరువాత చిలుకలు జ్యోస్యం చెబుతున్నట్లు నటించి, ఈ తోటకు ఏదో అరిష్టం పట్టింది, ఉడతలు కొన్ని పారిపోగా, కొన్ని చనిపోయాయి, ఇక తొండలు వంతు తొండలూ చనిపోయే అవకాశం ఉంది... అలాగే ఉడతలు కుట్రతో తొండల్ని చంపుతాయి అని సోది ,జ్యోస్యం చెప్పాయి,నిజమే మేమూ ఉడతలు మంతనాలు విన్నము అని కొన్ని బల్లులు సన్నాయి నొక్కులు నొక్కాయి, మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మే తొండలు ప్రాణభయంతో తోటను వదిలి పారిపోవడం మొదలుపెట్టాయి, కొన్నాళ్ళు పాటు బల్లులకి ఆధిపత్యం ఇచ్చి, ఒకరోజు బల్లులన్నింటినీ ఒక దగ్గర సమావేషపరిచి, గుట్టుగా గ్రద్దలకు, డేగలకు సమాచారం ఇచ్చి, ఏమీ తెలీనట్లు చిలుకలు చిలుక పలుకులు పలుకుతుండగా... గ్రద్దలు, డేగల మందలు వచ్చి దొరికిన బల్లుల్ని గుత్తులుగా ఎత్తుకుపోయాయి, అంతే బల్లులూ ఇక ఇక్కడ బ్రతకలేమని, ఊర్లోకి పోయి గోడలమీద దాచుకున్నాయి, శంపంగి తోట రామ చిలుకల వశమయ్యింది,తోటలో అక్కడక్కడ మిగిలివున్న తొండలు, ఉడతలు, బల్లులు రామచిలుకల అదుపు ఆజ్ఞలలో బానిసలుగా మిగిలిపోయాయి.భరతమాత భారంగా నిట్టూర్చింది తెల్లదొరల నీతి ఈ చిలుకలకి అబ్బిందేమిటబ్బా!!!... అనుకుంటూ...
----- ఎం వి స్వామి