M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

చంటిగాడి గాలిపటం

చంటిగాడి గాలిపటం

2 mins
540


         


    చంటిగాడు ఐదో తరగతి చదువుతున్నాడు. చంటిగాడికి గాలిపటాలు ఎగరేయడమంటే చాలా ఇష్టం. చంటిగాడి గాలి పటాల సరదా ఎంతవరకు వెళ్లిందంటే,ఎక్కడైనా గాలిపటాల పండగ జరుగుతుందని తెలిస్తే చాలు అమ్మా నాన్నలకు చెప్పకుండా బడికి డుమ్మాకొట్టి మరీ గాలిపటాల పండగకు వెళ్లిపోతుండేవాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి దూరంగా ఉన్న మహానగరంలో గాలిపటాల పండుగ జరుగుతుందని తెలిసి ఇంట్లోవారికి, బడిలో వారికి చెప్పకుండానే చేతిలో డబ్బులు లేకపోయినా,"మా అమ్మమ్మ ఆసుపత్రిలో ఉంది అక్కడే అమ్మానాన్న వున్నారు అక్కడికి వెళ్ళాలి" అని ఒక లారీ డ్రైవర్ తో అబద్దమాడి లారీ ఎక్కి మహానగరం వెళ్ళిపోయాడు చంటిగాడు.గాలి పటాలు సంబరాలు జరిగే ప్రాంతానికి ఎలాగోలా చేరుకున్నాడు.


            మహానగరంలో మాయగాళ్ళు ఎక్కువ వుంటారు కాబట్టి, చంటిగాడి వేశభాషలు, అమాయకత్వం కనిపెట్టి,గాలి పటాలు ఆశ చూపి వాడిని కిడ్నాప్ చేసి పాడుబడిన ఒక భవనంలోకి తీసుకొని పోయి,"అమ్మానాన్నల వివరాలు, ఫోన్ నంబర్స్ చెప్పు, నిన్ను మీ ఇంటికి పంపిస్తాము"అని చంటిగాడి దగ్గర వాడి బంధుమిత్రుల వివరాలు తీసుకొని "చంటిగాడు మా ఆధీనంలో వున్నాడు, వాడుకావాలనుకుంటే పది లక్షలు రూపాయలు ఇవ్వండి" అని డిమాండ్ చేయడానికి ప్రయత్నాలు చేసారు.


          తనని కిడ్నాప్ చేసి అమ్మానాన్నలను ఇబ్బంది పెడుతున్నారు దొంగలు అన్న విషయం తెలుసుకున్నాడు చంటిగాడు, ఎలాగైనా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవాలని ఆలోచించి"మా అమ్మానాన్నలు చాలా పేద వాళ్ళు,వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, మా అంకుల్ బాగా డబ్బున్నవాడు అతనికి నేనంటే చాలా ఇష్టం అతనికి నేనే ఫోన్ చేస్తాను, అతని ఫోన్ నెంబర్ నేను చెప్పలేను కానీ మొబైల్లో డైల్ చేస్తుంటే నెంబర్ గుర్తుకొస్తాది, అందుకే నాకు మీ మొబైల్ ఇవ్వండి నేనే మా అంకుల్ కి చెప్పి మీకు డబ్బులు వచ్చేటట్లు చేస్తాను"అని చంటిగాడు చిలుక పలుకులు పలికి కిడ్నాపర్స్ ని ఒప్పించి వాళ్ళ దగ్గర మొబైల్ తీసుకొని 100 కి ఫోన్ చేసి"అంకుల్ నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు మీరొచ్చి పది లక్షలు వీళ్లకు ఇచ్చి నన్ను తీసుకుపోండి ప్లీజ్" అని తనకు తెలిసినంత వరకూ అడ్రస్ చెప్పాడు.పీకలదాకా మద్యం తాగి మత్తులో ఉన్న కిడ్నాపర్స్ అసలు చంటిగాడు ఏ ఫోన్ నెంబర్ కి డైల్ చేసాడో గమనించలేదు.


             పది నిముసాల్లో పోలీసులు వచ్చి కిడ్నాపర్లుని అరెస్ట్ చేశారు. చంటిగాడు నాన్న ఫోన్ నెంబర్ చెప్పగా పోలీసులు అతనికి ఫోన్ చేసి రప్పించి చంటిగాడ్ని అప్పగించారు, చంటిగాడు ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ఏడుస్తుంది, బంధుమిత్రులు అమ్మని ఓదార్చుతున్నారు. ఉదయం నుండి చంటిగాడు కనిపించక అమ్మ బెంగపెట్టుకుందని, చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళు చంటిగాడ్ని వెదకడానికి వెళ్లారని చంటిగాడు తెలుసుకున్నాడు.అమ్మకు సారీ చెప్పి,అమ్మా ఒక కథ విను "ఒక అల్లరి చిల్లరి గాలిపటం సరదా సందడి దారం ఆధారంతో ఎగిరి ఎగిరి పోవాలనుకుంది. మధ్య గాలిలో గ్రద్దలు వచ్చి దారాన్ని తెంపేయాలనుకున్నాయి, అప్పుడు గాలి పటం 100 జపం చెయ్యగా వజ్రాయుధం వచ్చి గ్రద్దలను తరిమేసింది,ముళ్ల కంచెలో పడిపోవలసిన గాలిపటం మళ్లీ 'తెలివి రంగు' గాలిపటమై అమ్మ చెంతకు చేరింది. అప్పటికే గుణపాఠం నేర్చుకున్న గాలిపటం అమ్మా నాన్నల ఆధారాన్ని వదిలి ఏవో దారాలు ఆధారంతో ఎగరనని అమ్మానాన్నలను విడిచిపోనని ప్రతిజ్ఞ చేసింది" అని తెలివిగా తన కథను చెప్పాడు.చంటిగాడి తెలివికి సమయస్ఫూర్తికి, కథ చెప్పే తీరుకి అందరూ మెచ్చుకొని చిన్నగా నవ్వేసారు అమ్మతో సహా....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్