చక్రవర్తి వారసులు
చక్రవర్తి వారసులు
పూర్వం ఒక మొఘలాయీ చక్రవర్తికి అజ్మీర్,కజ్మీర్ అనే కవల కుమారులు వుండేవారు.సువిశాల రాజ్యాన్ని పాలించడానికి తనకు వారసుడుగా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని ఆ చక్రవర్తి, తన ఇద్దరు కుమారుల్లో ఎవరు మంచి పరిపాలనాదక్షుడు కాగలడో తేల్చి చెప్పాలని,ఆ భాధ్యతను తన ఆస్థానంలో చురుకైన తెలివైన నీతి నియమాల్లో, రాజనీతిలో ఆరితేరి సుదీర్ఘ అనుభవం ఉన్న సుభేదార్ కి అప్పగించాడు. అయితే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పిల్లల్ని రాజమందిరాల్లో కాకుండా మీకున్న చిన్న భవంతిలోనే ఉంచి కాబోయే చక్రవర్తులుగా వాళ్లకు సామాన్యుల కష్టసుఖాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించి వాళ్ళల్లో పేద సాదల పట్ల సానుభూతిని పెంచమని ఆదేశించాడు చక్రవర్తి సుభేదార్ కి, చక్రవర్తి అన్నవాడు ఒక్కడే ఉండాలి రెండోవాడు చక్రవర్తికి కుడిభుజంగా వుంటూ పరిపాలనలో చక్రవర్తికి అండదండలు అందించాలి అని సుభేదార్ కి కర్తవ్యం తెలిపాడు చక్రవర్తి.
సుభేదార్ చక్రవర్తి పిల్లలను సొంత కుమారులులా అల్లారు ముద్దుగా పెంచుతుండేవాడు, విద్యాబుద్ధులును ఇద్దరిలో ఏ ఒక్కడిపట్ల వివక్ష లేకుండా నేర్పుతుండేవాడు. ఒకరోజు సుభేదార్ కి సుస్తీ చేసింది మంచం మీద కదలలేని పరిస్థితిలో వున్నాడు అతడు, అజ్మీర్ తాను చక్రవర్తి కొడకునన్న విషయం పక్కన పెట్టి సుభేదార్ కి సేవలు చేసాడు. కజ్మీర్ మాత్రం మనం చక్రవర్తి పిల్లలం మనం ఒక సామాన్య సుభేదార్ కి స్వయంగా సపర్యలు చేస్తే చక్రవర్తిని అవమానపరిచినట్లు, కావాలనుకుంటే సుభేదార్ మన శ్రేయోభిలాషి రాజ్యసభ ఉద్యోగి కాబట్టి ఎంత ధనమైనా ఖర్చుచేసి అతని జబ్బును నయం చేయుంచుదాం, అతనికి సేవలు చెయ్యడానికి నౌకర్లను వినియోగిద్దాం అని అంటుండేవాడు.కజ్మీర్ మాటలను పట్టించుకోకుండా అజ్మీర్, ధనంతో దర్పంతో అభిమానాన్ని కొలవలేము,సుభేదార్ మనల్ని మన తండ్రికన్నా ఎక్కువ అభిమానంతో పెంచుతున్నాడు, అతనికి అవసర సమయంలో మనం అతని బిడ్డల్లా అతనికి సేవలు చెయ్యాలి అని కజ్మీర్ కి సమాధానం ఇచ్చేవాడు.
ఒకసారి అజ్మీర్, కజ్మీర్ కి బాగా జబ్భు చేసింది. ఇద్దరూ బాగా నీరసించిపోయారు.సుభేదార్ కజ్మీర్ కి కజ్మీర్ సొంత తల్లిలా సేవలు చేసాడు, అతన్ని కంటికి రెప
్పలా కాపాడుకోడానికి ప్రయత్నం చేసాడు, అజ్మీర్ కి సపర్యలు చేసే బాధ్యతను సుభేదార్ కుటుంబసభ్యులు చూసుకునే వారు. సుస్తీ నుండి తెరుకున్నాక కజ్మీర్ సుభేదార్ ని ఒక్క ప్రశ్నవేశాడు, మీరంటే అజ్మీర్ కి చాలా ఇష్టం మిమ్మల్ని అతను మా తండ్రిగారితో సమానంగా గౌరవిస్తాడు, ఇటీవల మీకు జబ్భు చేస్తే మీ సొంత కొడుకు కూడా చెయ్యలేని సేవలు మీకు చేసాడు,ఇప్పుడు అతనికి జబ్భు చేస్తే మీరు అతనికి సేవలు చెయ్యకుండా అతని భాధ్యతను మీ కుటుంబ సభ్యులకు అప్పగించి, మిమ్మల్ని కేవలం ఉద్యోగిగా, మా తండ్రి వద్ద పనిచేసి మా అనుచరుడుగా మాత్రమే పరిగణించే నాకు మీరు నిద్రాహారాలు మాని మా తల్లిలా సపర్యలు చేశారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ అభిమానించలేదు కానీ మీరు నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు సుభేదార్ నవ్వుతూ అజ్మీర్ మాకు ఆత్మీయుడు, కుటుంబ సభ్యుడులా మాలో కలిసిపోయాడు, తమరు మాకు అతిధి మీరు మాతో గానీ మా కుటుంబ సభ్యులతో గానీ కలవడానికి ఇష్టపడటంలేదు అందుకే మిమ్మల్ని కేవలం అతిధిగానే చూస్తున్నాము, అతిధికి ఏ ఇబ్బందీ లేకుండా చూసుకోవడం మన సాంప్రదాయం, అందుకే కుటుంబ సభ్యుడు లాంటి అజ్మీర్ కన్నా అతిధిలాంటి మీ క్షేమానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాను, నాకు తండ్రి లాంటి మన చక్రవర్తి మీ తండ్రి గారు వద్దనుండి నేను నేర్చుకున్న సాంప్రదాయం అది అని సమాధానం ఇచ్చాడు సుభేదార్. కజ్మీర్ కి జ్ఞానోదయం అయ్యింది, చక్రవర్తికి ప్రజలు,ఉద్యోగులు పట్ల చులకన భావం ఉండకూడదని తెలుసుకున్నాడు. వెంటనే సుభేదార్ చేతులు పట్టుకొని మీరు నాకు తల్లిలా ఆత్మీయత చూపారు మిమ్మలను నేను గతంలో అవమానించాను నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు, సుభేదార్ మౌనంగా కజ్మీర్ ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు, మరి కొన్ని సంవత్సరాల పాటు చక్రవర్తి కుమారులు సుభేదార్ దగ్గరే ఉండి పాలకుల ఉత్తమ లక్షణాలను, సామాజిక భాద్యతలు, సామాన్యుల జీవన విధానాలు నేర్చుకున్నారు, ఒకరోజు సుభేదార్ అజ్మీర్, కజ్మీర్ లను వాళ్ళ తండ్రికి అప్పగించి ఇద్దరూ చక్రవర్తి పదవికి అర్హులే మీకు అవకాశం ఉంటే ఇద్దరికీ సమాన హోదాలు ఇవ్వండి అని కోరి అందుకు కజ్మీర్, అజ్మీర్ లకు ఉన్న అర్హతలను సవివరంగా రాజ్య సభకు వివరించాడు, చక్రవర్తి రాజ్యసభ మరియూ సామంత రాజుల ఆమోదంతో తన కుమారులిద్దరినీ జంట చక్రవర్తులు పేరిట పట్టాభిషేకం చేసి రాజ్య పాలనా బాధ్యతలు వారికి అప్పగించాడు.