M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

చెట్టుమీద పావురం

చెట్టుమీద పావురం

2 mins
395


    చెట్టు మీద పావురం... చెట్టు క్రింద కోతి


    ఒక తోటలో ఒక చెట్టు మీదవుండే పావురానికి చెట్టు క్రింద వుండే కోతి పిల్లకి స్నేహం కుదిరింది. పావురం ఎక్కడెక్కడకో వెళ్లి మంచి మంచి గింజలు తెచ్చి కోతికి ఇస్తే... కోతి తోటలో తిరిగి పండ్లు, చెదపురుగులను, కీటకాలను తెచ్చి పావురానికి ఇచ్చేది. పావురం దూరదూర ప్రాంతాల్లో తిరిగొచ్చి వింతలు విశేషాలు కోతిపిల్లకు చెబుతుంటే... కోతి ఆ తోటలోని కొమ్మకు కొమ్మకు ఉన్న కష్ట సుఖాలను పావురానికి పూసగుచ్చినట్లు చెబుతుండేది.


            ఒకరోజు తోటలో వనభోజనాలు పెట్టుకున్నాయి తోటలోని పక్షులు, జంతువులు, కీటకాలు వగైరా కలిసి, ఆ వన భోజనాలకి సకుటుంబ సపరివార సమేతంగా అన్ని పక్షులు, జంతువులు, కీటకాలు హాజరయ్యాయి కానీ ఈ కోతి పిల్ల, పావురం మాత్రమే తమకంటూ సొంత కుటుంబాలు లేక ఒంటరిగా హాజరయ్యాయి. వన భోజనాలు అయిపోయిన తరువాత,కోతి పిల్ల విచారంగా ఉండటం చూసి పావురం ఓదార్చి,"దారితప్పి నీకు దూరమైన నీ తల్లి ఎలావుంటుందో చెప్పు నేను అన్ని వనాలూ,అడవులూ తిరిగి ఆమె ఆచూకీ తెలుసుకుంటాను"అని అంది."మా అమ్మకు నాలాగే పావురాలు అంటే చాలా అభిమానం ఎక్కడ పావురాలు గుంపు ఉంటుందో అక్కడకు వెళ్లి నా తల్లి ముచ్చటలాడుతుంది "అని ఆనవాళ్లు చెప్పింది కోతి పిల్ల. పావురం వెంటనే తల్లి కోతిని వెదకడం మొదలు పెట్టింది. ఆ తోటకు దూరంగా ఉండే మరో తోటలో పావురాలు మాత పేరుతో ఒక కోతి ఉండటం గమనించి దానికి తన మిత్రుడు కోతి పిల్ల గురుంచి చెప్పింది. తల్లి కోతి ఆనందానికి అవదులు లేవు, "నీ మిత్రుడు నా పుత్రుడే" అంటూ పావురం వెంట చెట్టు వద్దకు వచ్చి, కోతి పిల్లను అక్కున చేర్చుకుంది.


      "నీ జంట పావురం ఏమైంది" అని తల్లి కోతి అడగగా "ఈ తోటమాలికి చిక్కి నా జంట పక్షి అతని ఇంట పంజరంలో ఉంది, నేను దాని రాకకై ఆశతో ఎదురు చూస్తున్నాను" అని విచారంగా పావురం చెప్పింది. ఒక రోజు తల్లికోతి పిల్ల కోతి తోటమాలి ఇంటికెళ్లి తోటమాలిని భయపెట్టి పరుగులు పెట్టించాయి.భయంతో తోటమాలి పారిపోగా పావురం పంజరాన్ని చెట్టుమీదకు ఎత్తుకొచ్చి జాగ్రత్తగా పంజరం తలుపులు తెరిచాయి. జంట పావురాలు మళ్ళీ కలిసాయి. కోతుల కుటుంబం ఆనందపడింది. అప్పటినుండి పావురాలు, కోతులు కలకాలం మంచి స్నేహితులుగా కాలం గడిపి కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటూ స్నేహతత్వానికి మంచి గుర్తింపు తెచ్చాయి.



                


Rate this content
Log in