బాల్యపు మధురస్మృతి
బాల్యపు మధురస్మృతి


"అమ్మా.... ఈరోజు నుండి మాకు సెలవులు ఇచ్చేసారు " అంటూ ఆనందంగా ఇంట్లోకి వచ్చి బ్యాగ్ లు పక్కన పడేసి ఆనందంలో ఇల్లు పీకి పందిరి వేసే పనిలో పడ్డారు కిరణ్ మరియు కీర్తి .
"అబ్బబ్బా...ఆగండ్రా...ఒక్క నిముషం...ముందు వెళ్లి స్నానం చేసి రండి వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నాను తిందురు కానీ" అంటూ వంటింట్లో నుండి అరిచింది ఉమ.
"ఐ..బజ్జీలు" అంటూ ఆనందంగా గంతులేస్తూ వెళ్లి స్నానం చేసి క్షనాల్లో వచ్చి టేబుల్ ముందు కూర్చొని "అమ్మా...ఆకలి...అమ్మా బజ్జీలు...త్వరగా తీసుకొని రా.."అంటూ టేబుల్ మీద చేతులతో దరువు లాంటి శబ్దం చేస్తూ అరుస్తున్నారు పిల్లలు.
"అబ్బాబ్బాబ్బా...ఒక్క నిముషం లోనే రచ్చ రచ్చ చేసేస్తున్నారు. ఇదుగో తినండి" అంటూ బజ్జీల ప్లేట్ పిల్లల ముందు ఉంచింది. పెట్టిన మరు క్షణమే ప్లేట్ కాళీ చేసేసారు.
"అయ్యో..! పాపం ఎంత ఆకలి మీద ఉన్నారో!! వేడిగా ఉన్నా కూడా పట్టించుకోకుండా తినేశారు" అనుకుంటూ ఇంకొన్ని బజ్జీలు తెచ్చి ఇచ్చింది. బజ్జీలు తినేసి ఆడుకోవడానికి బయటకి వెళ్లిపోయారు పిల్లలు.
"వీళ్ళకి సెలవులు ఇచ్చేసారు ఇంక వీళ్ళ అల్లరిని తట్టుకోవడం కష్టం" అనుకుంటూ ఇల్లంతా సర్దుకునే పనిలో పడింది ఉమ.
ఆటలు ముగించుకొని ఇంట్లోకి వచ్చిన పిల్లలు ఉమ ఇల్లు సర్దడం చూసి "అమ్మా ఏం చేస్తున్నావ్ ?" అని అడిగారు. పండగ వస్తుంది కదా అందుకే ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను నాన్న...మీరు ముందు లోపలికి వెళ్లి కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని రండి పాలు తాగుదురు గానీ" అంటూ పిల్లలిద్దర్నీ బాత్రూం లోకి పంపి వాళ్ళు తాగడానికి పాలు తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్ళింది ఉమ.
కాళ్ళు కడుక్కొని బయటకి వచ్చిన పిల్లలు వాళ్ళ అమ్మ వచ్చే లోపల అక్కడ ఉన్న పుస్తకాలు, బట్టలు అన్ని చిందర వందర చేయడం మొదలుపెట్టారు.
ఉమ గదిలోకి వెళ్లి చూసేసరికి సర్ది పెట్టిన బట్టలు , పుస్తకాలు అన్ని కింద పడేసి ఆడుకుంటున్న పిల్లల్ని చూసి ఏమి చెయ్యాలో అర్ధం కాక ఇద్దర్నీ కోపంగా పక్కకి లాగి కూర్చోబెట్టి చేతికి పాల గ్లాస్ లు ఇచ్చి తాగమని సైగ చేసి మరలా తన పనిలో పడిపోయింది.
అలా సర్దుతున్న ఉమ కి ఉన్నట్లుండి ఒక ఆల్బమ్ కనపడింది. వెంటనే దాన్ని తెరచి చూసింది. ఉమ చిన్న నాటి జ్ఞాపకాలతో కూడిన ఆల్బమ్ అది. "అరే! ఇన్ని రోజులు దీని సంగతే గుర్తురాలేదు" అనుకుంటూ
దాన్ని తెరచి చూస్తూ అందులోని ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందంతో మురిసిపోతున్న ఉమ ని చూసిన పిల్లలు ఇద్దరూ దగ్గరకి వచ్చి "ఏంటమ్మా అలా నవ్వుకుంటున్నావు?" అంటూ ఆల్బమ్ వైపు చూసి "ఐ.. ! ఎవరు అమ్మా? ఈ అక్క చాలా బాగుంది." అని అడిగింది కీర్తి.
"అది నేనేరా చిట్టితల్లి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు" అనగానే ఉమ చేతిలో నుండి ఆల్బమ్ ని లాక్కుని ఒక్కొక్కటిగా చూస్తూ నవ్వుతూ ఆనందిస్తున్నారు పిల్లలు. ఒక ఫోటో దగ్గర ఆగి "అమ్మా ఇది ఎవరమ్మా? నాన్న నా?" అని అడిగాడు కిరణ్.
"అరే అది కూడా తెలియదా నీకు, ప్యాంట్ - చొక్కా వేసుకునేది నాన్నే కదా...నాన్నే అయి ఉంటారు. అంతే కధ అమ్మా ఈయన నాన్నే కదా!" అంటూ అమాయకంగా అడిగిన పిల్లల్ని చూసి నవ్వుతూ.
"అది మీ నాన్న కాదు, నేనే.."
ఆ ఫోటో వైపు తీక్షణం గా చూస్తూ... "ఇది నువ్వా ...! మరి ఇక్కడ ప్యాంటు చొక్కా వేసుకున్నావు ఎందుకు? " అని అడిగాడు కిరణ్.
ఆ ఫోటోని చేతికి తీసుకొని నవ్వుకుని "అది నేను 5 వ తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డే కి నేను వేసిన వేషం... ఆరోజు నేను మగ పిల్లాడి వేషం వేసాను. నాకు అప్పట్లో చాలా జుట్టు ఉండేది ఆ జుట్టు కనపడకుండా వెనక ముడి వేసి టోపి పెట్టారు... డాన్స్ వేసేటప్పుడు ఆ బరువుకి టోపి ఊడిపోయి నా జడ బయటకి వచ్చింది అది చూసిన నా స్నేహితులు పక పకా నవ్వారు." అంటూ తన చిన్ననాటి మధుర స్మృతులని గుర్తుచేసుకుంది ఉమ. అది విన్న పిల్లలు కూడా నవ్వుకున్నారు.