అనగనగా ఒక బడి
అనగనగా ఒక బడి


అనగనగా ఒక బడి (నీతి కథ)
నీలకంఠాపురంలో పిల్లలు అల్లరి శృతిమించిపోయేది. ఊర్లో అల్లరి మూకలుగా తిరుగుతూ పెద్దలకు తలనొప్పిగా తయారయ్యారు పిల్లలు. నీలకంఠాపురం పురం బడికి టీచర్లుగా రావడానికి ఎవరూ ఇష్టపడేవారుకాదు.బడికి తప్పనిసరి బదిలీపై లేదా మొదటి నియామకం వల్ల వచ్చిన టీచర్లు కూడా తమ విధులను బెల్, బిల్ అన్న పద్దతిలో మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చేవారు ఎందుకంటే ఈ ఊరు పిల్లలు చాలా అల్లరి పిల్లలు పైగా ఇంట్లో పెద్దల మాటలు అసలు పట్టించుకోరు, ఊర్లో పెద్దలు మంచి మాటలనూ అసలు గౌరవించరు అని గురువులు కూడా పిల్లల్లో మంచి మార్పు తీసుకురావాలనే ఆలోచనలే చెయ్యడం మానేశారు. ఒకేసారి ఉపాధ్యాయులు బదిలీలలో ఆ ఊరు బడి నుండి అందరు ఉపాధ్యాయులూ బదిలీ అయిపోయారు, కొన్నిరోజులు తరువాత వినయ విధేయరామా అనే యువకుడు కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి నీలకంఠాపురం బడికి టీచర్ గా వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఈ ఊరు ఎందుకొచ్చానురా బాబూ అంటూ తలపట్టుకున్నాడు, ఈ పిల్ల రాక్షసులుతో వేగలేను ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకున్నాడు, "అయ్యా మా ఊరు జనాలు మంచోల్లే కాకపోతే మూర్ఖత్వం చాలా ఎక్కువ, ఓపిగ్గా వాళ్లకి అర్ధమయ్యేటట్లు చెబితే మా ఊరు ప్రజలంత మంచోళు మరెవ్వరూ వుండరు" అని చెప్పాడు ఒక మూడు కాళ్ల ముసలాయన. " ఏమి మార్పు వస్తాది ఈ ఊరు బడి పిల్లలు ఉన్న చోట ఫోన్, మనీ పర్సు, వాచీ ,పెన్నులు ఒకటేమిటి కన్ను చాటుపెడితే చాలు ఏదోఒకటి పోతుంది, అలాగని పిల్లలకు క్రమ శిక్షణ లేదు, విసుగు వస్తుంది" అని అన్నాడు విధేయరామ, "గాంధీజీ విసిగిపోతే మనకు స్వాతంత్ర్యం వచ్చేదా! అతనికి జాతిపిత అన్న గౌరవం దక్కేదా! వినూత్న ప్రయత్నం చెయ్యాలి, విశిష్ట ఫలితాలు సాధించాలి"అని ముసలాయన చెప్పాడు. పెద్దాయన గాంధేయవాదిలా వున్నాడు సరే అతను చెప్పిన మాట విందాం అనుకొని విధేయరామ మొదటి ప్రయత్నంగా బడిపిల్లలను బడి సమీపంలోని పొలాలకు క్షేత్రపరిశీలనకు తీసుకొని వెళ్ళాడు, పిల్లలు బడి నాలుగు గోడలు దాటి బయటకు వెళ్లి వ్యవసాయం గురుంచి తెలుసుకోవడం, రైతులు చేత పిల్లలకు వ్యవసాయం గురుంచి చెప్పించడం పిల్లలకు నచ్చింది, శ్రద్ధగా క్రమ శిక్షణతో వున్నారు, కొన్ని రోజులు తరువాత పంచదార ఫ్యాక్టరీకి, మరికొన్ని రోజులు తరువాత పోస్ట్ ఆఫీస్ కి మరోసారి పోలీస్ స్టేషన్ కి ఇంకోసారి ఇంకో ప్రాంతానికి ఇలా తరగతిలోనూ తరగతి బయట పిల్లలతో మమేకమై పాఠ్య బోధన చేస్తుండటంతో పిల్లలకు బడి అంటే ఆసక్తి పెరిగింది ఉపాధ్యాయులు మీద గౌరవం, అభిమానం పెరిగింది, అల్లరి తగ్గింది, క్రమశిక్షణ వృద్ధిచెందింది, ఇనుము వేడిమీద ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు వేసి మనం కోరుకునే ఆకృతిలోకి తెచ్చుకోవాలని పిల్లలకు నైతిక విద్య, ప్రవర్తనా నియమావళి నేర్పాడు విధేయరామ, పిల్లలు పిడుగులు అయ్యారు, మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్నమైన పద్ధతులు, సాంకేతిక నైపుణ్యాలతో విద్యా బోధన చెయ్యడం అమలు చేసాడు.ఆ ఊరు పిల్లలు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, అంకిత భావానికి ప్రతీకలుగా తయారయ్యారు, గుడి,మడి, అమ్మఒడి కన్నా బడి మెరుగు అన్న విధంగా బడిని తీర్చిదిద్దాడు విధేయరామ, ఊరు సంతోషించింది, గ్రామము బడి సర్వతోముఖాభివృద్ధికి సాయపడింది. నీలకంఠాపురం బడి అంటే హడలిపోయే ఉపాద్యాయులే నీలకంఠాపురం బడిలో ఒక ఏడాదైనా పని చేసే భాగ్యం కలిగితే బాగుణ్ణు అని అనుకునే స్థితి వచ్చింది, వినయ విధేయరామ పేరు సార్ధకమయ్యింది.నీలకంఠాపురం పిల్లలు విద్యా ప్రగతి వల్ల ఆ ఊరికి నెమలికంఠపురం అని పేరు వాడుకలోకి వచ్చింది.