Udaya Kottapalli

Children Stories

4.0  

Udaya Kottapalli

Children Stories

కలసి ఉంటే కలదు సుఖం (బాలల కధ)

కలసి ఉంటే కలదు సుఖం (బాలల కధ)

3 mins
898





జంతువుల పాఠశాలలో కొత్తగా చేరిన పిల్ల నక్క, పిల్ల కొంగ చేరిన నాటినుంచి మంచి స్నేహితులైపోయాయి. కొత్తగా చేరినా వాటి చలాకీ తనం చూసి మిగతా జంతువులన్నే స్నేహంగా మసలుకోసాగాయి.

కొన్నాలు గడిచాకా ఒకరోజు పిల్ల నక్క పిల్ల కొంగను తన ఇంటికి రమ్మని, తన కుటుంబాన్ని పరిచయం చేస్తానని చెప్పింది.ఇంట్లో అనుమతి తీసుకుని తప్పక వస్తానని బదులిచ్చింది పిల్ల కొంగ. ఇంట్లో అనుమతి అడిగితే

‘’జాగ్రత్తగా వెళ్ళిరా.’’ అని చెప్పింది తల్లికొంగ.

పిల్ల నక్కతో వాళ్ళ ఇంటికి మొదటిసారి వచ్చింది పిల్ల కొంగ. పిల్ల నక్క ఇంట్లో అందరినీ పరిచయం చేసి ఇల్లంతా చూపించింది. అలా చూస్తున్నప్పుడు హాల్లో గోడమీద ఒక ఫోటో చూసి’’ ఇలాంటి ఫోటోనే మా ఇంట్లో కూడా వుంది. ఆ ఫోటో లో ఉన్నది మాతాత..పక్కన ఎవరు?’’అడిగింది పిల్లకొంగ.

‘’ఆయన మాతాత. ఒకసారి మీ తాతని మాతాత భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు తీయించుకున్న ఫోటో అంట. మా అమ్మ చెప్పింది’’ అంది పిల్ల నక్క.

ఆఫోటో లో వెడల్పాటి పళ్ళెంలో పోసిన పాయసాన్ని కొంగ తన పొడవాటి ముక్కుతో తాగడానికి ప్రయత్నిస్తోంది.

అది చూసి పిల్ల కొంగకి బాధగా అనిపించింది. అన్నీ చూసాకా ‘’ రేపు నువ్వు మా ఇంటికి రా. మా ఇంట్లో అందరినీ పరిచయం చేస్తాను. మా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తాను.’’ అని పిల్ల నక్కని ఆహ్వానించి ఇంటికి వచ్కెసింది పిల్ల కొంగ.

మరునాడు పాఠశాల అయిపోయాకా పిల్ల నక్క పిల్ల కొంగ ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరినీ పిల్ల నక్కకు పరిచయం చేసాకా ఇల్లంతా చూపిస్తూ తమ ఇంటి హాల్లో గోడకు ఉన్న ఫోటోను చూపించింది. ‘’ ఇది మీ తాతని మాతాత మా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు తీయించుకున్నప్పటిది.’’ అంది పిల్ల కొంగ.

అందులో పాయసం ఉన్న కూజా లోకి ఆశగా చూస్తూ ఉంది నక్క. అది చూసి పిల్ల నక్క బాధపడి, పిల్ల కొంగ దగ్గర సెలవు తీసుకున్నాకా ఇంటికి వచ్చాకా తల్లి నక్కని అడిగింది.

‘’మన ఇంట్లో ఇలాంటి ఫోటో ఉంటే వల్ల ఇంట్లో అలాంటి ఫోటో ఉందేమిటమ్మా?’’ అని.

ఒకసారి తాత నక్క, తాత కొంగని భోజనానికి పిలిచి, తాము బలవంతులమ్ అనే గర్వంతో పళ్ళెం లో పాయసం పోసి కొంగ తినకుండా చేసి అవమానించిచాడని, తల్లి కొంగ ఆకలితో తినకుండా వెళ్లిపోయిందని, ఆ జ్ణాపకంగా ఫోటో తీయించాడని, అయితే తాత కొంగ మరునాడు తాత నక్కని భోజనానికి పిలిచాడని, పెద్ద కూజానిండా పాయసం పోసి తాత నక్క తినకుండా తగిన శాస్తి చేశాడని, తాత నక్క ఆకలితో ఇంటికి వచ్చేశాడని, అందుకే శారీరక బలం ఒక్కటే సరిపోదని, దానికన్న మానసిక బలం గొప్పది అని చెప్పింది తల్లి నక్క. అది విన్న పిల్ల నక్క ఎంతో నొచ్చుకుంది.

మరో రెండురోజుల్లో తమ పిల్ల కొంగ పుట్టిన రోజు అని తప్పకుండా ‘’ మా ఇంటికి మీ కుటుంబం అంతా భోజనానికి రావాలని ‘’తల్లి కొంగ, పిల్లకొంగ వచ్చి నక్క కుటుంబాన్ని భోజనానికి పిలిచాయి.

‘’పాత కక్షలు మనసులో పెట్టుకుని మళ్ళీ మనకు కూజాల్లో పాయసం పెడితే, తినలేక ఆకలితో తిరిగి రావాలి. వెళ్ళొద్దు.’’ అంది తండ్రి నక్క.

‘’లేదు నాన్నా. పిల్ల కొంగ చాలా మంచిది. వాళ్ళు అలా చేయరు. అలా చేస్తే నేను తనతో స్నేహం మానేస్తాను.వెళ్దాంనాన్నా.’’ అని బ్రతిమలాడింది పిల్ల నక్క.

‘’ వాళ్ళు వచ్చి గౌరవంగా పిలిచారు. వెళ్దాం. వెళ్తే కదా వాళ్ళు ఏంచేస్తారో తెలిసేది’’ అని తల్లి నక్క చెప్పడంతో సరే అని ఒప్పుకుంది తండ్రి నక్క.

పిల్ల కొంగ పుట్టిన రోజు రానే వచ్చింది. నక్క కుటుంబం అంతా పిల్ల కొంగ ఇంటికి చేరారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించింది కొంగ కుటుంబం.పిల్లకొంగ బెలూన్లతో అందంగా అలంకరించిన వేదికమీద తన ముక్కుతో కేక్ కట్ చేసింది అనంతరం నక్క కుటుంబానికి వాళ్ళు తినేందుకు వీలుగా పళ్ళాలలో ఘుమఘుమలాడే పాయసంతో పాటు కేక్ ముక్కలు కూడా వడ్డించింది తల్లి కొంగ. అలాగే తమ కుటుంబ సభ్యులకు అందమైన కూజాల్లో పాయసం పోసి కేక్ ముక్కలు పైన వేసింది. అందరూ ఆనందంగా ఆరగించారు.

అందరూ ఆనందంగా భోజనాలు పూర్తి చేశారు. భోజనాలు చేసాకా అందరూ కబుర్లు చెప్పుకోవడానికి కూర్చున్నారు.

తల్లి నక్క తల్లి కొంగతో ‘’ మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి, మేము తినే విధంగా మంచి విందు భోజనం పెట్టారు. మా మావగారు మీ మావగారిని అవమానించినట్టు అవమానించకుండా గౌరవంగా చూశారు..అందుకు మీకు ఎంతో కృతజ్నతలు.’’ అంది.

అందుకు తల్లి కొంగ ‘’ అమ్మా. అవతలి వాళ్ళు చెడుబుద్ధి ప్రదర్శిస్తే మనమూ చెడు బుద్దే ప్రదర్శించి తగిన శాస్తి చేశామని ఆరోజుల్లో సంబరపడేవారు. మా మావగారిని భోజనానికి పిలిచి ఆ బుద్ధి మొదటిగా ప్రదర్శించింది మీ మావగారే. ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచి భోజనం పెట్టకుండా అవమానించి పంపడం ఘోరమైన పాపం. అందుకు తగిన శాస్తి మా మావారు చేశారు. ఆయన చేసిందీ తప్పే. మీరు చెడు చేశారని నేనూ చెడే చేస్తే మీకూ నాకూ తేడా ఏముంది? ప్రతీ వారిలోనూ మంచి చెడు ఉంటాయి. చెడును అదుపులో ఉంచుకుని మంచిగా ప్రవర్తిస్తూ ఒకరికొకరు గౌరవించుకుంటూ సాయపడితే అందరమూ ఆనందంగా ఉంటాము కదా.’’ అంది

‘’అవును. మీరు చెప్పింది నిజం. బలవంతుడు బలహీనుని చంపితే దానికి ప్రతీకారంగా బలహీనులంతా ఏకమైతే బలవంతుడూ చావాల్సిందే. అందరమూ కలిసి ఐకమత్యంగా కలిసి ఉంటేనే కలదు సుఖం అని మీరు నిరూపించారు. వారం రోజుల్లో రాబోతున్న మా పిల్ల నక్క పుట్టిన రోజునాడు మీ కుటుంబం అంతా మాయింటికి భోజనాలకు రావాలి. ఇదిగో ఈ సందర్భంగా మీ పిల్ల కొంగకు మా బహుమతిగా మా ఇంట్లో ఉన్న మీ మావగారి ఫోటో’’ అని ఇచ్కింది తండ్రి నక్క.

‘’ఒకరిపై ఒకరికి విద్వేషాలు కలిగించే ఇలాంటి జ్నాపకాలు ఇక మీదట మన ఇళ్ళల్లో ఉంచుకోవద్దు,వాటిని ఇప్పుడే తగలబెట్టి ఆ అగ్ని సాక్షిగా ఇకపై మనం స్నేహం తరతరాలుగా కొనసాగిద్దామని ప్రమాణం చేద్దాం.’’ అంది తండ్రి నక్క.

‘’అవును అలాగే చేద్దాం.’’ అన్నారు రెండు కుటుంబాలవాళ్లూ.

తండ్రి కొంగ తమ ఇంట్లో గోడకు ఉన్న ఫోటో కూడా తీసి పట్టుకు వచ్చింది. ఆ రెండు ఫోటోలకు పిల్ల నక్క అగ్గి వెలిగించింది.

స్నేహంతో ఒకరి చేయి ఒకరు పుచ్చుకుని రెండు కుటుంబాలవాళ్లూ ఆ మంట చుట్టూ కేరింతలు కొడుతూ తిరగసాగారు.

                                                         సమాప్తం


 

 



Rate this content
Log in