🌻🌻 స్వర్ణ 🌻🌻

🌻🌻 స్వర్ణ 🌻🌻

5 mins 233 5 mins 233


స్వర్ణ, అమర్ ముచ్చటైన జంట..

అన్నిటికీ తగ్గట్టుగా తనను తాను మార్చుకోగల సహనం స్వర్ణది..

అందుకేనేమో చిన్నప్పటినుండీ జీవితంలోని ఎత్తుపల్లాలు అన్నిటినీ ఎదుర్కొని పరిష్కరించుకోగల ధీరవనిత అనే ఏమో..

కడుపున పుట్టిన బిడ్డకు మనోవైకల్యం పెట్టాడు దేవుడు..


శివ పుట్టినప్పుడు ముద్దుగా ఉన్నాడు..ఎంతో శ్రద్ధగా చూసుకునేది స్వర్ణ...ఒకటిన్నరేళ్ళు వచ్చాయి శివకి...నడక బానే వచ్చింది..ఆడిస్తూ స్వర్ణ దా దా అని చేతులూపుతూ దూరంగా ఉన్న బిడ్డని ఆడిస్తూ పిలిచేది...శివ వినిపించుకునేవాడు కాదు...చెవులు సరిగా వినపడట్లేదేమో అని పరీక్షించడానికి ఒక గిన్నె కానీ పళ్ళెం కానీ కింద వేసేది కొంచెం శబ్దం వచ్చేలా...ఆ శబ్దానికి భయపడ్డట్టు చూసేవాడు శివ ..అయ్యో అని జాలేసి శివను దగ్గరికి తీసుకునేది స్వర్ణ...ఒక్కోసారి అమ్మపిలుపులకి యాధాలాపంగా స్వర్ణ వైపు చూసినా నవ్వేవాడు కాదు , పట్టించుకునేవాడు కాదు...


చిట్టిచిలకమ్మా అమ్మ కొట్టిందా అని పాటలు పాడి శివను ఆడించబోతే తన మానాన తాను ఏదో బొమ్మతో ఆడుకునేవాడు...అమ్మ ఎంత ముద్దు చేస్తున్నా అమ్మా అనే సహజంగా పిల్లల్లో ఉండే అనుబంధం శివలో ఏదీ కనబడలేదు స్వర్ణకి..


సాయంత్రాలు పార్కుకి తీసుకెళితే అదేవయసు వేరే పిల్లలకి, శివకి ఏదో తేడా కనిపించేది స్వర్ణకి...అందరు పిల్లలు జారుడుబల్ల మీద కూర్చోబెడితే నవ్వటమో ఏడవటమో చేస్తే శివ ఏ ధ్యాస లేనట్టు ఉండేవాడు....నేల మీద చిన్నచిన్న మొక్కలు తాకుతూనో, ఇసుకను గుప్పిళ్ళతో పట్టి ఆడటం మాత్రం మామూలుగానే చేసేవాడు...వేరే పిల్లలు దగ్గరకొస్తే వారిని పలకరింపు నవ్వుతో చూడటమో, అల్లరిగా చేత్తో తోసెయ్యడమో ఏదీ చెయ్యడు..అసలు ఆ పిల్లలను పట్టనట్టు ఉండేవాడు...


శివని శ్రద్ధగా గమ్మనించింది స్వర్ణ..బాబు మానసిక ఎదుగుదల సరిగా లేదని నెమ్మదినెమ్మదిగా అర్ధం అవుతూ వచ్చింది స్వర్ణకి...అమర్ కూడా అర్ధం చేసుకుని స్వర్ణతో పాటూ శివని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు..


స్కూలుకెళ్ళేవయసులో శివని ఒక స్కూలులో చేర్పించారు...మొదటిరోజు మామూలుగానే అందరిపిల్లల్లా స్కూలులో దించి గేట్ బయటే నుంచున్నారు...అరగంట గడిచింది, గంట గడిచింది....లోపలనుంచీ ఏ ఫిర్యాదు రాలేదు మీ బాబు ఇలా, మీబాబు అలా అని...ఓపికగా ఎదురుచూస్తూ స్కూలు బయటే కారులో కూర్చుని ఉన్నారు తల్లితండ్రి ఇద్దరూ...


పన్నెండింటికి ఆయా చేయి పట్టి తీసుకొస్తున్న శివ దగ్గరికి పరుగెత్తుకెళ్ళి స్వర్ణ శివను గుండెలకు హత్తుకుంది...అమ్మా అని చిన్నగా నవ్వాడు నాలుగేళ్ళ శివ...రోజూ, రోజంతా తనతో ఉండే అమ్మ ఈ రోజు నాలుగుగంటలు దూరంగా ఉండేటప్పటికి మనసుకి దిగులయ్యిందో ఏమో మరి, అమ్మ కనపడగానే అప్పటివరకూ ఏనాడు అమ్మా అని స్వర్ణని పిలవని శివఆ రోజు అమ్మా అని పిలిచాడు..


స్వర్ణకి చెవుల్లో అమృతం పోసినట్టయ్యింది...అమర్ కూడా శివ నోటినుండీ మొదటిసారి అమ్మ అని విని ఆనందపడ్డాడు...


వారం రోజులకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో టీచర్ స్వర్ణకు చెప్పింది...శివ కొంచెం డల్ గా ఉన్నాడు...రైమ్స్ చెప్తే అందరు పిల్లలు చేతులు కాళ్ళు ఆడిస్తూ స్పందిస్తుంటే శివ తలొంచుకుని కూర్చుంటాడు, లేదా గాల్లోకి చూస్తూ ఉంటాడు, శివా అని పిలిచినా పలకడు అని...


స్వర్ణ తలూపి టీచర్ వైపు నవ్వుతూ చూసి మౌనంగా ఉంది...


ఒక నెలకి ప్రిన్సిపల్ నుంచీ పిలుపొచ్చింది...

స్వర్ణా, శివకి ఇంట్లో చెప్పండి టీచరుకి సమాధానం చెప్పాలి, టిచర్ చెప్పేవి చెయ్యాలి అని.. బాబు ఏదీ పట్టనట్టు ఉంటాడు అని ప్రిన్సిపాల్ చెప్పింది..


స్వర్ణ శివని ఇంట్లో చాలాసార్లు అడుగుతుంది స్కూలులో ఏం చేసావు, స్కూలులో నీకేది నచ్చింది అంటూ..శివ ఏదీ చెప్పడు...


ఒకరోజు పిడుగులు పడుతూ వాన మొదలైంది...అమ్మా అని గావుకేక పెడుతూ పరుగెత్తుకొచ్చి స్వర్ణను చుట్టేసుకుని ఒకటే వణికిపోతున్నాడు, కళ్ళు తేలేస్తున్నాడు..నాన్నా శివా ఏం భయం లేదు నాన్నా అమ్మ ఉందిగా భయపడకు అని వీపు నిమురుతూ స్వర్ణ ఎంత ధైర్యం చెపుతున్నా శివ అయోమయంగా అయిపోతున్నాడు..


చిన్నగా ఉన్న శివను పట్టి ఆపలేకపోయింది స్వర్ణ...తెలీని పిచ్చి బలంతో అయోమయంతో అటూ ఇటూ పరుగెడుతున్నాడు శివ...గట్టిగట్టిగా అరిచేస్తున్నాడు...శివ పడే బాధ చూడలేక స్వర్ణకు ఏడుపు తన్నుకొచ్చేస్తోంది...


పిడుగుల శబ్దం వినపడకుండా ఇంటి తలుపులన్నీ మూసేసి శివకి మంకీ కాప్ తొడిగి దానిపైన తన కాటన్ చున్నీ ఒకటి గట్టిగా కట్టింది..అయిదునిముషాలకు తేరుకున్నట్టు అయ్యాడు శివ..కానీ అప్పటివరకు పడ్డ భయం తాలూకు ఒత్తిడికి నీరసంగా వేలాడిపోయాడు...బాబుని చేత్తో దగ్గరగా పట్టుకుని, పాలు కాచి, వేడిగా ఒక గ్లాసు పాలు తాగించింది స్వర్ణ శివకి...


అలా ఎలాగోలా నెట్టుకొస్తూ పదేళ్ళ వయసుకి వచ్చాడు శివ...స్కూలు వాళ్ళు అప్పుడప్పుడూ చెప్పే కొన్ని ఫిర్యాదులు ఉన్నా స్వర్ణ జాగ్రత్తగా సహనంగా శివను ఒక్కొక్క క్లాసు గట్టెక్కిస్తోంది..


చికిత్స జరుగుతోంది శివకి..అది అమర్, స్వర్ణకి తప్ప వేరే ఎవరికైనా ఏదో శారీరక అనారోగ్యం కి చికిత్స అన్నట్టు నడిపిస్తున్నారు స్వర్ణా వాళ్ళు..అందరికీ తెలియకూడదని కాకపోయినా, తెలిస్తే ఏదో జాలి చూపిస్తారు..అది ఇష్టం లేదు స్వర్ణకి...


శివకి ఉన్న సమస్య పూర్తి పెద్దది కాదు..ఒక పది శాతం మాత్రమే ఇబ్బంది ఉంది శివకి..అందుకే అందరికీ సరిగ్గా తెలీదు శివ కొంచెం సరిగా లేడు అని...స్వర్ణ కూడా చాలా ఓపికగా అంతా చూసుకుంటోంది...


శివకి పదిహేనేళ్ళు...స్కేటింగ్ అంటే ఇష్టం శివకి..స్కూల్లో హాబీ క్లాసులు చూసి అమ్మకి చెప్పాడు స్కేటింగ్ నేర్చుకుంటానని..స్కూలులో తాను దగ్గరుండి చూసుకోవటం కుదరదని...ఒక గ్రౌండులో స్కేటింగ్ క్లాసులు నేర్పించే చోట చేర్చింది శివని..రోజూ సాయంత్రం తాను దగ్గరుండి శివను తీసుకెళుతుంది...


కాళ్ళకు స్కేటింగ్ షూస్ కట్టుకోవటం నుంచీ స్కేటింగ్ చేస్తూ శివ పడిపోకుండా, జాలీ బయట నుంచుని, శివనే చూసుకుంటూ జాగ్రత్తలు చెబుతూ..బ్రేక్ టైం లో చెమట మొహం మెత్తటి టవల్ తో తుడిచి ఫ్రూట్ జ్యూస్ కొంచెం తాగించి..క్లాసు అవ్వగానే శివ నవ్వుకుంటూ స్కేటింగ్ చేసినందుకు సంతోషంగా బయటకి వస్తుంటే తానూ శివకి తోడుగా నవ్వుతూ..ఇంటికి బయలుదేరేటప్పుడు స్కూటీ మీద కొడుకు వెనక కూర్చుంటే కొడుకు నడుముకి తన నడుముకి ఒక చున్నీని కలిపి కడుతుంది..ట్రాఫిక్ లో కొడుకు గబుక్కున కిందపడతాడేమో అని భయం స్వర్ణకి...


ఇవన్నీ రోజూ చూస్తూ ఉంటాడు స్కేటింగ్ అప్పటికే బాగా నేర్చుకుని ప్రాక్టీస్ కోసం క్లాసులకి వచ్చే అర్జున్,.. అతనికి పద్ధెనిమిదేళ్ళు..


రోజూ స్వర్ణని చూస్తూ ఉంటాడు..ఒకరోజు స్వర్ణ అర్జున్ ని చూసింది...తననే దీక్షగా చూస్తూ ఉన్న అర్జున్ కనిపించాడు...తల తిప్పేసుకుని శివ నే చూసుకుంది స్వర్ణ..ఇంకోరోజు అర్జున్ స్వర్ణను చూసి నవ్వాడు..స్వర్ణకి తిరిగి నవ్వాలా వద్దా ఏమీ అర్ధం కాలేదు...


అలా రోజూ అర్జున్ కనపడటం స్వర్ణని ఆప్యాయంగా చూడటం, నవ్వటం స్వర్ణకి అర్ధం కావట్లేదు...శివకి స్కేటింగ్ చేయటం చాలా ఇష్టం..శివకి దొరికే ఆనందాన్ని దూరం చేయటం ఇష్టం లేక క్లాసులకి వస్తోంది కానీ ఒక్కోసారి అర్జున్ శ్రద్ధగా చూడటం స్వర్ణకు చిరాకు కలిగిస్తోంది...


ఇంకో రెండ్రోజులు చూసి అమర్ కి , తనకి ఇబ్బంది ఇదీ అని చెప్పాలి, లేదా అర్జున్ నే ఏమిటి ఎందుకు చిరాకు పెడుతుంటావు అని అడిగెయ్యాలి అనుకుంది.


ఆ రోజు సాయంత్రం శివ స్కేటింగ్ చేస్తుంటే చూస్తూ కూర్చున్న స్వర్ణకు..కళ్ళ ముందు ఒక పసుపుపచ్చని గులాబీ పట్టుకున్న ఒక చెయ్యి కనపడింది...ఎవరా అని తల పైకెత్తి చూస్తే అర్జున్..స్వర్ణకి కోపం వస్తోంది...అమ్మా ఈ గులాబీ తీసుకోమ్మా అని వినిపించింది అర్జున్ నోటినుంచీ...లేచి నుంచుంది...తీసుకో అమ్మా అన్నాడు స్వఛ్ఛమైన నవ్వుతో కళ్ళల్లో కన్నీళ్ళతో అర్జున్..


పిచ్చికోపం అంతా మాయమైపోయింది స్వర్ణకి అమ్మా అన్న అర్జున్ పిలుపు వినగానే...నించుని ఉన్న స్వర్ణ పాదాలను తన కుడిచేతితో తాకి కళ్ళకు అద్దుకున్నాడు అర్జున్...


అమ్మా ఈ రోజు మా అమ్మ నాకు దూరంగా వెళ్ళిపోయిన రోజు...చిన్నప్పుడు నన్ను ఆడించి నవ్వించి కమ్మగా అన్నం తినిపించి చదివించి అన్నిటిలో నాకు తోడుగా ఉండే అమ్మ మేమిద్దరం ఆడుతూ పరుగులు పెట్టేటప్పుడు..చూసుకోకుండా మెట్లు జారి పడింది...తలకు పెద్ద గాయమై 

హాస్పిటల్ లో ఉండీలేని స్పృహలో నన్నే తలుచుకుంటూ...కన్నా బాగా చదువుకో అమ్మ కోసం ఏడవకూడదు, బాధ పడకూడదు, నేను మళ్ళీ ఎలాగో అలా నీ దగ్గరికి వస్తా కన్నా.. అని చెప్పింది...వారం రోజులు పోరాడింది మృత్యువుతో, నాకేం కాదులే కన్నా, నాకేం కాకూడదు.. అని చెప్పేది...ఎప్పటికీ ధైర్యంగా ఉండాలి నువ్వు, సంతోషంగా ఉండాలి నువ్వూ అని నా తల నిమిరేది...తరువాత నాకు దూరమైపోయింది...అని చెప్పాడు అర్జున్..


అప్పటికే స్వర్ణకు కళ్ళు నీటిచెలమలైపోయాయి...అర్జున్ తన కళ్ళు తుడిచేసుకుని అమ్మ నన్ను ఏడవకూడదు అని చెప్పుంది...


ఎందుకంటే అమ్మ చెప్పినవి అన్నీ ఖఛ్ఛితంగా పాటించాలి నేను...ఎందుకంటే అమ్మ మాటలు అన్నీ నిజాలు...ఎలాగో ఒకలా నా దగ్గరికి వస్తానంది...


సరిగ్గా నాలుగునెలల క్రితం అమ్మ పుట్టినరోజునాడే మీరు ఇక్కడికొచ్చారు...శివని మీరు చూసుకునే ప్రేమలో నాకు మా అమ్మే కనిపించింది....మీరు దూరం నుంచీ వస్తుంటే అమ్మే నడిచొస్తున్నట్టు అనిపించేది....శివకి మీరిచ్చే ప్రేమలో కొంచెం నాకూ పంచగలవా అమ్మా...పంచిన కొద్దీ పెరిగేది ప్రేమ అంటారు, శివకేమీ తక్కువ కాదులేమ్మా మీ ప్రేమ...అమ్మప్రేమైతే మరీ అక్షయపాత్రే..ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ప్రేమ పుడుతూనే ఉంటుంది...అమ్మకి పసుపు గులాబీలంటే ప్రాణం...అందుకే పసుపు గులాబీ మీకిచ్చి మీలో నా అమ్మ ప్రేమకి ప్రాణం పోయాలనుకున్నాను....


నాన్ననన్ను బాగా చూసుకుంటారు, యే లోటూ చెయ్యరు...కానీ అమ్మచేతి గోరువెచ్చని స్పర్శ నా చెంపను తాకి చాలా యేళ్ళు అయిందమ్మా..నా కన్నీటిని తుడిచే అమ్మచెయ్యి నాకు కావాలి....నా తలను ప్రేమగా తడిమే అమ్మచెయ్యి నా మనసుకి ఎనలేని ప్రశాంతవీచికలను ప్రసరింపచేయగలదు...అలాంటి మనశ్శాంతి నాకు కావాలి అమ్మా అన్నాడు అర్జున్...


స్వర్ణకు అంతా వింటూ ఏమి చెయ్యాలో, ఏమి చెప్పాలో తెలియటంలేదు...శివ వచ్చాడు...దూరం నుంచీ అమ్మతో అర్జున్ మాట్లాడటం చూసాడు...ఏమనిపించిందో మరి పసుపుగులాబీని తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు శివ...తల్లిప్రేమ కొన్నేళ్ళుగా రుచి చూస్తున్న శివకు మరో తల్లి ప్రేమసందేశం ఆ పసుపు గులాబీలో తెలిసిందేమో, తన ఉండీలేని లోకజ్ఞానానికి సైతం ...


అమాయకుడైన కొడుకుని కంటికి రెప్పలా కాచుకుంటూ అలిసిన స్వర్ణకు ఇంకో కొడుకయ్యాడు అర్జున్...తమ్ముడు శివను అర్ధం చేసుకోవటంలో, ఆదుకోవటంలో ఒక తోడయ్యాడు అర్జున్.. స్వర్ణా, అమర్ లకి...
Rate this content
Log in

More english story from Thulasi Prakash

Similar english story from Drama