శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Inspirational Children

4.2  

శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Inspirational Children

శభాష్ సోము

శభాష్ సోము

3 mins
184



    రాము, సోము చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. రాము తెలివైన విద్యార్థి అయితే సోము చదువులో బాగా వెనుకబడేవాడు. అయితే దాదాపు ప్రతి పరీక్షలో రాము జవాబు పత్రంలో సోము చాకచక్యంగా కాపీ చేసేవాడు కాబట్టి సోమూకు కూడా మంచి మార్కులు వచ్చేవి. తల్లిదండ్రులు ఆ మార్కులు చూసి తమ కుమారుడు ఇంటివద్ద చదువుకున్నా సహజమైన తెలివితేటలు కలవాడుగా సంతోషించారు.


    సోము 8వ తరగతి పూర్తి అయింది. వేసవి సెలవులు వచ్చాయి. సోము వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో సహా సోము వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళరు. సోము వాళ్ళ పెద్దమ్మ కూతురు శారద కూడా 8వ తరగతి పూర్తి చేసింది. సోము, శారద ప్రాణస్నేహితులు. శారద సోముతో "అన్నయ్యా! వార్షిక పరీక్షలు ఎలా రాశాను?" అని అడిగింది. "చాలా బాగా రాశాను. క్లాస్ ఫస్ట్ నేనే వస్తాను." అన్నాడు సోము. అది విని సంతోషించారు సోము తల్లిదండ్రులు. ‌ అయితే ఒక్కో సబ్జెక్టులో తనకు అనుమానం ఉన్న బిట్స్ సోము ద్వారా నివృత్తి చేసుకోవాలని అనుకుంది శారద. ఏ ప్రశ్న అడిగినా సోము నోరెళ్ళబెడుతున్నాడు. అన్నయ్య తెలివిపై అనుమానం వచ్చి, చాలా తేలికైన ప్రశ్నలు అడిగసాగింది శారద. సోము మౌనంగా ఉన్నాడు. "అన్నయ్యా! ఇప్పటినుంచైనా మనం పోటీ పడి చదువుదాం. ఇలా చదివితే 10వ తరగతి పాస్ కావడం చాలా కష్టం కదా!" అంది శారద. సోమూకు చాలా అవమానంగా ఉంది. కొన్ని రోజుల దాకా ఎవరిలో కలువలేకపోయాడు.


    వేసవి సెలవులు పూర్తి అయ్యి మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. సోము వాళ్ళ అమ్మ సోముడు తెలియకుండా రామునకు కలసి సోము చదువు గురించి అడిగింది. "ఇకపై సోము పూర్తి బాధ్యత నీదే." అన్నది సోము వాళ్ళ అమ్మ. రాము సోము వద్దకు వచ్చి "మిత్రమా! ఇప్పటి నుంచి అయినా కష్టపడి చదువు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటే నువ్వు చాలా తెలివైన విద్యార్థివి అవుతావు." అన్నాడు రాము. "ప్రతిసారీ దేవునిలా నువ్వు నన్ను పరీక్షల్లో ఆదుకుంటూ ఉండగా నేను కష్టపడటం అవసరమా?" అన్నాడు సోము. "నీ ఖర్మ!" అన్నాడు రాము.


    పరీక్షలు మొదలు అయ్యాయి. సోము రాము రాసే జవాబులు తనకు చూపించమని బతిమాలాడు. రాము చూపించకపోగా ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు సోమును మందలించాడు. సోము రాముతో మాట్లాడటం మానేశాడు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌తర్వాత పరీక్షల్లో సోము ఏమీ రాయలేకపోయాడు. సోము అవస్థలు రాము ద్వారా వాళ్ళ సైన్స్ మాస్టారు శ్రీశైలం గారికి తెలిసింది. సైన్స్ పరీక్షకు ముందురోజు సెలవు వచ్చింది. ఆరోజు శ్రీశైలం గారు సోమూను తన ఇంటికి ఆహ్వానించాడు. సోమూతో ఆప్యాయంగా మాట్లాడుతూ సోమూకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించారు. సోమూను కూర్చోబెట్టి ఆ రోజంతా సైన్సులో ముఖ్యమైన, తేలికైన అంశాలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత తేలికగా అర్థం అయ్యేటట్లు వివరించాడు. మరునాడు సోము ధైర్యంగా పరీక్షను రాశాడు. అన్ని పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు రాగా సైన్సులో నూటికి 40 మార్కులు వచ్చాయి. సోము ఎంతో సంతోషంగా సిరి అనే అమ్మాయితో "నాకు సైన్సులో నూటికి 40 మార్కులు వచ్చాయి తెలుసా?" అన్నాడు. "అంతకు ముందు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి కదా! మరి ఈ మార్కులనే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నావు?" అంది సిరి. అప్పుడు శివానీ కల్పించుకొని "మన తెలుగు మాస్టారు చెప్పింది గుర్తుకు వచ్చిందా సిరీ! అవతలి వాళ్ళ పేపర్లో చూసి రాసి తెచ్చుకొనే 70 మార్కులకన్నా మనం కష్టపడి రాసి సాధించిన 35 మార్కులే మనకు సంతృప్తిని ఇస్తాయని. ఇప్పుడు సోము కష్టపడి తెచ్చుకున్న మార్కులు అనుకుంటా." అని పగలబడి నవ్వింది శివాని.


    అప్పుడు వాసు సోము వద్దకు వచ్చి, "ఆ అమ్మాయిలకు నువ్వంటే ఎంత చులకనగా! నిన్ను చూసి నవ్వుతారా? ఆ రాముగాడు కాకుంటే ఈసారి నేను జవాబులు చూపిస్తా. నా దాంట్లో చూసి రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ రామూకు, ఈ అమ్మాయిలకు బుద్ధి చెప్పరా సోము." అన్నాడు వాసు. "లేదురా! వాళ్ళు నన్ను చూసి హేళనగా నవ్వారని ఎందుకు అనుకోవాలి? శ్రద్ధగా వింటే ఎలాంటి కఠినమైన విషయాలను కూడా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు అని గ్రహించా. ఇప్పటి నుంచి ఇష్టపడి చదివి నిజాయితీగా మంచి మార్కులు తెచ్చుకుంటా." అన్నాడు సోము. "శభాష్ సోము." అంటూ రాము వచ్చి అభినందించాడు.


    9వ తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. "అమ్మా! రేపే మనం అమ్మమ్మ ఇంటికి బయలుదేరుదాం." అన్నాడు సోము. తన కొడుకు ఎందుకు అలా అంటున్నాడో అర్థం చేసుకొని అలాగేరా అంది సోము తల్లి.



Rate this content
Log in