శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Inspirational Children

4  

శ్రీనివాసరాజు కథా రచయిత

Children Stories Inspirational Children

అన్నా చెల్లెళ్ళు

అన్నా చెల్లెళ్ళు

2 mins
355



  వాసు 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో అంతంత మాత్రమే. తీరిక సమయంలో స్నేహితులతో కలిసి గంటల తరబడి ఆటలతో కాలక్షేపం చేయడం అతని నిత్య కృత్యం. వాసు చెల్లెలు వినయ 6వ తరగతి చదువుతుంది. తరగతిలో మొదటి ర్యాంకు ఆమెదే. అమ్మ ప్రతిరోజూ ఇచ్చే పాకెట్ మనీ విసయ దాచుకునేది. ఏదైనా అవసరం వచ్చిన వాటిని కొనుక్కునేది. లేదా స్నేహితులకు ఏదైనా అవసరం వస్తే ఇచ్చేది. వాసు మాత్రం ఆ పాకెట్ మనీతో అనారోగ్యకరమైన చిరుతిళ్ళు కొనుక్కొని తినేవాడు. వాసు తీరిక లేకుండా బయట ఆటలు ఆడేవాడు. పాపం! ఇంటివద్ద వినయతో ఆడేవారు ఎవరూ లేరు.


    వాసు ఇప్పుడు 9వ తరగతి. ఇకనైనా కష్టపడి చదవకుండా ఉంటే 10వ తరగతిలో మరీ ఇబ్బందులు రావచ్చు. అందుకే ఇప్పటి నుంచైనా వాసూను మార్చాలని తల్లి ప్రయత్నిస్తుంది. రాబోయే టర్మ్ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటే అన్నా చెల్లెళ్ళ పాకెట్ మనీ పెంచుతానని అన్నది అమ్మ. ఒకరు తెచ్చుకొని, మరొకరు తెచ్చుకోకుంటే ఇద్దరి పాకెట్ మనీ కలిపి ఒక్కరికే ఇస్తానన్నది అమ్మ.


    వాసు మళ్ళీ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. వినయ రెట్టించిన పట్టుదలతో చదువుతుంది. వాసు మార్కులు బాగా తగ్గినాయి. వినయ మార్కులు మరింత పెరిగాయి. వాసుకు పాకెట్ మనీ ఆగిపోయింది. చెల్లెలు వద్దకు వెళ్ళి, "నా బంగారు తల్లి! అమ్మ నీకు ఇచ్చే డబ్బులో సగం నాకు ఇవ్వవా" అని బతిమాలాడు. "ఎప్పుడైనా నాతో ఆటలు ఆడినావా? ఎంత బతిమాలినా తిట్టుకుంటూ బయటి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళేవాడివి. వారినే అడుగు పాకెట్ మనీ." అన్నది వినయ. ఇలా కొన్ని నెలలు గడిచాయి. 


    వాసు పుట్టినరోజు వచ్చింది. వేడుకలు జరుగుతున్నాయి. వినయ తన పాకెట్ మనీ మొత్తం కూడబెట్టి కొన్న పెద్ద గిఫ్ట్ ప్యాక్ అన్నకు ఇచ్చింది. అన్న దానిని విప్పి చూడగా రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి. అన్న ఆశ్చర్యపోయాడు. అప్పుడు చెల్లెలు ఇలా అంది. "అన్నయ్యా! నా డబ్బులు మొత్తం ఖర్చు చేసి, ఈ బహుమతిని కొన్నాను. ఇది నీ కోసమే. వీటితో నువ్వు ఎవరితో అయినా ఆడవచ్చు." అన్నది. సంతోషించిన అన్న "ఎవరితోనో ఎందుకు? ఇక ప్రతిరోజూ నీతోనే ఆడతాను. ఇక బయటికి వెళ్ళను." అన్నాడు. "పోటీ పడి ఆడుకుందాం. పోటీ పడి చదువుకుందాం." అన్నది చెల్లెలు. "అలాగే తప్పకుండా" అన్నాడు అన్నయ్య. వాసు ఇప్పుడు మారిపోయాడు ‌.




Rate this content
Log in