ఉండదులే
ఉండదులే
1 min
0
అర్థరాత్రి మించి మంచి..సమయమింక ఉండదులే..!
అంతరంగ పయనానికి..అడ్డమింక ఉండదులే..!
లోలోపలి మౌనమెంత..అద్భుతమో మాటలేల..
పరితపించు రాగాలకు..జీవమింక ఉండదులే..!
ఒక ఖాళీ కడుపుతోటి..మమేకమై ఉన్నావా..
దాహమోహ తాపాలకు..స్థానమింక ఉండదులే..!
ప్రశాంతతా మల్లియలే..వర్షముగా కురిసినవా..
పదసుమాల పతంగులకు..గగనమింక ఉండదులే..!
చిరునవ్వుల వీణాధరి..కన్నులెత్తి చూసిందా..
సుస్వరాల సెలయేటికి..తమకమింక ఉండదులే..!
లలితకళా సౌందర్యము..మనసుకింపు కూర్చవచ్చు..
ప్రకృతియారాధన గాక..సరసమింక ఉండదులే..!