అమ్మ ఓ శ్రమ గడియారం !!
అమ్మ ఓ శ్రమ గడియారం !!
అమ్మంటే ఓ అలసిపోని గడియారం
విశ్రాంతి లేకుండా పనిచేసే శ్రమ జీవనం
రాత్రింబవళ్ళు కష్టపడే ఎట్టి కార్మికురాలు
తన రెక్కలు ముక్కలు చేసుకొనే కర్షకురాలు
అమ్మలు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణలు
పాక ప్రావీణ్యంతో కడుపు నింపే పరిపూర్ణలు
లేచింది మొదలు గడియారంలా టిక్ టిక్‌లు
నాగరికతలు నేర్పిన నిత్య నవీన యోధురాలు
కాలం విలువ తెలిసిన శాస్త్రజ్ఞురాలు
ప్రతి గడియ, ప్రతి నిమిషం సమయపాలకులు
ఏ సమయంలో ఆ పనిచేసే విజ్ఞురాలు
కాలానుగుణంగా తన పాత్రలో మార్పులు
సూర్య చంద్రులతో పోటీపడే ఆమె తత్వం
ఆయా ఋతువులతో సరితూగు ఆమె నిత్యం
ఏ కాలమైనా ఆ కాలానికి తగినట్లు సిద్ధం
సమయసారిణితో సరిదిద్దే ఆమె నైపుణ్యం
ఎలాంటి జీతంలేని గౌరవం అపారమైనది
వంటగది దాటని ఆ శ్రమే లోకానికి పునాది
ఆమెను చూస్తే తెలుసు అన్నం పరబ్రహ్మం
దాన్ని సృష్టించే చేతులే నిజ ఆపన్నహస్తాలు
తన కలలన్నీ పిల్లల కలలలో కలిపేసే అమ్మ
జీవితాన్నే వారి భవిష్యత్తుకు అంకితమా తల్లి
నవ్వే ముఖాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు
కన్నీటిని పన్నీరుగా మార్చే కరుణామయి అమ్మ
అమ్మ శ్రమను కొలిచే తూకమేది ఈ జగతిలో
అమ్మ ప్రేమను వర్ణించే భాష ఏది ఈ సృష్టిలో
జన్మనిచ్చిన దేవతకు శిరసు వంచి సలాం
అమ్మతోనే ప్రతి ఇల్లు స్వర్గం, జీవితం పూర్ణం !!
